బిఎస్ఎన్ఎల్‌కు క‌ష్ట కాలం..గ‌ట్టెక్కించేనా కేంద్ర ప్ర‌భుత్వం

దేశానికి విశిష్ట సేవ‌లందించిన అతి కొద్ది కంపెనీల‌లో భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ టెలికాం కంపెనీ ఒక‌టి. భారీ ఉద్యోగుల క‌ష్టంతో దేశ వ్యాప్తంగా బిగ్గెస్ట్ నెట్ వ‌ర్క్ క‌లిగిన బిఎస్ఎన్ఎల్ ఇపుడు నేల చూపులు చూస్తోంది. పాల‌కుల నిర్ల‌క్ష్యం..యాజ‌మాన్యం బాధ్య‌తా రాహిత్యం లాభాల బాట‌లో న‌డిచిన ఈ కంపెనీ ఇపుడు ఎవ‌రు ఆదుకుంటారోన‌ని ఎదురు చూస్తోంది. వేత‌నాల భారం అంత‌కంత‌కూ ఎక్కువ కావ‌డం, నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యం లేక పోవ‌డం, టెండ‌ర్లు ప్రారంభించిన స్థాయిలోనే ఉండ‌టంతో పాటు కేంద్ర స‌ర్కార్ నుంచి ఎలాంటి స్పంద‌న క‌నిపించ‌క పోవ‌డం కూడా మ‌రో కార‌ణం. దివాళా అంచున బిఎస్ఎన్ఎల్‌తో పాటు ఎంటీఎన్ ఎల్ కూడా చేరింది. వీటిని గ‌ట్టెక్కించేందుకు బీజేపీ స‌ర్కార్ నానా తంటాలు ప‌డుతోంది. ఇప్ప‌టికిప్పుడు ఈ రెండింటికి ప్రాణం పోయాలంటే ..కాయ‌క‌ల్ప చికిత్స చేయాలంటే 74 వేల కోట్ల‌కు పైగా బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాల‌ని ప్ర‌తిపాద‌న‌లు పంపించాయి స‌ద‌రు కంపెనీల యాజ‌మాన్యాలు.

సాధ్యాసాధ్యాల‌ను కేంద్రం నిశితంగా ప‌రిశీలిస్తోంది. వ‌చ్చిన నిధుల‌తో ఉద్యోగుల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్యాకేజీని అమ‌లు చేస్తారు. ఎక్కువ మంది స్వ‌చ్చంధ ప‌ద‌వీ విర‌మ‌ణ చేసేందుకు అద‌నంగా 5 శాతం ఎక్స్ గ్రేషియా ఇస్తారు. 4జి స్పెక్ట్ర‌మ్ ను ద‌క్కించు కునేందుకు, క్యాపిట‌ల్ అవ‌స‌రాల‌కు ఈ నిధుల‌ను వినియోగిస్తారు. తాజాగా ప‌రిశీలిస్తే న‌ష్టాల‌తో కునారిల్లుతున్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో బిఎస్ఎన్ఎల్ మొద‌టి స్థానంలో ఉంది. గ‌త ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ లో 13 వేల 904 కోట్ల న‌ష్టాల‌ను చ‌వి చూసింది. ఇక మ‌రో స‌ర్కార్ కంపెనీ 3 వేల 398 కోట్ల న‌ష్టాల‌తో రెండో స్థానంలో ఉండగా ఎయిర్ ఇండియా మూడో స్థానంలో నిలిచింది. భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ కు 4జీ స్పెక్ట్ర‌మ్‌ను కేటాయిస్తారు. నెట్ వ‌ర్క్ విస్త‌ర‌ణ‌కు మ‌రో 13 వేల కోట్ల‌ను కేటాయిస్తారు. వీఆర్ ఎస్ ప్యాకేజీ, ముంద‌స్తు రిటైర్‌మెంట్ ప్ర‌యోజ‌నాల కోసం 40 వేల కోట్లు ఇస్తారు.

గ‌ట్టెక్కించాలంటే మూసి వేయ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. వంద శాతం వాటాల‌ను అమ్మాల‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. బిఎస్ ఎన్ ఎల్ తో పాటు ఎంటీఎన్ఎల్‌ల‌ను క్లోజ్ చేస్తే 1.2 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం వాటిల్లుతుంద‌ని టెలికాం శాఖ వాదిస్తోంది. ప్ర‌స్తుతం టెలికాం రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంద‌ని, దీనిని కొనుగోలు చేసేందుకు ఏ కంపెనీ ముందుకు రాద‌ని అంటోంది. జాయింట్ వెంచ‌ర్ ఏర్పాటు చేయ‌గ‌లిగితే కొంత మేలు జ‌రిగే వీలుంద‌ని అంటోంది. ఈ రెండు కంపెనీల న‌ష్టాల‌కు ప్ర‌ధాన కార‌ణం ఉద్యోగుల జీతాలే. 60 ఏళ్ల నుంచి 58 ఏళ్ల‌కు రిటైర్మెంట్ వ‌య‌సు త‌గ్గించాల‌ని సూచించింది స‌ర్కార్. ట‌వ‌ర్లు, భూములు, ఆప్టిక‌ల్ ఫైబ‌ర్‌ను అమ్మ‌డం ద్వారా ఆదాయం స‌మ‌కూర్చు కోవాల‌ని టెలికాం శాఖ భావిస్తోంది. కాగా జూన్ నెల వేత‌నాల కింద 1.76 ల‌క్ష‌ల ఉద్యోగుల‌కు 850 కోట్లు చెల్లించాల్సి ఉండ‌గా డ‌బ్బులు లేక పోవ‌డంతో చేతులెత్తేసింది. మొత్తం మీద మూసివేత దిశ‌గా స‌ర్కార్ సంస్థ‌లు రెడీగా ఉన్నాయి. ఇదంతా ఏలిన వారి పుణ్యం కాక‌పోతే మ‌రేమిటి...?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!