సమాజ హితమే లక్ష్యం..జనరంజక పాలనే ముఖ్యం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో ఊహించని రీతిలో అపూర్వమైన జనాదరణ పొందటమే కాకుండా థంబింగ్ మెజారిటీని సాధించి పవర్‌లోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి జనరంజక పాలన వైపు అడుగులు వేస్తున్నారు. అపర చాణుక్యుడిగా, జగమెరిగిన నేతగా , జాతీయ స్థాయిలో పేరొందిన చంద్రబాబునాయుడుకు జీవితంలో కోలుకోలేని షాక్ ఇచ్చారు వైసీపీ అధినేత. ఎన్నో అవమానాలు, దూషణలు ఎదుర్కొని..జైలు పాలైన జగన్..ఫీనిక్స్ పక్షి లాగా తిరిగి తన పవర్ ఏమిటో రుచి చూపించారు. తన తండ్రి నుంచి వారసత్వాన్ని..తన తాత రాజారెడ్డి నుంచి వచ్చిన ధైర్యాన్ని పుణికి పుచ్చుకున్న ఈ యువ నాయకుడు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అవమానాలను భరించారు. ప్రజా పోరాట యాత్రను చేపట్టారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందంటూ నిప్పులు చెరిగారు. ఆయన జనం మధ్యలోనే ఉన్నారు. అసెంబ్లీలో కంటే ఎక్కువగా ప్రజలతో కలిసి పోయారు. తన వ్యూహాలకు పదును పెట్టారు. తనకంటూ ఓ నమ్మకమైన టీంను ఏర్పాటు చేసుకున్నారు.
ట్రబుల్ షూటర్‌గా, పక్కా స్ట్రాటజిస్ట్ గా..ప్లానర్‌గా పేరొందిన ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సూచనలు, సలహాలను తూచ తప్పకుండా పాటించారు. ఏకంగా 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. ఓ వైపు చంద్రబాబు అతి ఆత్మవిశ్వాసాన్ని పసిగట్టిన జగన్ చాప కింద నీరులా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆ విషయాన్ని బాబు అండ్ టీం గుర్తించలేక పోయారు. అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిపోయిన ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో, వాళ్లకు అర్థఃం చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. తాను ఏం హామీలు ఇస్తున్నానో దానిని కచ్చితంగా అమలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఆ దిశగా దేశంలో అపూర్వమైన విజయాన్ని స్వంతం చేసుకున్నారు. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను 175 కు గాను వైసీపీ చేజిక్కించుకుని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది టీడీపీ అధినేతకు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల్లో 25 స్థానాలకు గాను22 స్థానాల్లో వైసీపీ జెండా ఎగుర వేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వచ్చేంత దాకా నిద్రపోనంటూ ప్రకటించారు. దమ్ముంటే తనతో ఢీకొనాలని బాబుకు జగన్ సవాల్ విసిరారు. చాలా పకడ్బందీగా ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఎవరినీ తన దరిదాపుల్లోకి రానివ్వలేదు. తన స్ట్రాటజీని పూర్తిగా మార్చేసుకున్నారు. తాను చూశాను..విన్నాను..చేస్తాను అన్న స్లోగన్‌తో జనంలోకి వెళ్లి పోయారు జగన్. ఎక్కడికి వెళ్లినా ప్రజలు జేజేలు పలికారు. పక్క రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చెలిమి చేశారు. ఆయన అనుభవం జగన్‌కు ఎంతగానో పనికి వచ్చింది. ఆ తర్వాత తిరుమలను దర్శించుకున్నారు. చిన్నజీయర్ స్వామితో పాటు శారదా పీఠం అధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. ఇక బాబుకు వెన్నంటి వున్నవారే..తాను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులే టీడీపీ కొంప ముంచారు. అనంతపురం జిల్లాలో వైసీపీ టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టింది. పరిటాల రవీంద్ర కొడుకు ఇక్కడ ఓడిపోయారు.
అశేష జనవాహిని సమక్షంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్‌తో పాటు స్టాలిన్ కూడా హాజరయ్యారు. తాను చెప్పినవన్నీ అమలు చేస్తానని జనం సాక్షిగా ప్రకటించారు. అవినీతిని సహించబోనంటూ స్పష్టం చేశారు. పూర్తిగా మద్యనిషేధం అమలు చేస్తానని ఆ దిశగా చర్యలు కూడా స్టార్ట్ చేశారు. 5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. గెలిచిన తక్షణమే తిరుమలను దర్శించుకున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మొత్తం మీద జగన్ పాలన పట్ల ఏపీ ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారు. పాలనలో తనదైన ముద్రను కనబరుస్తూ ఇప్పటికే ప్రక్షాళన ప్రారంభించారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని లూప్ లైన్‌లో పెట్టారు. మొత్తం మీద జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు జనామోదాన్ని పొందుతున్నాయి. ఈ రకంగా పాలన కొనసాగిస్తే ఆయనకు ఎదురన్నది ఉండదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి