- నేను చనిపోయాక నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి - తండ్రి బాటలో తనయుడు
తప్పులు అందరూ చేస్తారు..కానీ కొందరే వాటిని గుర్తించి మళ్లీ తప్పులంటూ చేయకుండా వుండేందుకు ప్రయత్నిస్తారు. గొప్ప వారుగా రాణించేందుకు కృషి చేస్తారు. అవినీతి, ఆరోపణలు ఎదుర్కొని..కేసుల దాకా వెళ్లి..జైలుపాలై ..చివరికి బయటకు వచ్చి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా తనను తాను మల్చుకుంటున్నారు. ప్రజల పక్షపాతిగా ..జనహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తున్నారు జగన్. ఓ వైపు ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడ్డారు. ఏటికి ఎదురీదారు. ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు. జనం బాధలను విన్నారు. వారి కష్టాలను దగ్గరుండి చూశారు. అందుకే ఆయనకు ఏపీ జనం బ్రహ్మరథం పట్టారు. అనూహ్యమైన విజయాన్ని కట్టబెట్టారు.
ఈ గెలుపు ఇచ్చిన కిక్‌తో జగన్ సంతృప్తి చెందలేదు. తన ముందున్న సవాళ్లను గుర్తించారు. తన కర్తవ్యం ఏమిటో ప్రజలకు చెప్పారు. ఇక నుంచి అవినీతి అంటూ లేకుండా చేస్తానని ప్రకటించారు. ఎవరైనా ఒక్క పైసా వసూలు చేసినా ఉద్యోగులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఏకంగా ప్రజాదర్భార్ పేరుతో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నేరుగా తన మొబైల్ నెంబర్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలను గౌరవించాలని, వారి సమస్యలను సిబ్బంది, ఉద్యోగులు తప్పనిసరిగా వినాలని, యుద్ధ ప్రాతిపదికన అక్కడికక్కడే పరిష్కరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై ప్రతి సోమవారం స్పందన పేరుతో నిర్వహించాలని, ప్రతి శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరు కావాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు జగన్.
ప్రజా వేదికగా ..స్పందనలో వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని, ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో తెలియ చేయాలని సీఎం తెలిపారు. త్వరలో తాను రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని జగన్ వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను తాను పరిశీలిస్తానని ఎన్ని రోజుల్లో పరిష్కరించారో చూస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్ల సదస్సులో సీఎం దిశా నిర్దేశం చేశారు. తాను చనిపోయాక..తన ఫోటో ప్రతి ఇంట్లో వుండాలన్నదే తన ఆశయమని ..ఆ కోరిక నెరవేరాలంటే ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నా ఫోటో వుండేందుకు తపన పడుతున్నా, కృషి చేస్తున్నా. ఆయా జిల్లాల బాధ్యులుగా పనిచేస్తున్న కలెక్టర్లు ఆదర్శవంతంగా పనిచేయాలి. వాళ్లు ఇతర ప్రదేశాలకు బదిలీపై వెళ్లినా లేక బాధ్యతల నుంచి రిటైర్ అయినా ..జనం తలుచుకునేలా పనితీరు ఉండాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ప్రజల ముందు ప్రకటించామని, అది జనానికి భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా ఉండాలన్నారు.
ఎన్నికల ప్రణాళికలోని ప్రతి అంశమూ అర్హులైన ప్రతి ఒక్కరికి చెందాలి. లబ్ధిదారుడు మన పార్టీనా లేక ప్రతిపక్ష పార్టీనా చూడకండి. అన్ని కలెక్టరేట్‌లలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి స్పందన అని పేరు పెట్టి..విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేపట్టాలన్నారు. తప్పనిసరిగా రశీదు ఇవ్వాలన్నారు. రచ్చబండ కార్యక్రమంలో పర్యటిస్తానని, ప్రతి పనిని తనిఖీ చేస్తానని హెచ్చరించారు జగన్. జిల్లాల కలెక్టర్లు సోమవారం ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించొద్దంటూ ఆదేశించారు. ఆయా శాఖల విభాగాధిపతులు, కార్యదర్శలు ఇదే పద్ధతిని పాటించాలని స్పష్టం చేశారు. కలెక్టర్‌తో సహా జిల్లాల్లో పనిచేసే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు , అధికారులంతా ప్రభుత్వ వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వారంలో ఒక రోజు రాత్రి బస చేయాలని ఆదేశించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. అధికారులంతా తమ పడకలను తామే తీసుకుని అక్కడ నిద్ర పోవాలని సూచించారు. పిల్లలకు పుస్తకాలు అందుతున్నాయా లేదా అనేది చూడాలి. వచ్చే ఉగాదికల్లా 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి