కాంగ్రెస్‌కు తీర‌ని లోటు .. షీలా దీక్షిత్ ఇక లేరు..!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీ ఢిల్లీ ముఖ్య‌మంత్రి షీలా దీక్షిత్ క‌న్ను మూశారు. గ‌త కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. గొప్ప నాయ‌కురాలిగా , ప‌రిపాల‌నాద‌క్షురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. శ‌నివారం గుండె పోటు రావ‌డంతో కుటుంబీకులు ఎస్కార్ట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయినా ఫ‌లితం లేక పోయింది. గొప్ప లీడ‌ర్‌ను ఈ దేశం కోల్పోయింది. ఆమె మృతితో కాంగ్రెస్ పెద్ద దిక్కును కోల్పోయింది. అపారమైన అనుభ‌వం క‌లిగిన ఆమె స్వ‌త‌హాగా మృదు స్వ‌భావి. వైరి వ‌ర్గాలైన‌ప్ప‌టికీ, విప‌క్షాల నేత‌లు సైతం షీలా దీక్షిత్ ప‌ట్ల గౌర‌వ భావాన్ని ప్ర‌ద‌ర్శించే వారు. చ‌నిపోయే నాటికి ఆమె వ‌య‌స్సు 81 ఏళ్లు. భార‌త రాజ‌కీయాల‌లో ఆమెకు ఒక ప్ర‌త్యేక‌మైన స్థానం ఉన్న‌ది. కార్య‌క‌ర్త‌లు, నేత‌ల సంద‌ర్శనార్థం కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి పార్థివ దేహాన్ని త‌ర‌లించారు. ఢిల్లీకి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌య్యారు. ఆమె కాలంలోనే అభివృద్ధి ప‌నులు జ‌రిగాయి.

షీలా దీక్షిత్ మృతి త‌న‌ను ఎంత‌గానో క‌లచి వేసిందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు భార‌త దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఒక గొప్ప నేత‌ను ఈ దేశం కోల్పోయిందంటూ భార‌త రాష్ట్ర‌ప‌తి పేర్కొన‌గా ..ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప్ర‌గాఢ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. మ‌రో వైపు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీనియ‌ర్ నేత‌లు ఆమె మృతి త‌మ పార్టీకి తీర‌ని లోటుగా అభివ‌ర్ణించారు. పెద్ద దిక్కును కోల్పోయామ‌న్నారు. షీలా దీక్షిత్ పంజాబ్‌లోని క‌పుర్త‌లాలో జ‌న్మించారు. ఢిల్లీ యూనివ‌ర్శిటీలో చ‌రిత్ర స‌బ్జెక్టుతో ఎంఏ చేశారు. అనుకోని రీతిలో పాలిటిక్స్‌లోకి ఎంట‌ర్ అయ్యారు. ఆమె మామ ఉమా శంక‌ర్ దీక్షిత్ స్వాతంత్ర స‌మ‌ర యోధుడు. ఇందిరాగాంధీ స‌ర్కార్‌లో కేబినెట్ హోదాలో ప‌ని చేశారు. ఆ స‌మ‌యంలోనే త‌న మామ అందించిన స్ఫూర్తితో రాజ‌కీయాల‌ను వంట బ‌ట్టించుకున్నారు ఆమె. షీలా దీక్షిత్ లో ఉన్న ప‌ట్టుద‌ల‌ను చూసిన ఇందిరాజీ..ఏకంగా యునైటెడ్ నేష‌న్స్ క‌మిష‌న్‌లో భార‌త ప్ర‌తినిధిగా నామినేట్ చేశారు.

అక్క‌డి నుంచి ఆమె త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. 1984లో యూపీలోని క‌న్నౌజ్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి లోక్‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. 1986-1989 వ‌ర‌కు కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. 1998లో అనూహ్యంగా ఓట‌మి చెందారు. అదే ఏడాదిలో ఢిల్లీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి..ఏకంగా ఢిల్లీ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టి నుంచి 2013 వ‌ర‌కు దేశ రాజ‌ధానికి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. సుష్మా త‌ర్వాత ఢిల్లీకి రెండోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌హిళ‌గా షీలా దీక్షిత్ చ‌రిత్ర సృష్టించారు. 2014లో కేర‌ళ స్టేట్‌కు గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మితుల‌య్యారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమెను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది పార్టీ హై క‌మాండ్. ఆమె దానిపై ఆస‌క్తి చూపించ‌లేదు. తిరిగి ఢిల్లీకి వ‌చ్చి..కాంగ్రెస్ క‌మిటీ ఉపాధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!