ఢిల్లీలో చక్రం తిప్పనున్న కేసీఆర్ - దేశం చూపు గులాబీ బాస్ వైపు
మాటలతో మంటలు రాజేసి..గుండెల్లో నిద్రపోయే దమ్మున్న..డైనమిక్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు కేసీఆర్. ఈ మూడు అక్షరాలు ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్నాయి. పలు భాషల్లో పట్టు..అపారమైన విజ్ఞానం..రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా ఇప్పటికే వినుతికెక్కారు. ఆయన ఏది మాట్లాడితే అది సంచలనంగా మారి పోయింది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, వ్యాపార, వాణిజ్య రంగాలలో కేసీఆర్ కు మంచి పట్టుంది. పరిపాలన ఎలా సాగించాలో..ఎవరిని ఎక్కడ ఉంచాలో..ఎవరిని ఎలా ఉపయోగించు కోవాలో..ప్రభుత్వాన్ని సమర్థవంతగా తీసుకెళ్లగలిగే సత్తా ఆయనకే ఉన్నది. మాటలతో మంటలు పెట్టించగలరు..లక్షలాది జనాన్ని గంటల తరబడి తన వాక్చాతుర్యంతో లేవకుండా కూర్చోబెట్టగలరు.
ఎంతో ముందు చూపు కలిగి ఉండడమే కాదు..దేశానికి..రాష్ట్రానికి దశ..దిశను నిర్దేశించే స్థాయి కలిగిన లీడర్‌గా గుర్తింపు పొందారు. ఏ అంశం మీదనైనా అనర్ఘలంగా విడమర్చి చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ పదం ఉచ్చరించాలంటే భయపడిన రోజుల్లో ..నిర్బంధం ఎదుర్కొన్న పరిస్థితులను దాటుకుని ప్రపంచంలోనే సగర్వంగా..సమున్నతంగా తల ఎత్తుకుని ..ఎలుగెత్తి చాటేలా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన ఈ ముఖ్యమంత్రి కి వ్యవసాయం ..అభివృద్ధి అంటే ప్రేమ. సమాజాన్ని, దేశాన్ని ప్రభావితం చేసే సాంకేతిక రంగంలో సైతం కేసీఆర్‌కు మంచి పట్టుంది. పరిపాలనా పరంగా గుక్క తిప్పుకోకుండా గంటల తరబడి చట్టాలను వల్లెవేసే సత్తా ఆయనకు మాత్రమే స్వంతం. ఒకప్పుడు దేశంలో బెస్ట్ ఆరేటర్, బెస్ట్ పొలిటిషియన్ గా మాజీ ఎంపీ జైపాల్ రెడ్డి పేరు ఠక్కున ఉదహరించే వారు. కానీ ఇపుడు సీన్ మారింది. దేశం మొత్తం మీడియా అంతా కేసీఆర్ జపం చేస్తోంది.
ఇంగ్లీష్ లోను..ఉర్దూ. హిందీలోను..స్వచ్ఛమైన తెలంగాణ మాండలికం, యాసలోను ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు ఈ గులాబీ బాస్. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన పోరాటానికి, ఉద్యమానికి , ఆందోళనలను నిర్వహించిన చరిత్ర ఈ ఉద్యమసేనానిది. తెలంగాణ అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైంది. తీవ్రమైన వివక్షను అనుభవించింది. కరువు కాటకాలతో అల్లాడింది. లెక్కలేనన్ని అక్రమ కేసులు ఈ ప్రాంతపు బిడ్డల మీద మోపబడ్డవి. గుక్కెడు నీళ్ల కోసం ..బతుకు దెరువు కోసం వందలాది కిలోమీటర్లు నడిచి వెళ్లిన సందర్భాలు అనేకం. తరాలు మారినా పాలకులు మారలేదు. సమస్యలు తీరలేదు. ప్రజలు అనేక అగచాట్లను అనుభవించారు. వేలాది మంది త్యాగాలు చేశారు. బలిదానాలు చేశారు. మరికొంత మంది ఆత్మార్పణం చేసుకున్నారు. లెక్కలేనన్ని ఆత్మహత్యలు, రైతులు అరిగోస పడ్డరు. అయినా ఏలిన నాయకులు పట్టించు కోలేదు. కనీసం స్పందించ లేదు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ అన్నందుకు ఎన్ కౌంటర్లు కాబడ్డారు.
ముక్కు పచ్చ లారని పిల్లలు తమ విలువైన జీవితాలను కోల్పోయారు. 610 జీఓ అమలు కాలేదు. వేలాది ఉద్యోగాలను స్థానికేతరులు లాక్కుని పోయారు. అయినా స్పందించ లేదు. చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఈ సమయంలో నీళ్లు, నిధులు , నియామకాలు అనే పేరుతో పోరాటానికి శ్రీకారం చుట్టారు. లక్షలాది ప్రజలు, యువతీ యువకులు రోడ్ల మీదకు వచ్చారు. శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా సంబండ వర్ణాలు ఏకమై ఒకే నాదమై తమ గొంతుకను బలంగా వినిపించాయి. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్ల పరిధిలో పనిచేసిన వారంతా ఒకే తాటిపై నిలిచారు. రహదారులపైనే భోజనాలు చేసుకుని ఉద్యమానికి ఊపిరి పోశారు. వీరందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దే. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించేలా చేశారు. ఒకప్పుడు అసెంబ్లీలో, బయట తెలంగాణ అనే పదం నిషిద్ధం. అలాంటి విపత్కర పరిస్థితుల్లోంచి ఈ ప్రాంతపు ప్రజలకు స్వేచ్ఛా వాయులను ప్రసాదించిన దేవుడు కేసీఆర్.
కేవలం తెలంగాణ సాధనే లక్ష్యంగా బరిలో నిలిచిన టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చింది. ముందస్తుగా ఎన్నికల్లోకి దిగి రెండోసారి ప్రభుత్వాన్ని ఏ్పాటు చేసింది. ఇది దేశంలోనే ఓ రికార్డుగా నమోదైంది. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పాలనలో సమూలమైన మార్పులు చేశారు. పలు సంక్షేమ పథకాలు అమలు చేశారు. దేశానికి దిశా నిర్దేశనం చేసే నాయకులు, పార్టీలు లేవని..కాంగ్రెస్, బీజేపీలకు కాలం చెల్లిందంటూ కేసీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అపారమైన వనరులు కలిగిన ఈ దేశంలో ఇంకా సగం జనం కూటికి, ఉపాధి కోసం ఇబ్బందులు పడడం శోచనీయమన్నారు. అగ్రికల్చర్ మెకానిజం , ఆర్థిక వ్యవస్థ, సామాజిక అభివృద్ధి, సంక్షేమం వీటన్నింటిని కేంద్రంగా చేసుకుని ఢిల్లీలో పాలన సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఆ మేరకు ఆయన స్వంతంగా ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు.
ఇందులో భావసారూప్యత కలిగిన నేతలు, పార్టీలను స్వయంగా ఆయా రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నేతలను, పార్టీల అధిపతులను కలిశారు. వారిని తనకు మద్ధతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇటీవల నిర్వహించిన సర్వేలలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించబోతున్నాయని వెల్లడైంది. దీంతో కాంగ్రెస్, బీజేపీలు తప్పని పరిస్థితుల్లో ఈ పార్టీల మద్ధతును తీసుకోవాల్సిందే. అందుకే అందరికంటే ముందే గులాబీ బాస్ తమ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను 16 సీట్లలో గట్టి పోటీ ఇస్తున్నారు. ఒక్క సీటును మాత్రం ఎంఐఎంకు విడిచి పెట్టారు. ఈ సీట్లలో కనుక విజయం సాధిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చంటూ ప్రకటించారు.
రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం ..ప్రాజెక్టులు పూర్తి చేసుకునేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు. మొత్తం మీద దేశంలో జరుగుతున్న 16వ లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేక పోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దిశా నిర్దేశనం చేయడమే కాదు..పాలనను పరుగులు పెట్టించడంలోను..సమర్థవంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకోవడంలోను ఆయనకు ఆయనే సాటి. కాదనగలరా ఎవరైనా..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి