అగ్ని శిఖరం అంచున ..అక్షర యోధుడు ..!
సుసంపన్నమైన ..తరతరాలకు సరిపడా వన్నె తగ్గని చరిత్ర కలిగిన ప్రాంతం తెలంగాణ. ఈ మట్టికి ఎనలేని మానవత్వం వున్నది. మనుషుల్ని ..జీవాలను ఒకే రీతిన చూడగలిగే సంస్కృతి ఈ ఒక్క ప్రాంతానికి మాత్రమే వున్నది. పోరాటాలకు..త్యాగాలకు..బలిదానాలకు..ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ స్థలం. ఆయుధాలు లేక పోయినా సరే ఆత్మవిశ్వాసానికి కొదువ లేదు. ప్రపంచ చరిత్రలో సుదీర్ఘమైన పోరాటం చేసి..ప్రత్యేక రాష్టం కోసం తెలంగాణ జెండాను ఎగుర వేసిన ఘనమైన చరిత్రను సృష్టించింది ఈ స్థలమే. అపారమైన వనరులు..అద్భుతమైన అవకాశాలు కలిగిన ఒకే ఒక్క ప్రాంతమిదే. ఎక్కడికి వెళ్లినా ఈ మట్టిలో వున్నంత ప్రేమ ఇంకెక్కడా దొరకదు . అందుకే ఆ అక్షర యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు ..నా తెలంగాణ కోటి రతణాల వీణ అని సగౌరవ్వంగా లోకానికి చాటి చెప్పారు.
కవిగా, రచయితగా, గేయ రచయితగా తెలంగాణ ప్రాంతం నుండి తనదైన ముద్రను వేసుకుని అక్షరాలతో మంటలు పుట్టించిన మహాకవి దాశరథి. వరంగల్ జిల్లా చిన్నగూడురులో 1925 జూలై 22న జన్మించారు. నిజాం నవాబుల దాష్టిక పాలనపై ఎక్కుపెట్టిన ఆయుధం ఆయన. తెలంగాణ ఆర్తిని, ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచిన అక్షర యోధుడు. దాశరథిగా వినుతికెక్కారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ ప్రాంత విముక్తి కోసం ఉద్యమించిన ఆయన నిత్య ప్రాతః స్మరణీయుడు. తెలంగాణ ఉద్యమానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. లక్షలాది ప్రజల గుండెల్లో తన అక్షరాల వెలుగుల్ని ప్రసరించేలా చేసిన ఘనత ఆయనదే. ఆయన పుట్టిన ఊరు ఇపుడు కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాలో ఉన్నది. దాశరథి బాల్యమంతా ఖమ్మం జిల్లా మధిర గ్రామంలోనే గడిచింది.
ఉర్దూలో మెట్రిక్యూలేషన్, భోపాల్ విశ్వ విద్యాలయం నుండి ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఇంగ్లీషు సాహిత్యంలో డిగ్రీ పాసయ్యారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించారు. చిరు ప్రాయంలోనే పద్యాన్ని వంట పట్టించుకున్నారు. దానిపై పట్టు కలిగి వున్నారు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో ఆ పార్టీ వ్యవహారాలు, పద్ధతులు నచ్చక పోవడంతో బయటకు వచ్చారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబుల అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో కీలక భూమిక పోషించారు దాశరథి. ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్‌పెక్టర్‌గా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశారు. సాహిత్యాన్ని అవపోశన పట్టారు. అన్ని ప్రక్రియల్లోను సాధికారతను సాధించారు. కథలు, నాటికలు, కవితలు, పద్యాలతో పాటు తెలుగు సినిమా రంగంలో మరిచి పోలేని పాటలను రాశారు. ఆనాటి పాలకుల దమనకాండను నిలదీశారు. హింసను నిరసించాడు. జనంపై దాడులను చూసి చలించి పోయాడు.
పీడిత ప్రజల గొంతుకగా మారాడు. తన అక్షరాలనే తూటాలుగా మలిచాడు. రైతుదే తెలంగాణము రైతుదే..ముసలి నక్కకు రాచరికంబు దక్కునే ..అంటూ గర్జించాడు. దగాకోరు ..బటా చోరు రజాకారు పోషకుడవు..దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది..దిగిపోవోయ్..తెగిపోవోయ్ అంటూ నిజాంను హెచ్చరించాడు. ఆంధ్ర మహాసభల్లో చురుకైన పాత్ర పోషించాడు. దీంతో దాశరథిని నైజాం ప్రభుత్వం చెరసాలలో బంధించింది. అయినా బెదరలేదు ఈ కవి. జైలు శిక్ష అనుభవించాడు. అక్కడ కూడా కవిత్వంతో కరచాలనం చేశాడు. తన కలాన్ని జనం కోసం అంకితం చేశాడు. ఇందూరు కోటలో ఆయనతో పాటు మరో 150 మందిని బంధించారు. మరో కవి వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నారు. పళ్లు తోముకునేందుకు ఇచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసిన మహాకవి మన దాశరథి. శిక్షగా దెబ్బలు తిన్నాడు..రాసినందుకు బాధపడలేదు..ఎలుగెత్తి నా తెలంగాణ కోటి మాగాల వీణ అన్నాడు. అద్భుతమైన వక్తగా పేరు గడించారు. ఊరూరా తిరిగాడు. సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించాడు.
ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటులో కీలిక భూమిక పోషించాడు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించారు. అధ్యక్షుడిగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని రగిలించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆస్తాన కవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేరుతో అనువదించాడు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. మేల్కొనేలా చేస్తున్నాయి. ఎన్నో పుస్తకాలు రాశారు. అగ్నిధార, మహాంధ్రోదయం, రుద్రవీణ, మార్పు నా తీర్పు, ఆలోచనాలోచనాలు, ధ్వజమెత్తిన ప్రజ , కవితా పుష్పకం, తిమిరంతో సమరం తెలుగు జాతిని సుసంపన్నం చేశాయి. ఆయన రాసిన వాటిలో ఎన్నో గుర్తు పెట్టుకోవాల్సినవి ఉన్నాయి.
ఎవరు కాకతి..ఎవరు రుద్రమ..ఎవరు రాయలు..ఎవరు సింగన..అంతా నేనే..అన్నీ నేనే..అలుగు నేనే..పులుగు నేనే..వెలుగు నేనే..తెలుగు నేనే అని రాసి ప్రశ్నించారు. లక్షలాది మందికి ఆనాటి నుండి నేటి దాకా స్ఫూర్తి కలిగిస్తున్న గేయం ఆ చల్లని సముద్ర గర్భం ..అద్భుతం..మహా అద్భుతం అనదగినదిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ వేలాది వేదికల మీద ఆ పాటను పాడుతూనే ఉన్నారు. దాశరథికి ఈ రూపకంగా నివాళి అర్పిస్తున్నారు. నిరాశలో ఉన్న వారికి..నిప్పులు చెరిగేలా..భావగర్భితంగా రాసిన ఈ గేయం ఎప్పటికీ నిలిచే వుంటుంది..నిజాము రాజుపై రాసిన..ఓ నిజాము పిశాచమా..కానరాడు ..నిన్ను బోలిన రాజు మాకెన్నడేని..తీగలను తెంపి అగ్నిలో దింపినావు..అంటూ ధిక్కార స్వరాన్ని వినిపించారు. 1961లో సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఇద్దరు మిత్రులు సినిమాకు పాటలు రాశారు. తెలుగు సాహిత్యంలోని మధురమైన భావాలను పాటలుగా మలిచారు దాశరథి. పది కాలాలు పాడుకునేలా రాసి మెప్పించారు.
ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకీ మాటలు రువ్వుతూ..వాగ్ధానంలో నా కంటి పాపలో నిలిచి పోరా..నీ వెంట లోకాల గెలవనీరా..అమరశిల్పి జక్కనలో అందాల బొమ్మతో ఆటడవా,పసందైన ఈ రేయి నీదోయి స్వామి, డాక్టర్ చక్రవర్తిలో ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేరా..దాగుడు మూతలులో గోరంక గూటికే చేరావు చిలకా, మూగ మనుషులులో గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది..నాది ఆడజన్మేలో కన్నయ్యా నల్లని కన్నయ్యా, ఆత్మ గౌరవంలో ఒక పూల బాణం తగిలింది, నవరాత్రిలో నిషా లేని నాడు హుషారేమి అంటూ రాశారు. వసంతసేనలో కిలకిల నగవుల నవ మోహిని, పూల రంగడు సినిమాలో నీవు రావు నిదుర రాదు ..నిలిచి పోయె ఈ రేయి, నిండుమనుషులులో నీవెవరో నేనెవరో నాలో నిజమెవరో, కంచుకోటలో ఈ పుట్టినరోజు, నీ నోములు పండిన రోజు, దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్నీ, పట్టుకుంటే పదివేలులో తల్లివి తండ్రివి నీవే మమ్ము లాలించి పాలించ రావా దేవా అని రాసి మెప్పించారు. రంగులరాట్నం సినిమాలో కనరాని దేవుడే కనిపించినాడే, నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో, బంగారు గాజులులో విన్నవించుకోనా చిన్న కోరికా..ఇన్నాళ్లు నా మదిలో వున్న కోరిక పాట హైలెట్‌గా నిలిచింది.
రాము సినిమాలో రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను కాపాడ , బందిపోటు దొంగలులో విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో, ఆత్మీయులులో మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగె ..కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడె, బుద్ధిమంతుడులో నను పాలింపగ నడచీ వచ్చితివా, మొర లాలింపగ తరలీ వచ్చితివా , భలేరంగడులో నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే, మాతృదేవతలో మనసే కోవెలగా మమతలు మల్లెలుగా, మూగనోములో ఈవేళ నాలో ఎందుకు ఆశలు, నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే, ఇద్దరు అమ్మాయిలులో పువ్వులో గువ్వలో వాగులో తీవెలో అంతటా నీవేనమ్మా, చిట్టిచెల్లెలులో మంగళగౌరి మముగన్న తల్లి, అమాయకురాలులో పాడెద నీ నామమే గోపాలా, మనసు మాంగల్యం సినిమాలో ఆవేశం రావాలి ఆవేదన కావాలి అంటూ రాశారు. ఇలా జనరంజకమైన పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి. కవిగా, గేయ రచయితగా , సాహితీ పిపాసకుడిగా..ఉద్యమకారుడిగా..పేరు పొందిన ఈ అక్షర యోధుడు ఇక సెలవంటూ ..తను ప్రేమించిన ఈ మట్టిలో నవంబరు 5న 1987లో కలిసి పోయారు. ఆద్యంతమూ నిత్య చైతన్యవంతమైన ఆ కలం ఆగి పోయింది. కానీ ఆ అక్షరాలు ఇప్పటికీ వెలుగులు ప్రసరింప చేస్తూనే వున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి