తెలంగాణ‌లో తీన్మార్..టీఆర్ఎస్ జోర్దార్

ఎవ‌రైనా ఓట‌మిని తేలిగ్గా తీసుకుంటారు. ఇంకొంద‌రు నాయ‌కులు అస‌లు అప‌జ‌యాన్ని ఒప్పుకోరు. విజ‌యం సాధించే దాకా నిద్రపోరు. భార‌త‌దేశంలో అలాంటి కోవ‌కు చెందిన అగ్ర‌నేత‌ల్లో వేళ్ల మీద లెక్కించే వారు మాత్ర‌మే ఉన్నారు. అందులో తెలంగాణ రాష్ట్ర ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఒక‌రు. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ప్ప‌టి నుంచి నేడు రెండోసారి ముఖ్య‌మంత్రి అయ్యేంత దాకా..అడుగుల‌న్నీ గెలుపు వైపే. ఓట‌మి రుచించ‌దు. స‌క్సెస్‌లోని మ‌జాను కేసీఆర్ ఆస్వాదించినంత‌గా ఇంకెవ్వ‌రూ ఆస్వాదించ‌లేరు. ప‌క్కా ప్ర‌ణాళిక‌, పార్టీ శ్రేణుల‌కు దిశా నిర్దేశ‌నం చేయ‌డం. ద‌గ్గ‌రుండి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం. సీనియ‌ర్ల‌ను పుర‌మాయించ‌డం. కింది స్థాయి నుండి పై స్థాయి వ‌ర‌కు మానిటరింగ్ చేయ‌డం. డిజిట‌ల్ మీడియాతో పాటు సామాజిక మాధ్య‌మాల‌ను వాడుకోవ‌డం. ఆయ‌న‌కు తెలిసినంత‌గా ఇంకే నేత‌కు తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదేమో. 

తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి మింగుడుప‌డ‌ని రీతిలో ఫ‌లితాలు వ‌చ్చాయి. ప్ర‌జా తీర్పును గౌర‌విస్తామంటూనే..ప్రాదేశిక ఎన్నిక‌ల్లో గులాబీ స‌త్తా ఏమిటో రుచి చూపించాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. పోయిన ప‌రువును తిరిగి తీసుకు వ‌చ్చేందుకు టీఆర్ఎస్ అధ్య‌క్షుడు కేటీఆర్ ఛాలెంజ్ గా తీసుకున్నారు. అన్ని జిల్లాల అధిప‌తుల‌కు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ద్వితీయ శ్రేణి నాయ‌కులంద‌రినీ గెలుపొందేందుకు కావాల్సిన స‌పోర్ట్ అంద‌జేశారు. ఏ ఒక్క‌టి ప్ర‌తిప‌క్షాల‌కు పోకూడ‌ద‌నే ఉద్ధేశంతో ఆయ‌న ముందుండి న‌డిపించారు. ఇవాళ వెలువ‌డిన ఫ‌లితాల్లో అద్భుత‌మైన విజ‌యాలు సాధించి గులాబీ జెండాలు రెప రెప‌లాడేలా చేశాయి. కారు జోరుకు విప‌క్షాలు బేజార‌య్యాయి. ఎక్క‌డా స్ప‌ష్ట‌మైన పోటీని ఇవ్వ‌లేక చ‌తికిల‌ప‌డ్డాయి. 

మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో జ‌య‌కేత‌నం ఎగుర వేసిన అధికార పార్టీ..ప్రాదేశిక ఎన్నిక‌ల్లో త‌న‌కు ఎదురే లేకుండా పోయింద‌ని స్ప‌ష్టం చేసింది. తెలంగాణ‌లోని అన్ని జిల్లాలు తెరాస ఖాతాల్లోకి వెళ్లాయి. చైర్ ప‌ర్స‌న్, వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వుల‌న్నీ ఆ పార్టీ స‌భ్యుల‌కే ద‌క్కాయి. కో ఆప్ష‌న్ స‌భ్యులు కూడా వారు సూచించిన వారికే ద‌క్కాయి. వ‌చ్చే నెల 5న వీరంతా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. అన్ని చోట్లా స్ప‌ష్ట‌మైన ఆధిప‌త్యం వ‌హించిన ఆ పార్టీ ఆదిలాబాద్ మిన‌హా అంత‌టా ఏక‌గ్రీవంగా జ‌డ్పీ పీఠాల‌ను కైవ‌సం చేసుకుని రికార్డు సృష్టించింది. ఇక జిల్లాల వారీగా చూస్తే..ఆదిలాబాద్ జిల్లా ప‌రిషత్ ఛైర్మ‌న్‌గా రాథోడ్ జ‌నార్ద‌న్, వైస్ ఛైర్మ‌న్ గా రాజ‌న్న ఎన్నిక‌య్యారు. కొమురం భీం జిల్లాకు ల‌క్ష్మి, కోనేరు కృష్ణ‌, నిర్మ‌ల్ జిల్లాకు విజ‌య‌ల‌క్ష్మి, సాగ‌ర్ బాయి ఎన్నిక‌య్యారు. 

మంచిర్యాల జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ గా భాగ్య‌ల‌క్ష్మి, వైస్ ఛైర్మ‌న్‌గా స‌త్య‌నారాయ‌ణ ఎన్నిక కాగా, క‌రీంన‌గ‌ర్‌కు విజ‌య , గోపాల‌రావు, సిరిసిల్లకు అరుణ‌, వేణు, జ‌గిత్యాల‌కు వ‌సంత‌, హ‌రిచ‌ర‌ణ్ రావు, పెద్ద‌ప‌ల్లికి మ‌ధు, రేణుక‌, నిజామాబాద్ జిల్లాకు విఠ‌ల్ రావు, ర‌జిత ఎన్నిక‌య్యారు. కామారెడ్డి జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్‌గా శోభ‌, వైస్ ఛైర్మ‌న్ గా ప్రేమ్ కుమార్ , ఖ‌మ్మంకు క‌మ‌ల్ రాజు, ధ‌న‌లక్ష్మి, కొత్త‌గూడెంకు క‌న‌క‌య్య‌, చంద్ర‌శేఖ‌ర్ రావు, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌కు సుధీర్ కుమార్, శ్రీ‌రాములు, వ‌రంగ‌ల్ రూర‌ల్‌కు జ్యోతి, ఆకుల శ్రీ‌నివాస్, ములుగుకు జ‌గ‌దీశ్వ‌ర్, నాగ‌జ్యోతి, భూపాల‌ప‌ల్లికి శ్రీ‌హ‌ర్షిణి, శోభ‌, మ‌హ‌బూబాబాద్‌కు బిందు, వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, జ‌న‌గామ జిల్లాకు సంప‌త్ రెడ్డి, భాగ్య‌ల‌క్ష్మి ఎన్నిక‌య్యారు. 

సిద్ధిపేట జెడ్పీ ఛైర్మ‌న్‌గా రోజా శ‌ర్మ‌, వైస్ ఛైర్మ‌న్ గా రాజారెడ్డి ఎన్నిక కాగా మెదక్‌కు హేమ‌ల‌త‌, లావ‌ణ్యా రెడ్డి, న‌ల్ల‌గొండ‌కు న‌రేంద‌ర్ రెడ్డి, ఇరిగి పెద్ద‌య్య‌, యాదాద్రి భువ‌న‌గిరికి సందీప్ రెడ్డి, బిక్కూ నాయ‌క్, సూర్యాపేట‌కు దీపిక‌, వెంక‌ట నారాయ‌ణ‌, రంగారెడ్డి జెడ్పీ ఛైర్మ‌న్ గా తీగ‌ల అనితా రెడ్డి, వైస్ ఛైర్మ‌న్ గా గ‌ణేష్, సంగారెడ్డికి మంజుశ్రీ‌, కుంచాల ప్ర‌భాక‌ర్, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్ గిరికి శ‌ర‌త్ చంద్రా రెడ్డి, వెంక‌టేశ్‌, వికారాబాద్‌కు ప‌ట్నం సునీతా రెడ్డి, విజ‌య కుమార్ , మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు స్వ‌ర్ణ సుధాక‌ర్ రెడ్డి, యాద‌య్య‌, వ‌న‌ప‌ర్తికి లోక్ నాథ్ రెడ్డి, వామ‌న్ గౌడ్, నారాయ‌ణ‌పేట‌కు వ‌న‌జ‌, గౌని సురేఖ‌, జోగుళాంబ గ‌ద్వాల జిల్లాకు స‌రిత‌, స‌రోజ‌మ్మ‌లు ఎన్నిక‌య్యారు. కొత్త ర‌క్తంతో కొత్త పాల‌న కొన‌సాగ‌నుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!