ఆకలి తీరుస్తున్న అక్షయపాత్రకు పురస్కారం
లక్షలాది మంది పిల్లల ఆకలి తీరుస్తూ వారు చదువుకునేలా అక్షయపాత్ర ఫౌండేషన్ సంస్థకు అంతర్జాతీయ పరంగా అరుదైన గౌరవం లభించింది. ప్రతి ఏటా బిబిసి వరల్డ్ సర్వీస్ గ్లోబల్ ఫుడ్ ఛాంపియన్ అవార్డును 2019 సంవత్సరానికి గాను అక్షయపాత్రను ఎంపిక చేసింది. సంస్థ కార్యాలయంలో అక్షయపాత్ర ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ చంచలపతి దాస యునైటెడ్ కింగ్‌డంలోని బ్రిస్టల్ సిటీ కౌన్సిల్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకున్నారు. యుకె అక్షయపాత్ర సిఇఓ భవానీ షెఖావర్ కూడా హాజరయ్యారు. 2018లో జోష్ ఆండ్రెస్ ఈ అవార్డును పొందారు. చెఫ్‌గా పనిచేస్తూ వచ్చిన ఆదాయంతో 3.4 మిలియన్ల మందికి ఉచితంగా ఆహారాన్ని అందజేశారు. ఇది ఓ రికార్డు. హరికేన్ మన పేరుతో స్వీకరించారు.
బెంగళూరు కేంద్రంగా మొదటిసారిగా 2000 సంవత్సరంలో అక్షయపాత్ర ఫౌండేషన్ తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. స్వచ్ఛంధంగా బడి బయటనే వుంటూ..బాల్యాన్ని కోల్పోతున్న బాలబాలికలకు చేయూత ఇవ్వాలని సంకల్పించింది. ఇందు కోసం ఏకంగా ఆయా దాతలు ఇచ్చిన విరాళాలతో వచ్చిన డబ్బులతో మెరుగైన, నాణ్యవంతమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందు కోసం ఎంత కష్టమైనా సరే చేయాలని దాతలు ముందుకు రావడంతో ..కర్ణాటకలోని పలు ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పిల్లలకు 2000లో మధ్యాహ్నం భోజనం వడ్డించడం స్టార్ట్ చేసింది.
ఈ అరుదైన అడుగు జాడ..ఇవాళ దేశంలోని లక్షలాది పిల్లల ఆకలిని తీర్చేలా చేసింది. ఒకరు కాదు వందలు కాదు..ఏకంగా లక్షల్లో విద్యార్థులు ఇపుడు అక్షయపాత్ర ద్వారా సేద దీరుతున్నారు. ఈ సంస్థ చేపట్టిన ఉచిత భోజన కార్యక్రమం వల్ల ఎందరో పిల్లలు బడి బయట వున్నవారంతా ఇపుడు బడిలో ఉంటున్నారు. గంట వినిపించగానే ఠంఛనుగా పాఠాలు వల్లె వేస్తున్నారు. పిల్లలను చూశాక తాము పడుతున్న కష్టాన్ని మరిచి పోతామని అంటున్నారు అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వాహకులు. దేశంలో మొదటిసారిగా కర్ణాటకలో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం ఇపుడు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు చదువు కోవాలనే ఉద్ధేశంతో సర్వశిక్షా అభియాన్ స్కీంను ప్రవేశ పెట్టింది. 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలన్నది లక్ష్యం. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందం మేరకు అక్షయపాత్ర సంస్థ భోజనామృతం పంచుతోంది. అంతేకాకుండా తెలంగాణ సర్కార్ ..కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నగర పాలక సంస్థ సహకారంతో ..హైదరాబాద్‌లోని పలు ప్రధాన నగరాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు 5 రూపాయలకే ప్లేట్ భోజనం అందజేస్తోంది. ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభిస్తోంది.
మాదాపూర్లో సైతం ఐటీ నిపుణులు సైతం ఈ భోజనాన్ని స్వీకరిస్తున్నారు. మహా ప్రసాదంగా ఇది పేదల కడుపు నింపుతోంది. అయిదు రూపాయలకు ఛాయ్ రాదు..కానీ కడుపు నిండా అన్నం దొరుకుతోంది. అక్షయపాత్ర సంస్థ చేస్తున్న నిస్వార్థ సేవకు ఎన్నో సంస్థలు, వ్యక్తులు, వ్యవస్థలు, కంపెనీలు, దాతలు విరాళాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చేదోడుగా వుంటున్నారు. కంపెనీల పరంగా చూస్తే..సిస్కో, ఏబీబీ లిమిటెడ్, జెన్ పాక్ట్ ఇండియా, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిందాల్ అల్యూమినియం, డిషూం లిమిటెడ్, మాపిల్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విరాళాలు అందజేశాయి.
ఇక జామ్ షేట్జీ టాటా ట్రస్ట్, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, హాన్స్ ఫౌండేషన్, గివ్ ఇండియా సంస్థ, కెన్మామెటల్ ఫౌండేషన్, మైఖేల్ అండ్ సుసాన్ డెల్ ఫౌండేషన్ , గాల్వే ఫౌండేషన్ లు అన్నదాన వితరణ కార్యక్రమానికి సాయం చేస్తున్నాయి. అక్షయపాత్ర మరింత విస్తరించాలి. కాలే కడుపుల ఆకలి తీర్చాలి. అన్నదానం మహాప్రసాదం. దానిని స్వీకరించాలి. మరో పది మందికి అన్నం పెట్టాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి