ప్రతిపక్ష హోదా దక్కని వైనం - ప్రమాదంలో పార్టీ భవితవ్యం
వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 17వ సార్వత్రిక ఎన్నికలు శాపంగా మారాయి. కనీసం ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేక పూర్తిగా చతికిల పడి పోయింది. దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించిన ఆ పార్టీ ఇపుడు తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితిని కొని తెచ్చుకుంది. త్యాగాలు, బలిదానాలు చేసుకున్న గాంధీ కుటుంబం ఇవాళ పునరాలోచనలో పడింది. మోదీ వ్యూహాలను ఎదుర్కోలేని స్థితిలోకి రావడం బాధాకరం. గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి దాకా బలమైన కేడర్ కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు బేల చూపులు చూస్తోంది. కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలు సైతం అదే బాట పట్టాయి. 2014లో మోదీ మామూలుగా ఎంటర్ అయ్యాడు. తాను ఛాయ్‌వాలా నంటూ..ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమంటూ వేడుకున్నాడు. ఆ తర్వాత ఏకు మేకయ్యాడు.
ఏకశ్చత్రాధిపత్యం దిశగా దేశాన్ని అన్నీ తానై నడిపించాడు. ప్రతిపక్షాల నోళ్లు మూయించాడు. ఎన్నో ప్రతికూలతల మధ్య బీజేపీకి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చాడు. ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూనే తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. సోషల్ మీడియాను వాడుకున్నాడు. వ్యక్తిగత విమర్శలకు పోలేదు..కానీ చురకలు అంటించాడు. అన్ని చోట్లా తనదైన ప్లాన్‌ను అమలు చేశాడు. గెలుపు గుర్రాలను ఎంపిక చేశాడు. దాని పనినంతా అమిత్ షా చాప కింద నీరులా చేసేశాడు. ఇవాళ అఖండ విజయాన్ని నమోదు చేసుకుని ..ఢిల్లీ కోటపై కాషాయ జెండాను ఎగుర వేశాడు. మోదీని, ఆయన పరివారాన్ని నిలువ రించడంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. పార్టీకి ఒక్కడే దిక్కుగా ఉన్న రాహుల్ గాంధీ ..దేశమంతటా పర్యటించారు. సమస్యలపై నిలదీశారు. కానీ జరగాల్సిన నష్టం జరిగి పోయింది.
పార్టీకి విధేయులుగా ఉండాల్సిన సీనియర్లు ఏ మాత్రం వర్కవుట్ చేయలేక పోయారు. ఆ పార్టీకి, దాని మిత్రపక్షాలకు కేరళ, తమిళనాడు, తెలంగాణలో కాసిన్ని సీట్లు దక్కాయి. మిగతా రాష్ట్రాలలో మోదీ సునామీకి విలవిలలాడి పోయింది. రాహుల్ గాంధీ విమర్శలు చేసుకుంటూ పోయారే తప్పా..ప్రజలు ఏం గమనిస్తున్నారో..వారు ఏం ఆశిస్తున్నారో గుర్తించలేక పోయారు. ఆయనకు తోడుగా సోదరి ప్రియాంక గాంధీ వ్యక్తిగత విమర్శలకు దిగారు. దానిని జనం జీర్ణించు కోలేక పోయారు. ఏకంగా కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఎన్నడూ లేనంతగా ..అరుదైన రికార్డు కలిగి ఉన్న అమేథి నియోజకవర్గంలో ఏకంగా రాహుల్ జీ ఓటమి పాలయ్యారు. ఇది పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇచ్చినట్టో పార్టీ పెద్దలు ఆలోచించు కోవాలి. రాజీవ్ గాంధీ, సోనియాలు ఇక్కడి నుంచే భారీ మెజారిటీతో గెలుపొందారు. రాహుల్ కూడా. ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా అపజయం పాలయ్యారు. అప్రతిష్టను మూట గట్టుకున్నారు.
దేశ స్థాయిలో పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి ..పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఓటమి పాలవడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు చిత్తుగా ఓడి పోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించు కోలేక ..నాయకుడిగా ఫెయిల్ అయ్యారు. సమస్త ఓటమికి రాహుల్‌జీనే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశమంతటా తిరిగినా..చౌకీదార్ చోర్ హై అంటూ ప్రచారం చేసినా కాంగ్రెస్ ను గట్టెక్కించ లేక పోయారు. రాఫిల్ విషయంలో సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పి ఇరుక్కు పోయారు. వ్యూహాలు పన్నడంలో, ప్రచారంలో మోదీ, షా టీంతో పోలిస్తే రాహుల్ బృందం తేలి పోయింది. దాని దరిదాపుల్లోకి వెళ్లలేక పోయింది.
భారత్ లాంటి విశాల దేశంలో అన్ని ప్రాంతాల ప్రజల ఆమోదం పొందడం ఆషామాషీ కాదు. ఆ విషయంలో రాహుల్ పరిణతి చెందిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంలో ఆలస్యం, మేనిఫెస్టోను సైతం ఆకర్షణీయంగా తీర్చక పోవడం కూడా ప్రధాన కారణం. రైతు సంక్షోభం, నిరుద్యోగం, నోట్ల రద్దు , ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో స్పష్టంగా చెప్పలేక పోయింది. అదే కొంప ముంచింది. ఇకనైనా మేలుకోక పోతే పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. కాంగ్రెస్ మళ్లీ పవర్ లోకి రావాలంటే ..చాలా కసరత్తు చేయాల్సి ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో ఆశ పెట్టుకోవచ్చు. లేదంటే ఫలితాలు ఇలాగే వస్తాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి