చక్రం తిప్పేదెవ్వరు..ఢిల్లీ కోటపై పాగా వేసేదెవ్వరు..? - పోటీ రసవత్తరం జనం ఉత్కంఠ భరితం
వంద కోట్ల భారతావని ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది. కొద్ది రోజుల్లో ఎవరు ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంటారనేది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సమున్నత జాతి అంతా ఒకే తాటిపై నిలిచింది. ఈసారి ఎన్నికలు ..సమర్థతకు..నీతికి..నిజాయితీకి..అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రజలు , యువతీ యువకులు తమ భవిష్యత్ బాగుండాలని సముచిత నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. తాయిలాలు, సబ్సిడీలు..సంక్షేమ పథకాలు ఎర వేసి ఓట్లు రాబట్టుకునే పార్టీలకు చుక్కలు చూపిస్తామంటున్నారు. దేశమంతటా మోడీ గాలి వీసినా చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు తమ హవాను కొనసాగించాయి.
ఎన్ని ప్రయత్నాలు మోడీ, అమిత్ షా చేసినా ఢిల్లీ కోటపై కమలం జెండా ఎగుర వేయలేక పోయారు. సమాచార హక్కు చట్టం కోసం ప్రపంచమంతా తన వైపు తిప్పుకునేలా చేసిన ఘనత ఒక్క అరవింద్ కేజ్రివాల్‌కే దక్కుతుంది. ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రజాస్వామిక దేశంగా వినుతికెక్కిన ఇండియాలో 17వ లోక్‌సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఏడు దశల్లో దేశమంతటా పోలింగ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. ఆ మేరకు అధికారులు నిమగ్నమయ్యారు. ఏప్రిల్ 11న పోలింగ్ ప్రారంభమై మే 19వ తేదీతో ముగుస్తుంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమం 23న జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమలులోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు.
543 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభల కాలం పూర్తి కావడంతో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్‌లో 2, గోవాలో 2, గుజరాత్‌లో 26, హర్యానాలో 10, హిమాచల్ ప్రదేశ్‌లో 4, కేరళలో 20, మేఘాలయలో 2 , మిజోరంలో ఒక సీటుకు పోలింగ్ జరగనుంది. నాగాలాండ్ రాష్ట్రంలో ఒక ఎంపీ స్థానానికి, పంజాబ్‌లో 13, సిక్కింలో ఒకటి, తమిళనాడులో 39 సీట్లకు, తెలంగాణలో 16 , ఉత్తరాఖండ్‌లో 5, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒకటి, దాద్రానగర్ హవేలిలో ఒకటి, దామన్ డయ్యు లో ఒకటి, పుదుచ్ఛేరిలో ఒకటి, ఛండీగడ్‌లో ఒకటి, ఢిల్లీలో 7, లక్షద్వీప్‌లో ఒకటి చొప్పున సీట్లున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు.
మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ, రాహుల్ గాంధీ నేతృత్వంలోని యుపీఏలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తలపడనున్నాయి. గతంలో కంటే ఎప్పుడూ లేనంతగా ఈసారి ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. ఎన్నికల సంఘం తేదీ ప్రకటించిన వెంటనే ప్రధానమంత్రి మోడీ ఎన్నికల నగారా మోగించారు. అదే రోజు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి బెహన్ మాయావతి, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లు కలిసి 80 సీట్లకు గాను 76 సీట్లలో సంయుక్తంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మోడీ నోట్ల రద్దు, రాఫెల్ కుంభకోణాలను ఎక్కువగా కాంగ్రెస్ ప్రస్తావిస్తోంది. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోడీ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఈసారి యువత బీజేపీ పట్ల ఒకింత ఆగ్రహంగా ఉన్నారు. దక్షిణాదిలో 91 సీట్లుంటే 21 సీట్లు మాత్రమే బీజేపీ చేజిక్కించుకోగలిగింది.
అత్యధిక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు తమ సత్తాను చాటనున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం, కేరళలో వామపక్ష సర్కార్, తమిళనాట అన్నా డిఎంకే, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఏపీలో తెలుగుదేశం, తెలంగాణలో టీఆర్ ఎస్ ఇలా..ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కొంత మేర ప్రభావితం చేయనున్నాయి. దీంతో జాతీయ స్థాయి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలతో కలుపుకుని పోవాల్సిన పరిస్థితి నెలకొంది. నోట్ల రద్దు, నిరుద్యోగం బీజేపీకి ప్రతిబంధకంగా మారగా..కాంగ్రెస్ పూర్వ పట్టు నిలుపుకునేందుకు నానా తంటాలు పడుతోంది. రాహుల్ గాంధీ యూత్ కు ప్రయారిటీ ఇస్తున్నా సీనియర్ల వరకు వచ్చే సరికల్లా ఆగిపోతోంది. చంద్రబాబు, మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, కేసీఆర్, కేజ్రీవాల్..నవీన్ పట్నాక్, స్టాలిన్, తదితరులు రాబోయే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చూపనున్నారు. మొత్తం ఢిల్లీలో కమలం మరోసారి వికసిస్తుందా..లేక హస్తం మిత్రులతో కలిసి తన హవాను కొనసాగిస్తుందా..లేక ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒకే వేదికను పంచుకుంటాయా అన్నది కొద్ది రోజులు ఆగితే తేలుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి