జనం చేతుల్లో ఆయుధం..ప్రజాస్వామినికే తలమానికం రాజ్యాంగానికి రక్ష ..జాతికి సురక్ష..ఓటు ..!
అయిదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలను చూసి ఆవేశ పడిపోతే ఎలా..నిరుత్సాహానికి గురైతే ఏం ప్రయోజనం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి పేరుంది. ఇక్కడున్నంత స్వేచ్ఛ ఇంకే దేశంలోను లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నో కులాలు, మతాలు, వర్గాలు, జాతులు కోట్లాది మంది సఖ్యతతో జీవిస్తున్నారు. అభిప్రాయాలలో భేదాలు ఉన్నప్పటికీ..ఆలోచనల్లో తేడాలు ఉన్నప్పటికీ ఎన్నికలు వచ్చే సరికల్లా ఎవరికి వారు తమ ఆత్మ ప్రబోధం మేరకు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చిన మహాత్ముడు కలలు కన్న గ్రామాలు పురోభివృద్ధి సాధించాలంటే ఓటును వాడుకోవాల్సిందే. ప్రతి అయిదేళ్లకు ఒకసారి పార్లమెంట్‌కు..ఆయా రాష్ట్రాలలో శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి.
ఇది సర్వసాధారణం. కొన్ని సందర్భాలలో ఓటు వేయకుండా తమకెందుకులే అనే ధోరణితో చాలా మంది దూరంగా ఉంటున్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకునే అరుదైన అవకాశాన్ని ఇచ్చింది. దీని ద్వారానే మనం ప్రజా ప్రతినిధులను..మన కోసం పనిచేసే వారిని ఎన్నుకోగలుగుతున్నాం. ఇపుడు నేరం ..రాజకీయం ఒక్కటై పోయాయి. ఇది చాలా బాధ కలిగించే విషయం. కోట్లాది ప్రజల జీవన సరళిని..సమాజపు దశ దిశను మార్చే శక్తివంతమైన ఉపకరణమే ఓటు. అక్షరాస్యులు..నిరక్షరాస్యులు ..ప్రతి ఒక్కరు 18 ఏళ్లు నిండిన వాళ్లంతా తమకు లభించిన ఈ అరుదైన అవకాశాన్ని మిస్ కాకూడదు. ఓటు వాడుకోవాలంటే మరో అయిదేళ్ల దాకా వేచి చూడాల్సిందే. ఒక్క ఓటు కదా అని ఈజీగా తీసి పారేయడానికి వీలు లేదు. చాలా సందర్భాలలో ఒకే ఒక్క ఓటు నిర్ణయాత్మక పాత్రను పోషించగా..ప్రభుత్వాలను ప్రభావితం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఒటుకు అంత విలువ..అంతటి ప్రాధాన్యత.
దేశ భవిష్యత్తు..జాతి గమనం అంతా ఓటు ద్వారానే నిర్ణయం కాబోతుంది కాబట్టి ఓటును కాపాడు కోవాలి. ఓటు మీలోని అభిప్రాయాలకు..ఆలోచనలకు..మీ నిర్ణయాలకు..మీ భవిష్యత్‌కు సంబంధించి తీసుకునే సమున్నత నిర్ణయం ఇది. కోట్లాది రూపాయల ప్రజా ధనం ఎన్నికలు నిర్వహించేందుకు ఖర్చు చేస్తారు. ఇందు కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరుపుతారు. ఎక్కడైనా..ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. మహిళలు, చంటి పిల్లలు, వృద్ధులు, అనాధలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది.వంద కోట్లకు పైగా ఉన్న జనాభాలో ఎన్నికలు నిర్వహించడం కత్తి మీద సామే. 2019లో 16వ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.
అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీగా ఉన్నారు. ప్రచారంలో దూసుకెళుతున్నారు. కేవలం ఒకే ఒక్క ఓటును వినియోగించుకునే వారి కోసం పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన చరిత్ర ఎన్నికల సంఘానికి ఉన్నది. గుజరాత్ రాష్ట్రంలోని గిరి అటవీ ప్రాంతంలో మహంత్ భరత్ దాస్ దర్షన్ దాస్ ఒక్కరే వుంటారు. గత కొన్నేళ్లుగా ఆయన తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఓటుకు ఉన్న పవర్ అలాంటిది మరి. ఆ ఒక్క ఓటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోను..కూల్చడంలోను కీలక భూమిక పోషిస్తుంది. కోట్లాది జనం ఉన్నా 39 నుండి 50 శాతం మధ్యలోనే పోలింగ్ నమోదవుతోంది. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా ప్రజలు పోలింగ్ పట్ల ఉదాసీన వైఖరి అవలంభించడం..చైతన్యవంతం కాక పోవడం బాధాకరం. ప్రభుత్వాలు కూలి పోయిన సందర్భాలు జరిగాయి.
2004లో జరిగిన కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనతాదళ్ పార్టీకి చెందిన ఏ ఆర్ కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన ధృవనారాయణ్ చేతిలో కేవలం ఒకే ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు. కృష్ణమూర్తికి 40 వేల 752 ఓట్లు రాగా నారాయణ్ కు 40 వేల 752 ఓట్లు వచ్చాయి. సంతెమరహల్లి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కృష్ణమూర్తి తన స్వంత కారు డ్రైవర్ ఓటు వేస్తానని వేడుకున్నా పట్టించు కోలేదు. దీంతో ఆ ఒక్క ఓటు వేసి ఉండి వుంటే గెలిచే వారు. జనతాదళ్ పవర్‌లోకి వచ్చేది. సో ఇక్కడ ఓటు ఎంత విలువైనదో తెలిసింది కదూ. ఇదే తరహాలో రాజస్థాన్ లో 2008లో జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ సీ.పి. జోషి బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ సింగ్ చౌహాన్ చేతిలో కేవలం ఒకే ఒక్క ఓటుతో అపజయం పొందారు. 62 వేల 215 ఓట్లు జోషికి రాగా చౌహాన్‌కు 62 వేల 216 ఓట్లు వచ్చాయి. జోషి తల్లి, భార్య, డ్రైవర్ పోలింగ్ స్టేషన్ దాకా వచ్చి ఓటు హక్కు వినియోగించు కోలేక పోయారు. దీంతో జోషి ఓటమిని చేతులారా తెచ్చుకున్నారు.
2015లో మొహాలి మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అకాళిదళ్ తరపున పోటీ చేసిన నిర్మల్ కౌర్ మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన కుల్విందర్ సింగ్ రాంగి ఒకే ఒక్క ఓటుతో నెగ్గారు. ముంబయిలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో శివసేన, బీజేపీ అభ్యర్థులకు సమాన ఓట్లు పోలయ్యాయి. దీంతో లాటరీ పద్ధతిని అనుసరించారు ఎన్నికల అధికారులు. చివరకు సేన అభ్యర్థిని గెలుపు వరించింది. ఒక వేళ బీజేపీ అభ్యర్థి ఒక ఓటు సాధించి వుంటే విజయం సాధించి వుండే వారు. దేశ చరిత్రలోనే 1999 సంవత్సరం గుర్తుంచు కోవాల్సిన సందర్భం. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్‌పేయ్ సర్కార్ కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయింది. 13 నెలల కాలం మాత్రమే పరిపాలించగలిగింది జనతా సర్కార్. వీటన్నింటిని పరిశీలిస్తే ఏమనిపిస్తుంది..ఓటు ఎంత మహత్తరమైనది..ఎంత శక్తివంతమైనదో తెలుస్తుంది. సో..ఓటును నిర్లక్ష్యం చేయకండి. ఓటు హక్కు వినియోగించుకోండి. దేశ భవిష్యత్ మీరందించే ఓట్లపైనే ఆధారపడి ఉందన్నది మాత్రం గుర్తుంచుకోండి...!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి