ఆశీర్వదించండి..అన్నను గెలిపించండి
మిమ్మల్ని చూస్తుంటే మా కుటుంబంతో గడిపిన క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. నేను మీ సోదరిని..మీలో ఒకరిని..మీలో మేమంతా ఒక్కరం. మీ ఆదరాభిమానాలు మాకుండాలి. మీ దీవెనలు మా అన్నయ్యకు కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలోని వయనాడ్‌లో ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. తన అన్నకు మద్ధతుగా ప్రియాంక రంగంలోకి దిగారు. తాను కూడా బరిలో ఉన్నప్పటికీ ఇక్కడే ఎక్కువగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మొదటిసారిగా రాహుల్ ఇక్కడ పోటీలో ఉండడంతో దేశం ఈ నియోజకవర్గం వైపు దృష్టి సారించింది. ఎన్నికల సభలో ప్రియాంక గాంధీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమె ఎక్కడ పాల్గొంటే అక్కడ జనం తండోప తండాలుగా తరలి వస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె బీజేపీని టార్గెట్ చేశారు. గత ఐదేళ్లలో కమలనాథులు దేశాన్ని ముక్కలు చేశారని. ప్రజలను పేదలుగా మార్చారని ఆరోపించారు. ప్రతి రాష్ట్రం దేశంలో భాగమేనని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఒక్కరు ఇందులో భాగస్థులే. ఎవరూ ఎక్కువ కాదు..తక్కువ కాదు..అంతా సమానమే. వివిధ మతాలు, సంస్కృతుల సమ్మేళనమే మన దేశం. బీజేపీ కలిసి ఉన్న జాతిని, మనుషులను మతం, కులం , జాతుల పేరుతో విడదీసింది. జనం మధ్య చిచ్చు పెట్టిందంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని..ఏ కోశాన బాధ్యతతో వ్యవహరించలేదంటూ మండిపడ్డారు. రైతులకు రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చుతామని, యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ..ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని మాయ మాటలు చెప్పారు..ఇందులో ఏ ఒక్కటిని చేయలేక పోయారని విమర్శించారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని..జాతీయ ఉపాధి హామీ పథకంతో పాటు సమాచార హక్కు చట్టాన్ని తీసుకు వచ్చింది తమ పార్టీనేని గుర్తు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి కేరళ అంటే ఎంతో ప్రాణమని..ఈ ప్రాంతం గురించి తమకు చెప్పేదని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఇక్కడి ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతగానో గౌరవించే వారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమేం చేయబోతున్నామో ప్రియాంక గాంధీ కూలంకుశంగా వివరించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడేటప్పుడు ప్రియాంక తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు కూడా. నేను నాయకురాలిగా రాలేదు.
లేదా మీ మీద ఆధిపత్యం చెలాయించాలని రాలేదు. కేవలం మీ ముందు ఓ సోదరిగా నిలబడ్డా. చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి తరపున మాట్లాడుతున్నానని చెప్పారు. గత ఐదేళ్లలో రాహుల్ గాంధీపై అనేక రకాల దాడులు జరిగాయి. బీజేపీ టీం ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు..ఆయన చదువును ప్రశ్నించారు. అమరుడైన మా తండ్రి రాజీవ్ గాంధీ గురించి చెడుగా మాట్లాడారు. అన్నింటిని తట్టుకుని మీ కోసం పనిచేయాలన్న సంకల్పంతో అన్న మీ ముందు నిలబడ్డారని అన్నారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని..ధర్మమే నిలుస్తందని చెప్పారు. ప్రచారంలో ఇక్కడ అందరి కంటే రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. అన్నా చెల్లెళ్లు ఇద్దరూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి