నిజామాబాద్‌లో నైతిక విజయం రైతన్నలదే
మెతుకులను పండించి ..మట్టినే నమ్ముకుని ..బతుకు బరువై అరిగోస పడుతున్న రైతులు భారతదేశలో ఒక చరిత్రకు నాంది పలికారు. నూతన అధ్యాయానికి తెర తీశారు. అంతకు ముందు పాలమూరు జిల్లాలోని పోలేపల్లి గ్రామస్తులు తమ భూములు తమకు కావాలని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మోసం చేశాడంటూ ఆందోళనలు చేపట్టారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అప్పట్లో అది ఓ సంచలనం. మొన్నటి దాకా తిరుగులేదని భావించిన అధికార పార్టీకి చుక్కలు చూపించారు. నిజామాబాద్ అంటేనే పసుపు, చెరుకు పంటలకు ప్రసిద్ధి. ఆసియా ఖండంలోనే అధిక సాగు చేసే ప్రాంతం ఏదైనా ఉందంటే అది నిజామాబాద్ మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ బతుకులు బాగు పడతాయని, తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, తమ పంటకు కనీస మద్ధతు ధర దొరుకుతుందని ఇక్కడి మట్టి బిడ్డలు భావించారు.
అదంతా రివర్స్ అయ్యింది. సీఎం కూతురు కవిత ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గత ఎన్నికల్లో గెలిచింది. రైతులకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, ఆదుకుంటామని చెప్పి ఆచరణలో చూపించక పోవడంతో రైతులు పోరు బాట పట్టారు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేలా ఆందోళనలు చేశారు. నిరసన వ్యక్తం చేశారు. శాంతియుతంగా తమకు కనీస మద్ధతు ధర కల్పించాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసిన రైతులను అరెస్ట్ చేశారు. కలెక్టర్ కనీసం వారి మొర ఆలకించ లేక పోయారు. ఏకంగా 176 మంది రైతులు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేశారు. ఇది ఓ రికార్డు. పోటీ చేసిన వారిని, రంగంలో దిగిన రైతులను లైట్ గా తీసుకున్నారు అధికార పార్టీకి చెందిన వారు. ఎప్పటి లాగే బంగారు తెలంగాణ నినాదం ఓట్లను కురిపిస్తుందని అనుకున్నారు.
ఏకంగా 98 వేలకు పైగా ఈ రైతులు ఓట్లను పొందారు. కవిత విజయం సాధించకుండా ఓడి పోయేలా చేశారు. జీవితాంతం గుర్తుంచుకునేలా చేశారు. ఇది ముమ్మాటికి రైతుల విజయం. ఈ ఎంపీ స్థానం నుంచి ధర్మపురి అరవింద్ బీజేపీ నుండి గెలిచి ఉండవచ్చు గాక. కానీ ఎలాంటి మందీ మార్బలం లేకుండా, ఎవరి సపోర్ట్ తీసుకోకుండా, డబ్బులు ఖర్చు చేయకుండా రైతులు చేసిన పోరాటానికి ప్రజల నుంచి నైతిక మద్ధతు లభించింది. కవిత 60 వేల ఓట్ల తేడాతో ఓడి పోయింది. ఒకవేళ రైతులు పోటీ చేయక పోయివునింటే కచ్చితంగా ఆమె గెలిచే వారు. అరె తుపాకిని పేల్చిన తూనీగలున్నయట ..ఏం పిల్లడో వెళదాం వస్తవా అని ప్రజాకవి వంగపండు ప్రసాదరావు పాడిన పాట గుర్తుకు వచ్చింది .
జనాన్ని ఓటు బ్యాంకుగా చూసినంత కాలం ఇలాంటి ఫలితాలే చవి చూడాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నా, మందీ మార్బలం, అధికారుల అండదండలు ఉన్నా ఏకంగా రైతులు ఇంత భారీ స్థాయిలో ఓట్లను పొందడమంటే మామూలు విషయం కాదు. నిజామాబాద్ జిల్లా దేశాన్ని ఆకర్షించింది. రైతుల పవర్ ఏమిటో చూపించింది. ఇది ముమ్మాటికీ .ఎవరు కాదన్నా అవునన్నా ఇది తెలంగాణ మట్టి బిడ్డల నైతిక విజయం. వీరందించిన స్ఫూర్తి దేశంలోని రైతులకు ఒక పాఠం కావాలి. అప్పుడే ప్రజాప్రతినిధులకు బుద్ది వస్తుంది. ఈ విజయం ప్రజలది, రైతులది. ఇక ఓట్ల శాతం వరకు చూస్తే ..మొత్తం పోలింగ్‌లో ధర్మపురికి 4 లక్షల 85 వేల ఓట్లు రాగా 45 శాతంగా ఉంది. కవితకు 4 లక్షల 6 వేల పై చిలుకు ఓట్లు పడ్డాయి. 38 శాతం నమోదైంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మధు గౌడ్ 69 వేల ఓట్లు వచ్చాయి. 176 మంది రైతులకు కలిపి 98 వేల పైచిలుకు వచ్చాయి. ఇది నమ్మశక్యం కానిది. ఏది ఏమైనా ఈ ఓటమి తెరాసలో చర్చనీయాంశం అయ్యేలా చేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి