దేవుడు కరుణిస్తాడని..సోనాలి బతుకుందని..!
సోగకళ్లు..ఆకట్టుకునే రూపం..అరబిక్ అడుగులన్నీ ఒకే మూసలో పోస్తే సోనాలి బింద్రే అవుతుంది. అప్పట్లో మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ముంబయి సినిమా ఓ సంచలనం. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతానికి ..రెమో ఫెర్నాండేజ్ గాత్రం..వేటూరి సుందర రామ్మూర్తి కలంలోంచి జాలు వారిన ఇది అరబిక్ కడలందం అన్న సాంగ్ ప్రపంచాన్ని ఊపేసింది. ఆ పాట ఎంత పాపులర్ అయ్యిందో ..దాని కోసం నటించిన సోనాలి తళుక్కున మెరిసింది. సంగీతానికి తగ్గట్టు ఆమె కురిపించిన హావభావాలు ఇప్పటికీ ఇంకే నటిమణి చేయలేదంటే నమ్మలేం. ఎన్నో సినిమాలలో నటించారు. అపారమైన అవకాశాలు ఆమెను తలుపు తట్టాయి. మిల్క్ బాయ్ మహేష్ బాబుతో కలిసి తెలుగులో నటించిన కృష్ణవంశీ తీసిన మురారి సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. తెలుగు వారి లోగిళ్లలోని సాంప్రదాయాలు, కుటుంబ బాంధవ్యాల గురించి చాలా చక్కగా చిత్రీకరించారు దర్శకుడు. ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుందని ఏరికోరి కృష్ణవంశీ ఆమెను ఎంచుకున్నాడు.
తెలుగింటి .అమ్మాయిలా..అమాయకంగా..సోనాలీని తీర్చిదిద్దాడు. సినిమా ఎండింగ్‌లో ..క్లైమాక్స్ వరకు వచ్చేసరికల్లా హీరో హీరోయిన్లు చనిపోతారు. దీనిని తట్టుకోలేక చాలా మంది ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలా పద్ధతిగా..ఒద్దికగా వుంటూ తానేమిటో ..తన పనేమిటో వరకే పరిమితమైన ఈ సోగకళ్ల సుందరి ఉన్నట్టుండి మళ్లీ మన్మధుడు సినిమాతో ఒక్కసారిగా జనాన్ని మెస్మరైజ్ చేసింది. కొన్ని వందల సార్లు ఈ సినిమా అన్ని ఛానల్స్ లో ప్రసారమవుతూనే ఉంది. ఎక్కడలేని రేటింగ్ ఈ మూవీకి వస్తుండడంతో పదే పదే టెలికాస్ట్ చేస్తున్నారు. నాగార్జునతో రొమాన్స్, పారిస్‌లో ప్రయాణం, హోటల్ గదిలో ఇద్దరికే పరిమితమైన డైలాగులు..ఇప్పటికీ వెంటాడేలా చేశాయి. ఆ సినిమాకు త్రివిక్రం రాసిన మాటలు హైలెట్. బ్రహ్మానందం హాస్యం, నాగార్జున అందం, సోనాలీ బింద్రే అభినయం, ధర్మవరపు సుబ్రమణ్యం , తనికెళ్ల భరణి , చంద్రమోహన్ చక్కగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలిచింది.
గుండెల్లో ఏముందో అనే పాట టాప్ టెన్‌లో ఒకటిగా నిలిచింది. అమ్మాయిలపై రాసిన లేత మెరుపు తీగలు సాంగ్ కూడా పాపులర్ పాటగా ఉన్నది. డైరెక్టర్ పనితనం, నటీ నటుల మధ్య కెమిస్ట్రీ పండింది. సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. తక్కువ పెట్టుబడితో తీసిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో అటు నాగార్జునకు మంచి సినిమాగా గుర్తుండి పోతే..సోనాలి బింద్రేకు మాత్రం మరిచి పోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది. చాలా సినిమాలలో నటించి మెప్పించిన ఈ స్వతహ సిద్ధమైన అందం కలిగిన అభినేత్రికి ఉన్నట్టుండి అనారోగ్యం పాలైంది. ఈ వార్త దేశంలోని అభిమానులను కంట తడి పెట్టించింది. అమాయకంగా..గోముగా..చెరగని చిరునవ్వుతో ..పలకరించే ఈ సుందరికి క్యాన్సర్ సోకిందన్న వార్త వైరల్ గా మారింది.
మనీషా కోయిరాలా ఇంకో వైపు సోనాలి ఈ ప్రమాదకరమైన వ్యాధికి గురవడం చాలా బాధ కలిగించింది. తనను క్యాన్సర్ కబళిస్తుందని తెలిసినా ..పెదవుల మీద అదే చిరునవ్వుతో సమాధానం ఇచ్చిన తీరు చాలా మందిని విస్మయానికి గురి చేసింది. తనకు ఏమీ కాదని..తన కుటుంబీకుల తోడ్పాటు ఉన్నంత వరకు ఇలా బతుకుతూనే ఉంటానని..మీతో కలిసి..గడిపిన క్షణాలు తనకు కావాల్సినంత బలాన్ని ఇస్తున్నాయని తెలిపింది. విచిత్రమైన కాలం ఈ అద్భుతమైన సౌందర్య రాశి మీద కన్నేసింది ఎందుకో.. ఆ దేవుడుంటే కరుణించాలని సోనాలి బతికే ఉండాలని అభిమానులుగా కోరుకుందాం. చావు పక్కనే ఉన్నా ..రోగం బాధకు గురి చేస్తున్నా..సడలని ధైర్యాన్ని స్వంతం చేసుకున్న సోనాలి బింద్రే మనతో పాటే ఉంటుందని ఆశిద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి