అంచనాలు తారుమారు..ప్రాంతీయ పార్టీలే కీలకం
ప్రీ పోల్ సర్వేల దెబ్బకు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలు కంటున్న బీజేపీ కూటమి ఆశలు రోజు రోజుకు సన్నగిల్లుతున్నాయి. మరో వైపు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ కూటమి జోరుమీదుంది. మోదీ ప్రభంజనం తగ్గిందని..కనీసం బీజేపీ ప్రభుత్వానికి 100 సీట్లు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు స్పష్టం చేయడంతో ..దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఆయా పార్టీలకు చెందిన అధినేతలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరుగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక , ఢిల్లీ , కేరళ నేతలతో మంతనాలు జరిపారు. ఇప్పటికే కూటమి దిశగా అడుగులు పడేలా కృషి చేశారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించడం వల్ల ..జనాదరణ తగ్గిందని..ఆ నెగటివ్ ఓట్లు కాంగ్రెస్ వైపు మొగ్గుతాయని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.
ఇరు పార్టీలు ఇపుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఏ పార్టీకి కేంద్రంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రావడం కష్టమేనని సర్వేల అంచనా. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే యూపీఏ -3 పేరుతో సంఘటితమయ్యేలా జాతీయ స్థాయిలో సన్నాహాలు ఊపందుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అరగంటకు పైగా చర్చలు జరిపారు. బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గుతాయని..ప్రాంతీయ పార్టీలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా సీట్లు పొందే అవకాశం ఉండడంతో..వాటిని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా బాబు మంత్రాంగం జరపనున్నారు.
భావ సారూప్యత కలిగిన పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తే సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని సూచించినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ స్థాయి నాయకుల మధ్య చర్చలు స్టార్ట్ అయ్యాయి. సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ , తదితరులతో రాహుల్ గాంధీ చర్చలు జరిపారు. ఫలితాలకు రెండు రోజుల ముందు 21న ఢిల్లీలో విపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వేల అంచనా ప్రకారం..కాంగ్రెస్ పార్టీకి స్వంతంగా దేశ వ్యాప్తంగా 125 సీట్లు రావచ్చని అంచనా. మరో 70 సీట్లు కాంగ్రెస్ మిత్ర పక్షాలు గెలుచు కుంటాయని ఆయా పార్టీల నేతలు ఊహిస్తున్నారు. అంతా కలిపితే 200 సీట్లు మాత్రమే అవుతాయి.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 80 సీట్లు అవసరమవుతాయి. టీడీపీ, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు ..యుపీఏలో చేరడమో లేదా బయటి నుంచి మద్ధతు ఇవ్వడమో చేస్తే కొత్త సర్కార్ కొలువు తీరే చాన్సెస్ ఉన్నాయి. మరో వైపు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని అనుకుంటున్న గులాబీ బాస్ కేసీఆర్ ఆ వైపుగా పావులు కదుపుతున్నారు. కుమారస్వామి ద్వారా కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నట్టు జాతీయ స్థాయిలో పలు కథనాలు ప్రసారమయ్యాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఢిల్లీ సుల్తాన్ ఎవ్వరనేది 24 తర్వాత తేలుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి