జనం మెచ్చిన లీడర్లు..మాటలతో మంటలు ..!
ఓ వైపు ఎండలు మండిపోతుంటే..మరో వైపు జనం మెచ్చిన పొలిటికల్ లీడర్లు మాత్రం తమ పంచ్‌లు..ప్రసాలతో మరింత అగ్గి రాజేస్తున్నారు. ఎన్నికల పుణ్యమా అంటూ ఊపిరి పీల్చుకున్న జనానికి తమ మాటల తూటాలతో కంటి మీద కునుకే లేకుండా చేస్తున్నారు. పోలింగ్ కొద్ది రోజులే ఉండడంతో లీడర్ల పంచ్‌లను భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియాలోనే తన మాటలతో మెప్పించే దమ్మున్న లీడర్‌గా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత..ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పేరుంది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ తదితర భాషలలో ఆయనకు మంచి పట్టుంది. అన్నింటికంటే తెలంగాణ యాస, మాండలికాన్ని ఆయన వంట పట్టించుకున్నంతగా ఇంకే నాయకుడు ప్రాక్టీస్ చేయలేదు. ఏ విషయం గురించైనా అనర్ఘలంగా ప్రసంగించగల దమ్ము ..ధైర్యం ఒక్క కేసీఆర్‌కే ఉన్నది.
జనాన్ని మాటలతో మెస్మరైజ్ చేయడం..కొత్త విషయాల గురించి తెలియ చేయడం..లక్షలాది ప్రజలను ఒకే చోట నుండి కదలనీయకుండా చేయడంలో ఆయనకు ఆయనే సాటి. కేసీఆర్ వచ్చుడో..సచ్చుడో అంటూ ఆయన ఇచ్చిన నినాదం జనాన్ని ఉద్యమం వైపు మళ్లేలా చేసింది. ఏకంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేందుకు దోహద పడ్డది. కవి, రచయిత, గాయకుడు, నాయకుడు, మేధావి, ఆలోచనాపరుడు, రాజకీయ దురంధురుడిగా కేసీఆర్‌కు పేరుంది. భారత రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌లోని చట్టాలను కూలంకుశంగా ఆకళింపు చేసుకున్నారాయన. అంతేకాకుండా ప్రతిపక్షాలు ఆశ్చర్య పోయేలా చేయడంలో ఆయన దిట్ట. అటు భక్తి పరంగా ఇటు రాజకీయ పరంగా తనకంటూ ఓ ఇమేజ్‌ను సృష్టించిన ఈ నాయకుడు ఏది మాట్లాడితే అది ఓ రికార్డు..మరో సంచలనం కూడా. ఈసారి ఎన్నికల్లో సారు..కారు..పదహారు అన్న నినాదం ఇండియాను ..ఇతర రాష్ట్రాల్లోను సంచలనం రేపింది.
ఇక ప్రధానమంత్రి మోడీది భిన్నమైన శైలి. సౌమ్యంగా మాట్లాడినా..ఆయన మాటలు కఠినంగా ఉంటాయి. సూటిగా తగులుతాయి. ఉన్నది ఉన్నట్టు చెప్పడం..యుద్ధంలో సైనికుడు తుపాకి ఎక్కు పెట్టినట్టుగా ఉంటుంది ఆయన మాట్లాడితే. కోయి ఛాయ్ వాలా హై..మై చౌకీదార్ హూ..అంటూ కొత్త నినాదం అందుకున్నారు. స్వచ్ఛ్ భారత్..నోట్ల రద్దు తన వల్లనే అయ్యిందని ఆయన ఎక్కడికి వెళ్లినా చెబుతారు. ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతపు భాషల్లో పరిచయం చేసుకోవడం మోడికి అలవాటు. మేడ్ ఇన్ ఇండియా..మేక్ ఇన్ ఇండియా నినాదం జనాన్ని మరింత ప్రభావితం చేసింది. చంద్రబాబు స్టయిల్ వేరు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ నాయకుడు ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఎన్నడూ లేనంతగా విజయం కోసం..తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
మోడీని బాబు టార్గెట్ చేసినంతగా ఇంకే నాయకుడు, నాయకురాలు చేయలేదు. మోడీతో ఢీకొట్టేందుకు చాలా మంది నేతలు భయపడ్డారు. అయినా బాబు మాత్రం ఒంటరిగానే బీజేపీయేతర శక్తులను కూడగట్టడంలో సక్సెస్ అయ్యారు. జాబు రావాలంటే బాబు రావాలి ..మీ భవిష్యత్తు నా బాధ్యత ఇపుడు మరింత పాపులర్ అయ్యాయి. చంద్రన్న పేరుతో రూపొందించిన ప్రకటనలు ఇపుడు రాష్ట్ర మంతటా హల్ చల్ చేస్తున్నాయి. ఇక వైసీపీ నేత జగన్ ..ఎక్కడికి వెళ్లినా నన్ను దీవించండి అంటూ కోరుతున్నారు. రావాలి జగన్..కావాలి జగన్ అనే నినాదం ఇపుడు మరింత పాపులర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ఏది మాట్లాడితే అది సంచలనమే. నేను ఎవ్వరి జోళికి వెళ్లను..కానీ నా జోళికి వస్తే తాట తీస్తా..ఇపుడది వైరల్ అయ్యింది. జనం లేక పోతే మేం లేం. మీరే దేవుళ్లంటూ ప్రచారంలో దూసుకెళుతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్. మమతా బెనర్జీ మోడీకో హఠావో..దేశ్ కీ బచావో అని నినాదం ఎత్తుకుంది.
బీఎస్పీ అధినేత్రి మాయావతి ..నోట్ కా నహీ..ఓట్ దేదో..అంటోంది..నమో నమావి..మోడీ సునామీ అంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ..కారు టీఆర్ ఎస్ దైతే..స్టీరింగ్ మాత్రం మాదేనంటూ చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాత్రం ..ఆచి తూచి మాట్లాడుతున్నారు. పవర్‌లోకి వచ్చేందుకు నానా తంటాలు పడుతున్న ఆయా పార్టీల నాయకులు సందర్భానుసారంగా మాట్లాడే మాటలకు మరింత ప్రాధాన్యత పెరుగుతోంది. తెలంగాణ యాసతో జనాన్ని ఆకట్టుకునే గులాబీ బాస్ ..విపక్షాలపై సుతిమెత్తగా చురకలు అంటిస్తుంటారు. అందుకే ఆయన సభలకు ప్రజలు ఎగబడతారు. మొత్తం మీద ఎన్నికల పుణ్యమా అని కొద్ది సేపు వీరి మాటలతో ఓటర్లు రిలాక్స్ అవుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి