క‌లిసిన క‌త్తులు..కురిసేనా ఓట్లు

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు..శాశ్వ‌త మిత్రులు అంటూ ఉండ‌ర‌న్న మాట‌ల్ని నిజం చేశారు ..ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఎస్పీ, బీఎస్పీల బాధ్యులు. అత్య‌ధిక పార్ల‌మెంట్ సీట్లు క‌లిగిన రాష్టం ఇదే. మాన్య‌శ్రీ కాన్షీరాం బ‌హుజ‌న స‌మాజ్ వాది పార్టీని స్థాపించారు. స‌మాజ్‌వాది పార్టీని కాద‌ని బీఎస్పీని అధికారంలోకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త కాన్షీజీదే. ఆయ‌న తిర‌గ‌ని ప్రాంత‌మంటూ లేదు. అంత‌లా బ‌హుజ‌నుల బాగు కోసం ఎంత‌గానో శ్ర‌మించారు. ఈ దేశంలో ఎంద‌రో రాజ‌కీయ గురువులు, నాయ‌కులు ఉన్నారు. కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా జ‌నాన్ని చైత‌న్య‌వంతం చేసి ..కేంద్రంలో అధికారంలోకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణదే. తెలంగాణ గాంధీగా పేరొందిన ఆచార్య జ‌య‌శంక‌ర్ కృషి ..కేసీఆర్ పోరాట ఫ‌లిత‌మే తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డింది. కాన్షీరాం దృష్టిలో కుమారి మాయావ‌తిని జాతి గ‌ర్వించే నాయ‌కురాలిగా తీర్చిదిద్దారు. యుపీలో అన్ని పార్టీల‌ను కాద‌ని మొద‌టిసారిగా బీఎస్పీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు అక్క‌డి ప్ర‌జ‌లు.

బీఎస్పీ ప‌వ‌ర్ లోకి రావ‌డం అన్న‌ది దేశ చ‌రిత్ర‌లో సువ‌ర్ణ అధ్యాయంగా పేర్కొనాల్సిందే. చిన్న బిందువుగా ప్రారంభ‌మైన ఈ పార్టీ ఏనాడూ ప‌వ‌ర్‌లోకి వ‌స్తుంద‌ని అత్యంత బ‌లంగా ఉన్న స‌మాజ్‌వాది పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉండ‌నే ఉన్నాయి. ఆయా పార్టీల ఆధిప‌త్యాన్ని ప్ర‌శ్నిస్తూనే..చాప కింద నీరులా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను..ముఖ్యంగా బాధితులంద‌రినీ ఒకే చోటుకు చేర్చారు. భావ సారూప్య‌త క‌లిగిన వ్య‌క్తులు, వ్య‌వ‌స్థ‌లు, సంస్థ‌లు, కంపెనీలు, సామాజిక ఉద్య‌మ‌కారులు, కార్య‌క‌ర్త‌లు, మేధావుల‌తో బీఎస్పీని నింపారు. ఊహించ‌ని రీతిలో బ‌హుజ‌న్ స‌మాజ్ వాది పార్టీ అత్య‌ధిక స్థానాల‌ను చేజిక్కించుకుని అధికారంలోకి వ‌చ్చింది.

మిగ‌తా పార్టీల‌ను మ‌ట్టి క‌రిపించింది. ప్ర‌జ‌లు ఇచ్చిన ఈ అరుదైన అవ‌కాశాన్ని మాయావ‌తి ఉప‌యోగించుకోలేక పోయింది. ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చినా ..ప్ర‌తి చోటా అంబేద్క‌ర్, కాన్షీరాం విగ్ర‌హాల‌తో పాటు త‌న విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయ‌డంపై తీవ్ర దుమారం రేగింది. కోట్లాది రూపాయ‌లు ప‌క్క‌దారి ప‌ట్ట‌డం, ఏక వ్య‌క్తి పాల‌న ఉండ‌డం, బాధ్య‌తా రాహిత్యం ఎక్కువ‌గా కావ‌డంతో ప్ర‌జ‌ల‌కు భారంగా మారింది. దీంతో బీఎస్పీకి కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టారు. ఈ స‌మ‌యంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చింది. త‌మ ఓటు బ్యాంకును పెంచుకోవ‌డం, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల‌కు చుక్కులు చూపించాల‌ని ప్ర‌యత్నాలు ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో బిజేపీయేత‌ర పార్టీల‌న‌న్నింటిని ఏకం చేసే ప‌నిలో ప‌డ్డారు.

క‌ర్ణాట‌క‌, ఢిల్లీ, ప‌శ్చిమ బెంగాల్, ఉత్త‌ర ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు త‌దిత‌ర రాష్ట్రాలలో ఆయా పార్టీల‌ను క‌లిపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కూట‌మికి..బీజేపీ కూట‌మికి అధికారాన్ని చేప‌ట్టే సంఖ్య రాదంటూ ప్రీ పోల్ స‌ర్వేలు పేర్కొన‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో రీజ‌న‌ల్ పార్టీల‌దే కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్లు తేలింది. యుపీ చ‌రిత్ర‌లో ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకుంటూ ..కేసులు, జైళ్ల‌కు వ‌చ్చిన అధినేత‌లు ఈ ఎన్నిక‌ల్లో ఏకం కావ‌డం అన్న‌ది దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌మాజ్‌వాది పార్టీ..బీఎస్పీలు క‌లిసి పోయాయి. నిన్న‌టి దాకా క‌త్తులు దూసి శ‌త్రువులుగా మారిన ములాయం, అఖిలేష్, మాయావ‌తిలు ఇపుడు మారి పోయారు.

వీరు ప‌వ‌ర్ కోసం ఒక్క‌ట‌య్యారు. ఇది మ‌రో చ‌రిత్ర‌కు నాంది ప‌లికింది. ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాక ఎవ‌రు ప‌వ‌ర్‌లోకి వ‌స్తారో తేలుతుంద‌ని బెహ‌న్ జీ స్ప‌ష్టం చేశారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేశానికి మాయావ‌తి ప్ర‌ధాని కావాలంటూ హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌భ సంద‌ర్భంగా కోరారు. మ‌రో వైపు మ‌మ‌తా బెన‌ర్జీ పీఎం కావాల‌ని ఇంకొక‌రు డిమాండ్ చేయ‌డం సంచ‌ల‌నం రేపింది. ఏది ఏమైనా నిన్న‌టి దాకా యుద్ధానికి తెర లేపిన రెండు రాజ‌కీయ శ‌క్తులు ఎస్పీ, బీఎస్పీలు క‌ల‌వ‌డం యుపీనే కాదు ఇండియాను ఆలోచింప చేసేలా చేస్తోంది.

కామెంట్‌లు