తెప్ప‌రిల్లిన తెలంగాణ - జాడ‌లేని వాన‌లు..అంతులేని క‌ష్టాలు

కోరి తెచ్చుకున్న తెలంగాణ‌లో నీళ్లు లేవు..నిధులు లేవు..నియామ‌కాలు అస‌లే లేవు. బంగారు తెలంగాణ మాటేమిటో కానీ ..ఉన్న తెలంగాణ ఆగ‌మాగ‌మై పోయింది. వాన‌లు లేక ..వ‌రుణ దేవుడు క‌రుణించ‌క ..పొలాలు నెర్రెలు బారిన‌వి..పంట‌లు ఎండిపోతున్న‌వి. ఏకంగా 433 మండ‌లాలు దుర్భిక్ష ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయ‌ని సాక్షాత్తు తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ కేంద్ర స‌ర్కార్‌కు నివేదించింది. ఇక రాబోయే కాలం గ‌డ్డు పరిస్థితే. త‌లుచుకుంటేనే వెన్నులో వ‌ణుకు పుడుతోంది. ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించాల్సిన స‌ర్కార్ నివేదిక‌ల‌ను రూపొందించ‌డంలో నిమ‌గ్న‌మైంది. వ్య‌వ‌సాయ యూనివ‌ర్శిటీ ఎందుకుందో దాని వ‌ల్ల ఎవ‌రికి మేలు జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. వేలాది మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఇంత వ‌ర‌కు ప‌రిహారం ద‌క్కిన పాపాన పోలేదు. వాన జాడ‌లు లేక పోవ‌డంతో అన్న‌దాత‌లు ఆకాశం కేసి చూస్తున్నారు. బ‌తుకు దెరువు లేక వ‌ల‌స బాట ప‌డుతున్నారు. జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం అక్ర‌మార్కుల‌కు వ‌రంగా మారింది.

ప్ర‌ధాన పంట‌ల‌ను వేయొద్ద‌ని, ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను సాగు చేసేలా రైతుల‌ను ప్రోత్స‌హించాల‌ని వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. ఇక యాదాద్రి, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ జిల్లాలోని ఒక్క మండ‌లంలో కూడా సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదు కాక పోవ‌డం గ‌మ‌నార్హం. సూర్యాపేట‌లో ఒకే ఒక్క మండ‌లంలో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. 433 మండ‌లాలు క‌ర‌వుకు కొండ గుర్తుగా మారిపోయాయి. నైరుతీ రుతు ప‌వ‌నాలు ప‌ల‌క‌రించ‌క పోవ‌డంతో రాబోయే కాలంలో క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్రల నుంచి వ‌చ్చే నీటి కోసం ఆధార ప‌డాల్సిన ప‌రిస్థితి దాపురించింది. కారు మ‌బ్బులు లేవు..సూర్య‌కిరణాల తాకిడి ఎక్కువ‌గా ఉంటోంది. తేలిక పాటి వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ పాత పాటే పాడుతోంది. ఈ ప‌రిస్థితుల్లో రైతులు నీటిని ఎక్కువ‌గా వాడే పంట‌లు వేయొద్ద‌ని వేడుకుంటోంది. సాధార‌ణ వ‌ర్ష‌పాతం 232.7 మిల్లీమీట‌ర్లు కురియాల్సి ఉండ‌గా కేవ‌లం 152.2 మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష‌మే కురిసింది.

కొన్ని మండ‌లాల్లో వ‌ర్షపాతం లోటు 90 శాతానికి మించి పోయింది. 60 శాతానికి మించితే..దానిని క‌రవు ప్రాంతంగా ప్ర‌క‌టిస్తారు. ఇప్ప‌టికే వ‌ర్షం వ‌స్తుంద‌ని..త‌మ‌ను క‌రుణిస్తుంద‌ని ఆశ‌తో ఉన్న రైతాంగం తెలంగాణ‌లో ఏకంగా 40 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌లు సాగు చేశారు. వాటికి నీరంద‌క ప్రారంభంలోనే పైర్లు ఎండి పోతున్నాయ‌ని..మ‌రో ప‌ది రోజుల్లో వ‌ర్షపు చినుకులైనా ప‌డ‌క పోతే..ఉన్న‌వ‌న్నీ ఎండిపోతాయ‌ని పేర్కొంది. హైద‌రాబాద్, భ‌ద్రాచ‌లం, త‌దిత‌ర ప్రాంతాల‌న్నీ ఎండాకాలాన్ని త‌ల‌పింప చేస్తున్నాయి. ఇప్ప‌టికే నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి. గుండెల్ని పిండేస్తున్నాయి. జేబులు గుల్ల చేస్తున్నాయి. ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ లేదు..నియంత్ర‌ణ‌కు దిక్కు లేదు. మినుములు, పెస‌ర్లు, వేరుశ‌న‌లు, సోయా చిక్కుడు లాంటి పంట‌లు ఇక బంద్ చేయ‌మంటూ వ్య‌వ‌సాయ యూనివ‌ర్శిటీ సంచాల‌కుడు జ‌గ‌దీశ్ తాపీగా సెల‌విచ్చారు. ఇక అన్నం పెట్టిన రైతుల‌కు అడుక్కోవ‌డ‌మే మిగిలింది..బంగారు తెలంగాణ మాటేమిటో కానీ బొంద‌ల గ‌డ్డ తెలంగాణాగా మారే ప్ర‌మాదం పొంచి వుంద‌న్న‌ది వాస్త‌వం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!