కేంద్ర సర్కార్ నిర్ణయంపై రాష్ట్రాలు గరం గరం
ఇప్పటికే ఇంగ్లీషు భాష మోజులో పడిపోయిన భారతీయులు తప్పనిసరిగా హిందీని నేర్చుకోవాలన్న నిబంధనను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ వివిధ రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో డిఎంకే అధినేత స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పీఎం మోదీకి. ఎట్టి పరిస్థితుల్లోను తాము ఒప్పుకోబోమంటూ స్పష్టం చేశారు. తమ భాష తర్వాతే ఏ భాష అయినా, మీరెవ్వరు ..మీ పెత్తనం మా మీద ఏమిటంటూ ఆయన నిప్పులు చెరిగారు. అంతేకాదు తమ భాష అస్తిత్వానికి భంగం కలిగించే రీతిలో నిర్ణయాలు తీసుకుంటే రాబోయే రోజులలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
హిందేయేతర రాష్ట్రాల్లో హిందీ భాషా బోధన తప్పనిసరి చేయాలన్న కస్తూరి రంగన్ కమిటీ సిఫారసులను వివిధ రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. చాలా చోట్ల మోదీకి వ్యతిరేకంగా తమిళులు ప్రదర్శన చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలలో భాషాభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మాతృభాషను మరిచి పోయే స్థితికి చేరుకున్నామని ఈ సమయంలో కేంద్ర సర్కార్ ఆశనిపాతంలా ఇలాంటి ఒంటెద్దు పోకడలతో నిర్ణయాలు ప్రకటించడం మంచి పద్ధతి కాదంటూ నిప్పులు చెరిగారు స్టాలిన్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకే బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. 38 ఎంపీ సీట్లకు గాను 36 సీట్లు గెలుచుకుంది. తన సత్తా ఏమిటో చాటింది.
కేంద్ర సర్కార్ తన హిందూత్వ ఎజెండాను ఇతర రాష్ట్రాలపై రుద్దాలని చూస్తోందని, అందులో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకుందంటూ ఆయన పేర్కొన్నారు. కేంద్ర సర్కార్ కొలువు తీరిన వెంటనే ..దేశమంతటా ఒకే విధానం..ఒకే సిలబస్‌తో పాటు త్రిభాషా విధానాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. అంటే తెలుగు, ఇంగ్లీష్ తో పాటు హిందీ సబ్జెక్టును ఇక నుంచి విద్యార్థులు తప్పనిసరిగా చదవాల్సి వుంటుంది. దీంతో కేంద్ర సర్కార్ కు గట్టి సెగ తగలడంతో ..హుటాహుటిన కేంద్ర విద్యా శాఖ మంత్రి కాకుండా విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందించారు. ఈ అంశంపై రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మానవ వనరుల శాఖకు జాతీయ విద్యా విధానంపై అందింది కేవలం ముసాయిదా మాత్రమే. దీనిపై ప్రజల నుండి అభిప్రాయాలను తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తాం. ఆ తర్వాత అందరికీ ఆమోదపరమైన నిర్ణయాన్ని తీసుకునేలా ఆలోచిస్తామని వెల్లడించారు. మొత్తం మీద నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి అమిత్ షా చీవాట్లు పడితే..ఇపుడు త్రిభాషా విధానంపై మరోమారు కేంద్ర సర్కార్ వివరణ ఇచ్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెజారిటీ ఉంది కదా అని ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటే జనం ఊరుకుంటారేమో కానీ..రాష్ట్రాలు మౌనంగా ఉండవని గుర్తిస్తే చాలు. ఈ అంశంపై సీపీఎం పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. ఈ నిర్ణయాన్ని తాము ఒప్పుకోబోమంటూ పేర్కొంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి