అంతిమ పోరులో ముంబైదే విజయం - చతికిలపడిన చెన్నై కింగ్స్
ఎట్టకేలకు ఐపీఎల్ -12 పోరు ముగిసింది. ఉత్కంఠకు తెర పడింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ముంబయి ఇండియన్స్ జట్టు ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకుంది. దేశమంతటా హైదరాబాద్ వైపు చూసింది. కోట్లాది మంది భారతీయులు ఊపిరి బిగపట్టి ఫైనల్ పోరాటాన్ని చూశారు. ప్రతి ఫార్మాట్‌లోను ముంబై జట్టు చెన్నైపై ఆధిపత్యం సాధించింది. భావోద్వేగాలు పెరిగి..ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక క్రికెట్ అభిమానులు తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. నువ్వా నేనా అన్న రీతిలో ఫైనల్ జరిగింది. ఆఖరు బంతి వరకు ఎవరిని విజయం వరిస్తుందో తెలియని పరిస్థితి. బుమ్రా, రాహుల్ చాహర్‌లు అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేసి ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించారు. వాట్సన్ ఒక్కడే మెరుపులు మెరిపించినా జట్టును గట్టెక్కించ లేక పోయాడు.
ముంబై జట్టు 2013, 2015, 2017లలో విజేతగా నిలువగా 2019లో తిరిగి గెలుపొందింది. ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా రికార్డు స్వంతం చేసుకుంది. 2017లో ఇదే ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించగా..సేమ్ సీన్ ఈసారి జరిగిన టైటిల్ పోరులో సక్సెస్ పునరావృతమైంది. 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరపున కప్ అందుకున్న రోహిత్ శర్మ..ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ఆటగాడిగా మరో రికార్డు స్వంతం చేసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా పోలార్డ్ మాత్రం 25 బంతులు ఆడి మూడు ఫోర్లు మూడు సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. అనంతరం టార్గెట్ ఛేదించే క్రమంలో రంగంలోకి దిగిన చెన్నై ఆటగాళ్లు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేసి..చేతులెత్తేసింది. వాట్సన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా పలితం లేక పోయింది.
59 బంతులు ఆడిన ఈ ఆటగాడు 8 ఫోర్లు నాలుగు భారీ సిక్సర్లతో దుమ్ము రేపాడు..80 పరుగులు చేశాడు. ఒక్క పరుగు దూరంలో ఉన్న చెన్నైని విజయ తీరాలకు తీసుకెళ్లలేక పోయాడు. ముంబై జట్టు తరపున బౌలర్లు తమ ప్రతిభకు పదును పెట్టారు. రాహుల్ చాహర్ నాలుగు ఓవర్లలో ఒక వికెట్ తీసి 14 పరుగులే ఇచ్చాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోర్ నాలుగు వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. కృనాల్ 18వ ఓవర్ లో వాట్సన్ వరుసగా మూడు సిక్సర్లతో చెలరేగాడు. 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆఖరు ఓవర్ లో వాట్సన్ వెనుదిరగడంతో ముంబై చేతిలోకి గెలుపు వచ్చేసింది. ధోనీ అనుకోని రీతిలో ఔటయ్యాడు. అతడు వెనుదిరిగిన వెంటనే విజయం వచ్చేసినంత సంబరాలు చేసుకున్నారు. మళింగ ముంబయికి కీలకంగా మారితే, బుమ్రా అద్భుతమైన సపోర్ట్ చేశాడు. చెన్నై జట్టును రనౌట్లు కొంప ముంచాయి. ఉత్కంఠ సమయంలో చెన్నై జట్టును మిస్టర్ కూల్ ధోనీ కాపాడక పోవడం ఆ జట్టు ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేశాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి