ఏపీలో కొలువు తీరేదెవ్వ‌రో..?

ఇలాంటి దారుణ‌మైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌ల‌లో కూడా అనుకుని ఉండ‌రు. జీవితంలో మ‌రిచి పోలేని అప‌జ‌యాన్ని అందించారు వైసీపీ అధినేత జ‌గ‌న్. ఈనెల 30న వేద పండితుల సాక్షిగా, జ‌న సమ‌క్షంలో జ‌నామోదం పొందిన జ‌గ‌న్ ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. అతిర‌థ మ‌హార‌థులు, ఇత‌ర ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి రానున్నారు. ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ప్ర‌జ‌లు వ‌న్ సైడ్‌గా తీర్పు ఇవ్వ‌డం, 150 సీట్ల‌కు చేర్చ‌డంతో జ‌గ‌న్ ఉబ్బి త‌బ్బ‌బ‌వుతున్నారు. ఏదో 120 లేదా 130 సీట్ల‌కే ప‌రిమిత‌మై పోతామ‌ని న‌మ్మ‌కంతో ఉన్న జ‌గ‌న్‌కు ఊహించ‌ని రీతిలో ఆంధ్రా ప్ర‌జ‌లు గిఫ్ట్ ఇచ్చారు.

ఏపీ చ‌రిత్ర‌లో ఇది చారిత్రాత్మ‌క విజ‌యం. ఊహించిన దానికంటే ఎక్కువ‌గా ఎమ్మెల్యేలు గెలిచారు. వీరితో పాటు 23 ఎంపీ సీట్ల‌లో వైసీపీ పాగా వేసింది. బీజేపీతో స‌ఖ్య‌త పాటిస్తున్న జ‌గ‌న్..మోదీ కేబినెట్‌లో చేర‌మ‌ని జ‌గ‌న్‌ను ఆహ్వానిస్తే ..చేరేందుకు సుముఖ‌త చూపించ‌వ‌చ్చు. ప్ర‌త్యేక హోదా సాధిస్తాన‌ని ప్ర‌ధానంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతూ వ‌చ్చారు. తాజా స‌మాచారం ప్ర‌కారం 30న జ‌గ‌న్ ఒక్క‌రే సీఎంగా ప్ర‌మాణం చేస్తార‌ని ..ఆ త‌ర్వాత ఉప ముఖ్య‌మంత్రులు, ఇత‌ర మంత్రుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. పోటీ తీవ్రం కావ‌డంతో ఎవ‌రికి ఏ ప‌ద‌వులు ద‌క్కుతాయోన‌ని ఉత్కంఠ‌కు లోన‌వుతున్నారు ఆశావ‌హులు. ఎక్కువ శాతం సీనియ‌ర్లు, జూనియ‌ర్ల మ‌ధ్య పోటీ నెల‌కొంది.

మొత్తం మంత్రి వ‌ర్గంలో కేవ‌లం 25 మందికి మాత్ర‌మే ఛాన్స్ ఉంది. ఈ స‌మ‌యంలో ఎవ‌రికి ఛాన్స్ ఇస్తారు. ఎవ‌రిని ప‌క్క‌న పెడ‌తారు. ఎవ‌రిని బుజ్జ గిస్తార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాంగ్రెస్ నుంచి బయ‌ట‌కు వ‌చ్చి వైకాపాను స్థాపించిన‌ప్పుడు త‌న వెంట ఉన్న వారికి ఉప ముఖ్య‌మంత్రులు ద‌క్కుతాయ‌ని , మిగతా వారిని అనుభ‌వం, ప‌నితీరు ఆధారంగా ప‌ద‌వులు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం వ‌హించాల్సి ఉంది. దీనిపై జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేయాల్సి ఉంది. బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి, ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డిల‌ను కేబినెట్ లోకి తీసుకుంటామ‌ని ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.

చిల‌క‌లూరిపేట టికెట్‌ను త్యాగం చేసినందుకు ఆ పార్టీ నేత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ను ఎమ్మెల్సీ చేసి ..కేబినెట్‌లోకి తీసుకుంటాన‌ని జ‌గ‌న్ మాటిచ్చారు. ఇక కొలువులు ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే శ్రీ‌కాకుళం జిల్లా నుంచి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, క‌ళావ‌తి ఉండ‌గా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీ‌వాణి ఉన్నారు. విశాఖ‌ప‌ట్నం జిల్లా చూస్తే అమ‌ర్‌నాథ్, బాబురావు, తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి సుభాష్ , క‌న్న‌బాబు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆళ్ల నాని, బాల‌రాజు, వ‌నిత‌, శ్రీ‌నివాస్ ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి పేర్ని నాని, పార్థసార‌థి, వెంక‌ట ప్ర‌తాప్ ఉన్నారు.

గుంటూరు జిల్లా నుండి ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి, రాజ‌శేఖ‌ర్ , అంబ‌టి రాంబాబు, ప్ర‌కాశం జిల్లా నుంచి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి, సురేష్‌, నెల్లూరు నుండి గౌతం రెడ్డి, రామిరెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి రామ‌చంద్రా రెడ్డి, క‌రుణాక‌ర్ రెడ్డి, క‌డ‌ప జిల్లా నుండి శ్రీ‌కాంత్ రెడ్డి, బాషా, క‌ర్నూలు జిల్లా నుండి రాజేంద్ర నాథ్ రెడ్డి, శ్రీ‌దేవి, హ‌ఫీజ్ ఖాన్, అనంత‌పురం జిల్లా నుంచి అనంత వెంక‌ట్రామిరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి ప‌ద‌వులు ఆశిస్తున్నారు.వీరిలో ఎవ‌రికి బెర్త్ క‌న్ ఫ‌ర్మ్ అవుతుందో చెప్ప‌లేం. ఇదిలా ఉండ‌గా డైన‌మిక్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ జ‌గ‌న్ విజ‌యంపై స్పందించారు. జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంలో టీడీపీ కొట్టుకు పోయింది. రాష్ట్రంలో జ‌గ‌న్ సునామీ క‌నిపించింద‌న్నారు.

కామెంట్‌లు