గూగుల్ మెచ్చిన కుర్రాడు - అబ్దుల్లా అదరహో - కోటి 20 లక్షల వార్షిక వేతనం
ప్రపంచీకరణ పుణ్యమా అని భారతీయ విద్యార్థులకు అపారమైన అవకాశాలు దక్కుతున్నాయి. లెక్కలేనంత మందికి ఐటీ దిగ్గజ కంపెనీలు సాదర స్వాగతం పలుకుతున్నాయి. ఇండియాతో పాటు అమెరికాలో అత్యధికంగా ఐటీ ప్రొఫెసనల్స్ మనవాళ్లే ఉన్నారు. ఐఐటీ, ట్రిబుల్ ఐటీ , ఎన్ఐటీ, ఇతర కాలేజీలనే గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, పొలారిస్, ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బైజూ తదితర కంపెనీలన్నీ దృష్టి సారిస్తున్నాయి. ఈ దేశంలో ఐఐటీలకు వున్నంత క్రేజ్..పోటీ ఇంకే కళాశాలలకు లేదు. కేంద్ర సర్కార్ భారీ ఎత్తున నిధులను ఖర్చు చేస్తోంది. సగటున ఒక్కో విద్యార్థికి ఐఐటీలల్లో కోర్సులు పూర్తయ్యేంత దాకా కోటిన్నర రూపాయలకు పైగా కేటాయిస్తోంది. నాణ్యవంతమైన బోధన..అద్భుతమైన వాతావరణం..ఎలాంటి వత్తిళ్లు లేని తరగతి గదులు..భిన్నమైన బోధన..వెరసి విద్యార్థులను భావి భారత టెక్కీలుగా తీర్చిదిద్దడంలో ఈ విద్యాలయాలు నిమగ్నమయ్యాయి.
అంతర్జాతీయ స్థాయిలో ఏ విశ్వ విద్యాలయమైనా ఇండియన్ ఐఐటీ స్టూడెంట్స్ అంటేనే మొదటి ప్రయారిటి ఇస్తున్నాయి. ఎక్కువ శాతం ఐటీ , ఈ కామర్స్ కంపెనీలన్నీ ఇంజనీరింగ్ లో టాప్‌లో నిలిచిన వారినే తీసుకుంటుండగా గూగుల్ దిగ్గజ సంస్థ మాత్రం అందుకు భిన్నంగా వెళుతోంది. విద్యార్థుల్లో క్రియేటివిటి..నేర్చుకోవాలన్న జిజ్ఞాస..వెరసి సాధించాలన్న కసి..పోటీ లో ముందంజలో ఉండేందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేదో మాత్రమే చూస్తోంది. అందుకే ఐఐటీలతో పాటు నాన్ ఐఐటీ స్టూడెంట్స్‌ను పరీక్షిస్తోంది. ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా సరే ప్రతిభ వుంటే చాలు పట్టేసుకుంటోంది. అందుకే గూగుల్ ప్రపంచంలోనే నెంబర్ వన్ కంపెనీగా తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తోంది. బంపర్ ఆఫర్లతో ..కళ్లు చెదిరే ప్యాకేజీలతో..ఊహించని రీతిలో సౌకర్యాలను కల్పిస్తోంది.
గూగుల్‌లో ఉద్యోగం అంటేనే అదో ఇంద్రభవనంలోకి వెళ్లినట్టుగా ఫీలై పోతారు మనోళ్లు. ఉద్యోగులను పనివాళ్లుగా చూడదు ఈ సంస్థ..తమ స్వంత కుటుంబంలోని వ్యక్తులుగా ట్రీట్ చేస్తుంది. అందుకే ప్రపంచంలో ఏ స్టూడెంట్‌ను పలకరించినా..కదిపినా మొదటి సమాధానం వచ్చేది..ఒక్కటే ..తమ ప్రాధాన్యత సంస్థ గూగుల్ అని చెబుతారు. ఈ సంస్థకు చెన్నైయికి చెందిన సుందర్ పిచ్చయ్ సిఇఓగా ఉన్నారు. నిరంతరం 22 గంటలపాటు పనిచేసే సత్తా ఉన్న ఈ ఐటీ ఎక్స్ పర్ట్ ఏది చేసినా ..ఇంకేం మాట్లాడినా సంచలనమే. నీ సర్టిఫికెట్లతో మాకు పనిలేదు. నీవేం చేస్తావో మాకు అవసరం లేదు. కావాల్సిందల్లా నీలో పోటీని తట్టుకునే శక్తి వుందా లేదా అన్నదే ముఖ్యం అంటారు. టెక్నాలజీ అప్ డేట్ కావడం..ప్రపంచంతో పోటీ పడే వాళ్ల కోసం వెదుకుతోంది. ఎంత వేతనమైనా సరే ఆఫర్ చేస్తోంది.
అక్కడ వేతనాలకు..సౌకర్యాలకు కొదవ లేదు. కావాల్సిందల్లా దమ్ముండాలి. ధైర్యం కావాలి. డిఫరెంట్ గా ఆలోచించాలి. అదే ముంబయికి చెందిన అబ్దుల్లా ఖాన్ చేశాడు. అతడి టాలెంట్‌ను గుర్తించింది గూగుల్. ఏకంగా సంవత్సరానికి కోటి 20 లక్షల జీతాన్ని ఆఫర్ చేసింది. పోనీ ఈ పోరడు ఐఐటీ కుర్రాడు అనుకుంటే పొరపాటు పడినట్లే. సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న ఈ కుర్రాడి పేరు ఒక్కరోజులో దేశమంతా వైరల్ గా మారింది. పట్టుమని 21 ఏళ్లు కూడా నిండని ఈ అబ్బాయి బిఇ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. టెక్నాలజీ అంటే ఇతడికి పంచ ప్రాణం. ఐఐటీయన్లకే అర్థం కాని ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేసే సత్తాను కలిగి ఉన్నాడు. శ్రీ ఎల్ ఆర్ తివారీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
ఈ కుర్రాడి టాలెంట్‌ను గమనించిన గూగుల్ క్యాంపస్ ఇంటర్వూ కండక్ట్ చేసింది. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఛాలెంజెస్ అనే టాపిక్ పై మనోడు ఇచ్చిన సినాప్సిస్..పవర్ పాయింట్ ప్రజెంటేషన్, చేసిన ఇంటర్వూకు లండన్‌లోని గూగుల్ ఆఫీస్ నిర్వాహకులు జాబ్ ఆఫర్ ప్రకటించారు. గత నవంబర్‌లో లండన్‌లో ఇంటర్వూకు హాజరయ్యాడు. వారిని మెప్పించాడు. భారీ ప్యాకేజీతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆర్డర్ ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి గూగుల్ ఇంజనీరింగ్ టీంలో కలిసి పనిచేయబోతున్నాడు అబ్దుల్లా ఖాన్. జేఇఇ మెయిన్స్ రాశాడు. అక్కడ స్కోర్ చేయలేక పోయాడు. అడ్వాన్స్ రాలేదు. నిరుత్సాహ పడలేదు. సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. కానీ పట్టుదలతో కోడింగ్‌లో పట్టు ఉండడం కొంచెం ప్లస్ పాయింట్ అయ్యింది. నెలకు 10 లక్షల జీతంతో అబ్దుల్లా ఖాన్ మరో కొన్ని నెలల్లో అందుకోబోతున్నాడు. సో..మెదడుకు పదును పెడితే..డిఫరెంట్ గా ట్రై చేస్తే మిమ్మల్ని గూగుల్ లాంటి కంపెనీలు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం ఐఐటీ సీటు రాలేదని కలత చెందకండి..ఐటీలో మేటిగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఏమో డాలర్లు మీ ఒడిలో వాలి పోవచ్చు..కదూ..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి