వీఆర్ఎస్‌కు ఐఏఎస్ ముర‌ళి ద‌ర‌ఖాస్తు ప‌త్రం - గులాబీ స‌ర్కార్‌పై సంధించిన అస్త్రం..!

ఇక నేనుండ‌లేను. ప‌ని లేకుండా ఊరికే ఉండ‌లేను. చేతులు క‌ట్టేసి ప‌ని చేయ‌మంటే ఎలా..నాకు వెళ్లేందుకు కారు కూడా  ఏర్పాటు చేయ‌లేదంటూ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ముర‌ళి. సోష‌ల్ రిఫార్మ్స్  కోసం త‌ప‌న ప‌డే ఈ ఉన్న‌తాధికారికి ఏ.ఆర్. శంక‌రన్ అంటే అభిమానం.  కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కొలువు తీరిన కేసీఆర్ ప్ర‌భుత్వంపై వీఆర్ ఎస్ అస్త్రాన్ని సంధించారు. ఇక నేను ఈ కొలువు చేయ‌లేనంటూ ప్ర‌క‌టించారు. ఈ విష‌యం తెలంగాణ‌లో సంచ‌ల‌నం క‌లిగించింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆయ‌న ప్ర‌ధానంగా ఈ ప్ర‌భుత్వ ప‌నితీరుపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు కూడా చేశారు. ప్ర‌చారానికి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న దాంట్లో క‌నీసం 20 శాతం ఖ‌ర్చు చేయ‌గ‌లిగితే విద్యా వ్య‌వ‌స్థ గాడిన ప‌డేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఆయ‌న ప్ర‌ధాన‌మైన ఆరోప‌ణ లేదా ఆవేద‌న మొత్తం భ్ర‌ష్టు ప‌ట్టి పోయిన విద్యా రంగం గురించే. వ్య‌క్తిగ‌తంగా కొంత విభేదించిన‌ప్ప‌టికీ ..ఆయ‌న చెప్పిన దాంట్లో 100 శాతం వాస్త‌వమే.

ఈరోజు వ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లోని పాఠ‌శాల‌ల్లో ఎంత మంది టీచ‌ర్లుగా ప‌నిచేస్తున్నారు..? ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పండంటూ సాక్షాత్తు దేశంలోని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ధ‌ర్మాస‌నం సూటిగా ప్ర‌శ్నించింది. స్వ‌తంత్రం వ‌చ్చి ఏళ్లు గ‌డిచినా ఇంకా ఈ వ్య‌వ‌స్థ రాచ‌పుండు లాగా మారి పోయింది. దీనికి చికిత్స చేసేందుకు మందులు లేవు. స‌మూలంగా మార్చితేనే త‌ప్పా. దీనికి ఎవ‌రో ఒక‌రు ముందుకు రావాలి. ముర‌ళి కొంత కాలంగా ఈ ప్ర‌భుత్వ పనితీరుపై, పాల‌నా వ్య‌వ‌హారాల‌పై అసంతృప్తితో ఉన్నారు. ఆయ‌న క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌తో క‌లిసి పోయేందుకు ప్ర‌య‌త్నం చేశారు. కానీ అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఎంపిడిఓల‌పై ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మైన విమ‌ర్శ‌ల‌కు దిగ‌డంతో రాష్ట వ్యాప్తంగా తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ప్ర‌జ‌ల‌ను ప్రేమిస్తున్నాన‌ని, ప్ర‌జా సేవ చేస్తున్నాన‌ని , స‌మాజానికి ఎంతో కొంత చేశాన‌ని చెప్పుకుంటూ వ‌చ్చిన ఈ ఉన్న‌తాధికారి ..సాటి ఉద్యోగుల ప‌ట్ల క‌నీసం క‌న్స‌ర్న్ లేక పోవ‌డం ఆశ్చ‌ర్యం అనిపించింది. మ‌రో వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐఏఎస్‌ల‌కు స‌రైన ప్రాధాన్య‌త ల‌భించ‌డం లేద‌ని వాపోయారు.

ఇక్క‌డే విచిత్రం అనిపించింది. ఐఏఎస్ అయిన‌ప్ప‌టి నుంచి అధికార హోదాలోనే ఉన్నారు. వేత‌నం తీసుకున్నారు. అది ఆయ‌న బాధ్య‌త‌. ప్ర‌భుత్వాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే రాజ‌కీయాల‌తో క‌లిసి పోయి ఉన్నాయి కాబ‌ట్టి. సెర్ప్ లో ప‌నిచేశాన‌ని..కోటి మందికి ఉపాధి క‌ల్పించాన‌ని చెప్పుకొచ్చారు. అది కూడా రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు. రాజు, రాజ‌శేఖ‌ర్, ఉషారాణి, మీరా షెనాయ్ త‌దిత‌రులు అంతా ప‌నిచేశారు. అక్క‌డ కూడా తీవ్ర వివ‌క్ష కొన‌సాగింది. అందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ నేనే. ఏ రాజకీయ పార్టీలో చేర‌న‌ని చెప్పారు. స‌రే అది ఆయ‌న వ్య‌క్తిగ‌తం కాద‌న‌లేం. కానీ ఇదే వీఆర్ ఎస్ ఒక 15 ఏళ్ల ముందు తీసుకుని..సోష‌ల్ స‌ర్వీస్ లోకి దిగి వుంటే బావుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ ప్ర‌భుత్వం ద‌ళితుల జ‌పం చేస్తోంది. ఈ రాష్ట్రంలో దాదాపు 59 శాతానికి పైగా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల వారున్నారు. వారికి ఎలాంటి ప్రాధాన్య‌త కానీ ప్రాతినిధ్యం క‌నిపించ‌డం లేదు. రెడ్లు, క‌మ్మ‌, బ్రాహ్మ‌ణ‌, వెల‌మ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు అధికంగా ఉన్నారు. అన్ని రంగాల‌లో వారిదే ఆధిప‌త్యం. ప్ర‌తి చోటా అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతూనే ఉంటాయి. వాటిని దాటుకుంటూ వెళ్లి పోవ‌డ‌మే ముఖ్యం.

ఈ దేశంలో ఎంద‌రో నిబ‌ద్ధ‌త క‌లిగిన ఐఏఎస్ అధికారులు స‌మాజంలో భాగం పంచుకుంటున్నారు. నిర్దేశించిన బాధ్య‌త‌ల‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నారు. అలాంటి వారిలో చాలా మంది ఇప్ప‌టికే పాపుల‌ర్ కూడా అయ్యారు. ఇక సీఎస్‌కు తాను వీఆర్ ఎస్ చేసుకుంటున్నాన‌ని త‌క్ష‌ణ‌మే ఆమోదించాల‌ని కోరుతూ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అది ఆగ‌స్టు 31 నుంచి ఇవ్వాల‌ని కోరారు. విద్యా రంగాన్ని బాగు చేయ‌డ‌మే త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని చెబుతున్న ముర‌ళిని అభినందిద్దాం. అన్నిటికంటే విద్యా వ్యాపారంగా మారిన చోట విలువ‌ల‌కు చోటుండ‌దు. ప్ర‌జ‌ల‌ను ప్రేమించిన వారు ఎంద‌రో ఇలాంటి క‌ష్టాలే అనుభ‌వించారు. ఏది ఏమైనా ఈ నిర్ణ‌యం ప‌లు సంచల‌నాల‌కు తెర లేపింద‌న్న‌ది వాస్త‌వం. రేపు ఆయ‌న బాట‌లో ఇంకెంద‌రు ఉన్నార‌నేది వేచి చూడ‌క త‌ప్ప‌దు. ఇక కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. 

కామెంట్‌లు