శివమెత్తిన పోలార్డ్ - గెలుపు వాకిట బోల్తా పడిన పంజాబ్

క్రికెట్ మ్యాచ్ అంటే ఇదీ..ఇలా ఉంటేనే అభిమానులకు పండుగ. ఏ సమయంలోను గెలవదని అనుకున్న ముంబై ఇండియన్స్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది . ఆఖరి బంతికి పంజాబ్ పై అనుకోని విజయం సొంతం చేసుకుంది . ఓ వైపు కెప్టెన్ గా అదనపు భాద్యతలు నిర్వహిస్తున్న పోలార్డ్ సునామీలా చెలరేగి పోయాడు . పంజాబ్ జట్టుకు చుక్కలు చూపించాడు . సహచర ఆటగాళ్లు ఒక్కొక్కరే పెవిలియన్ దారి పడుతుంటే ..ఎలాంటి స్థైర్యం కోల్పోకుండా దుమ్ము రేపాడు . ఎలాంటి బంతులు వచ్చినా సరే పరుగుల వరద పారించాడు . జట్టు ఆశలు వదులుకున్న స్థితిలో పోలార్డ్ అడ్డు గోడలా నిలిచాడు . ఎక్కడ కూడా తడబాటుకు లోను కాలేదు . ఫోర్లు ..సిక్సర్లతో దాడి చేశాడు. ఇక విజయం ఖాయమేనని తేలే సమయంలో పోలార్డ్ అవుటయ్యాడు . బౌలర్ ఆఖర్లో రెండు పరుగులు చేయడంతో ముంబై చిరస్మరణీయమైన గెలుపు నమోదు చేసుకుంది . ఈ మ్యాచే గొప్పనైన మ్యాచ్ గా ఈ టోర్నీలో నిలిచింది .

ముంబై పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఈ ఉత్కంఠ పోరులో చివరి వరకు ఫ్యాన్స్ ఊపిరి బిగపట్టి ఎదురు చూశారు . నిన్న రస్సెల్ బ్యాటింగ్ ను మరువక ముందే పోలార్డ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు ..10 సిక్సర్లతో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు . 198 పరుగుల టార్గెట్ ను ఈజీగా ఛేదించారు . అంతకు ముందు పంజాబ్ జట్టులో కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో వంద పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు . మరో వైపు గేల్‌ చెలరేగి ఆడడంతో మూడు ఫోర్లు ఏడు సిక్సర్లతో 63 పరుగులు చేయడంతో భారీ స్కోర్ ను నమోదు చేసింది . అత్యుత్తమమైన ఆటతీరు ప్రదర్శించిన పోలార్డ్ కు
మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఇక ఆట విషయానికి వస్తే పొలార్డ్‌ బరిలోకి వచ్చే సమయానికి ముంబై స్కోరు 8 ఓవర్లలో 56/2. ఆపై డికాక్‌ (24), ఇషాన్‌ కిషన్‌ (7), హార్దిక్‌ పాండ్యా (19), క్రునాల్‌ పాండ్యా (1)వంటి పేరున్న బ్యాట్స్‌మెన్‌ ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరుతుండడంతో మ్యాచ్‌పై ముంబై ఆశలు వదులుకున్న దుస్థితి. ఈ దశలో శివాలెత్తిన పొలార్డ్‌ పంజాబ్‌ బౌలర్లను చితగొట్టాడు. దాంతో 30 బంతుల్లో 63 పరుగులు చేయాల్సిన దశనుంచి ఆఖరి ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన స్థితికి ముంబై చేరింది. యువ పేసర్‌ సామ్‌ కర్రాన్‌ వేసిన 19వ ఓవర్లో పొలార్డ్‌ రెండు సిక్స్‌లు, ఫోర్‌ కొట్టిన పొలార్డ్‌..20వ ఓవర్లో అంకిత్‌ రాజ్‌పుత్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అప్పటిదాకా అరుపులతో దద్దరిల్లిన స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం. అటు పంజాబ్‌ జ ట్టులో గెలుపుపై ఆశ. కానీ అల్జారి సంయమనంతో బ్యాటింగ్‌ చేసి ఆఖరి బంతికి రెండు పరుగులు చేయడంతో ముంబై విజయం సొంతం చేసుకుంది.
అంతకు ముందు ఓపెనర్‌ గేల్‌ మెరుపులకు కేఎల్‌ రాహుల్‌ శతక ఇన్నింగ్స్‌ తోడవడంతో పంజా బ్‌ భారీ స్కోరు చేసింది. ఆరంభంలోనే గేల్‌ సిక్సర్లతో హోరెత్తించగా.. చివరి రెండు ఓవర్లలో రెచ్చిపోయిన రాహుల్‌ ఐపీఎల్‌లో తన తొలి సెంచరీ నమోదుచేశాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, గేల్‌ శుభారంభం అందించారు. ఆరంభంలో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తొలి రెండు ఓవర్లలో 3 పరుగులే వచ్చాయి. అయితే, బెహ్రెన్‌డార్ఫ్‌ (1/35) వేసిన మూడో ఓవర్‌ తొలి బంతికే ఫోర్‌ బాదిన రాహుల్‌.. తర్వాత జోసెఫ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో బ్యాట్‌ను ఝుళిపించాడు. అప్పటి వరకు జాగ్రత్తగా ఆడుతున్న గేల్‌.. బెహ్రెన్‌డార్ఫ్‌ వేసిన 5వ ఓవర్‌లో 6,6,4,6తో చెలరేగి 23 పరుగులు రాబట్టాడు. కానీ, మరో సిక్స్‌, ఫోర్‌ బాదిన రాహుల్‌.. గేల్‌ స్కోరును అధిగమించాడు.
హార్దిక్‌ తొలి ఓవర్‌లోనే సిక్స్‌, రెండు ఫోర్లతో గేల్‌ స్వాగతం పలికాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 93 పరుగులకు చేరింది. తర్వాతి ఓవర్‌లో క్రునాల్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన గేల్‌ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. జట్టు స్కోరు వంద దాటింది. అయితే, గేల్‌ను క్యాచ్‌ అవుట్‌ చేయడం ద్వారా బెహ్రెన్‌డార్ఫ్‌.. తొలి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. గేల్‌ అవుటైన తర్వాత కింగ్స్‌ పంజాబ్‌ స్కోరు వేగం కొంత మందగించింది. వన్‌డౌన్‌లో వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌ (7), కరుణ్‌ నాయర్‌ (5)ను హార్దిక్‌ (2/57) తన వరుస ఓవర్లలో అవుట్‌ చేసి పంజాబ్‌ను దెబ్బకొట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కర్రాన్‌.. బుమ్రా (1/38) 18వ ఓవర్‌లో ఎదుర్కొన్న తొలి రెండు బంతులను ఫోర్‌కు తరలించి ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. తర్వాతి బంతికే క్యాచ్‌ అవుటయ్యాడు. అయితే, హార్ధిక్‌ పాండ్యా 19వ ఓవర్‌లో జూలు విదిల్చిన రాహుల్‌ 6,4,6,6తో మొత్తం 25 పరుగులు పిండుకున్నాడు.

మొత్తం మీద ఐపీఎల్ టోర్నీలో ఇలాంటి ఉత్కంఠ భరితమైన మ్యాచ్ ఫ్యాన్స్ చూసి ఉండక పోవొచ్చు . అందుకే టి 20 మ్యాచ్ లకు ఎక్కడలేని ఆదరణ పెరుగుతోంది . కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి . ఏది ఏమైనా పోలార్డ్ మెరుపు ..రాహుల్ ప్రదర్శన ..గేల్ బ్యాటింగ్ అభిమానులకు మరింత కిక్కు ఇచ్చిందనే చెప్పాలి .

కామెంట్‌లు