చెన్నైకి ఝలకిచ్చిన పంజాబ్
ఐపీఎల్ -12 టోర్నీలో ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్‌లో ముందంజలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు ఆఖరులో కోలుకోలేని దెబ్బ తగిలింది పంజాబ్ జట్టు రూపంలో. కింగ్స్ పంజాబ్ తన ప్రతాపం ఏమిటో రుచి చూపించింది చెన్నై ఆటగాళ్లకు. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసుకుంది. స్వంత మైదానంలో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఘనంగా ముగించి తమ జట్టు అభిమానులకు కానుకగా ఇచ్చింది. చెన్నై కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే గెలుపొందింది. కింగ్స్ పంజాబ్ జట్టు విజయంలో కేఎల్ రాహుల్ అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ చేశాడు. కళ్లు చెదిరేలా షాట్లు కొట్టాడు. బంతులను అవలీలగా బాదాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
కేవలం 36 బంతులు మాత్రమే ఆడిన కేఎల్ ఏకంగా ఏడు ఫోర్లు అయిదు భారీ సిక్సర్లు కొట్టాడు. మొత్తం 71 పరుగులు చేసి బెంబేలెత్తించాడు. ఈ జట్టులో మరో కీలకమైన ఆటగాడిగా ఉన్న క్రిస్ గేల్ 28 బంతులు మాత్రమే ఆడి రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు..28 పరుగులు చేశాడు. రాహుల్, గేల్ ల జోడి 108 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. దీంతో కింగ్స్ పంజాబ్ జట్టు విజయం సునాయమైంది. ఓ దశలో దూకుడు మీదున్న వీరిద్దరే లక్ష్యాన్ని ఈజీగా ఛేదిస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ ఉన్నట్టుండి అవుట్ అయ్యారు. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన నికోలస్ పూరన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 36 పరుగులు చేయడంతో ఈజీగా గెలుపొందింది.
అంతకు ముందు టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 170 పరుగులు చేసింది. చెన్నై ఆదిలోనే జోరు మీదున్న షేన్ వాట్సన్ వికెట్‌ను కోల్పోయింది. ఆ దశలో డుప్లెసిస్‌కు జత కలిసిన సురేష్ రైనా ..స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ జోడి ఏకంగా 120 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించింది. ఆ తర్వాత రెండో వికెట్ రూపంలో రైనా వికెట్‌ను కోల్పోయింది. 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. మంచి ఊపుమీదున్న ఈ ఆటగాడు అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు.
ఒకవేళ అవుట్ కాక పోయివునింటే ..200 పరుగులు దాటి ఉండేది. మరో వైపు డుప్లెసిస్ ఆది నుంచి కింగ్స్ పంజాబ్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు 4 సిక్సర్లతో రెచ్చి పోయాడు. పంజాబ్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీకి అతి చేరువగా ..కేవలం నాలుగు పరుగుల దూరంలో మిస్సయ్యాడు. సామ్ కరాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఈ స్కోర్ ఈ ఆటగాడికి ఇదే అతి పెద్ద స్కోర్. ధోనీ 10 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. మొత్తం మీద దుమ్ము రేపుతున్న సీఎస్కే జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది పంజాబ్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి