ఎన్నికల సంగ్రామం - హీటెక్కిన ప్రచారం
దేశ వ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు యుద్ధ రంగాన్ని తలపింప చేస్తున్నాయి. కేంద్రంలో పవర్‌లో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని ఎడతెగని ప్రయత్నాలు చేస్తోంది. ట్రబుల్ షూటర్‌గా పేరొందిన కమలనాథుల గుండె గొంతుక అమిత్ షా చాప కింద నీరులా చక్రం తిప్పుతున్నారు. తమకు రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ తీసుకు వచ్చేందుకు ఆపరేషన్‌ను స్టార్ట్ చేశారు. ఏ పార్టీ వారైనా సరే ..ఏ స్థానంలో ఉన్నా సరే గెలుపు గుర్రాలపైనే దృష్టి పెడుతున్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలు జాతీయ స్థాయి పార్టీలను ఒకింత కలవరానికి గురి చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కొలువుతీరి వున్నాయి. స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని జాతీయ స్థాయిలోని సర్వేలు తేటతెల్లం చేశాయి. దీంతో స్వయంగా దేశ ప్రధాని .బీజేపీ రథసారథి నరేంద్ర మోడీ విపక్షాలను టార్గెట్ చేశారు. ఓ ఛాయ్ వాలాను అందించిన ఈ దేశం మరోసారి చౌకీదార్‌గా ఉండే తనకు అవకాశం ఇవ్వండని కోరుతున్నారు.
ఇప్పటికే ఎన్నికల నగారా మోగింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికలు అన్ని పార్టీలతో పాటు విపక్షాలకు, ప్రాంతీయ పార్టీలకు పరీక్షగా మారాయి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఏపీలో చంద్రబాబు నాయుడు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. వీరంతా ఏకతాటిపైకి వచ్చి పీఎం మోడీని గద్దె దించాలని పోరాటం చేస్తున్నారు. నిన్నటి దాకా బీజేపీతో చెలిమి చేసిన టీడీపీ ఉన్నట్టుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టింది. మరో వైపు ఏపీలో జగన్ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. పాదయాత్రలో హోరెత్తిస్తున్నారు. అందరి కంటే ముందుగా టీడీపీ ప్రణాళికాబద్దంగా ప్రచారం చేస్తోంది. ప్లానింగ్‌లో పర్‌ఫెక్ట్‌గా ఉంటారని పేరొందిన చంద్రబాబు అన్నీ తానే అయి ముందుండి నడిపిస్తున్నారు. ఎలాగైనా సరే బెంచ్ మార్క్ సాధించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఆ దిశగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజాప్రతినిధులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే మరింత సుస్థిరమైన పాలనను అందిస్తానని పేర్కొంటున్నారు. విశాఖలో జరిగిన సభలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరు చంద్రబాబుకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. లెక్కలేనన్ని కేసులున్న జగన్ కు మద్ధతు ఇవ్వకండని మమత కోరారు. ఢిల్లీ స్థాయిలో మోడీని ఎదుర్కొనే దమ్ము బాబుకు ఉందన్నారు. దేశంలో ఇపుడు ప్రాంతీయ పార్టీల గాలి వీస్తోందని..కమలం వాడిపోనుందని..ఇక మోడీకి ఇంటికి వెళ్లాల్సిందేనని దీదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరో వైపు బీజేపీకి పూర్వ వైభవం తీసుకు రావాలని మోడీ ద్వయం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాలని అమిత్ షా, రాం మాధవ్, మురళీధర్‌రావులు ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణాదిలో మొదటి ఎన్నికల ప్రచార సభను తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో నిర్వహించారు. భారీ ఎత్తున జనం హాజరయ్యారు. మోడీ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తాను నిధులు ఇస్తానంటే కేసీఆర్ అడ్డుపడ్డాడని ఆరోపించారు. జ్యోతిష్కుల మీద ఆధారపడి పాలన కొనసాగిస్తున్నారని..మాయ మాటలు నమ్మవద్దంటూ విమర్శించారు. సుస్థిరమైన పాలనను అందించే సత్తా ఒక్క బిజేపీకే ఉందన్నారు.
మరోసారి అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలులో జరిగిన సభలో పాల్గొన్నారు. అక్కడ బాబును టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ, ఏపీ, కర్ణాటకలలో పర్యటించారు. రఫెల్ కుంభకోణం ప్రధానంగా ప్రస్తావించారు. దేశంలో ప్రతి ఒక్కరు గౌరవ ప్రదంగా జీవించేందుకు సాయం చేస్తామని ప్రకటించారు. మోడీకి మూడిందని ఇక పవర్‌లోకి రావడమే మిగిలిందని ఎద్దేవా చేశారు. గులాబీ దళపతి కేసీఆర్..తెలంగాణలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. వనపర్తి, మహబూబ్‌నగర్లో జరిగిన సమావేశాలలో ఆయన ప్రసంగించారు. ఎక్కువగా మోడీపై గురి పెట్టారు. తాను ఎక్కడ అడ్డుకున్నానో చెప్పాలని సవాల్ విసిరారు. దేశమంతా తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వైపు చూస్తోందని ..రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని..ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయని నొక్కి వక్కాణించారు. 16 సీట్లు గెలిపిస్తే తానేమిటో చూపిస్తానని చెప్పారు. అవసరమైతే జాతీయ స్థాయిలో కొత్త పార్టీని స్థాపిస్తానని , రైతులు , మహిళలు, యువత డొల్ల మాటలకు ప్రభావితం కావద్దని కోరారు.
58 శాతం ఓట్లు పోల్ కాబోతున్నాయని తాను చేపట్టిన సర్వేలో తేలిందని..శ్రీనివాస్ రెడ్డి గెలుపు ఖాయమై పోయిందని..కేవలం మెజారిటీ కోసమే వేచి చూస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఇంకో వైపు జగన్ తాను సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను వచ్చాక 2 లక్షలకు పైగా జాబ్‌లు భర్తీ చేస్తానని హామీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. పాదయాత్రలే తప్పా ప్రజల సమస్యలు పట్టించుకోని వైసీపీకి తనను విమర్శించే హక్కు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈసారి ఎన్నికలు మరింత హీట్ పెంచాయి. జనాన్ని ఒక చోట ఉండనీయకుండా చేస్తున్నాయి. ఎవరు కొలువు తీరుతారో..ఇంకెవ్వరు ఢిల్లీ పీఠాన్ని అధీష్టిస్తారో వేచి చూడాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి