ఆ రూపం అపురూపం .. ఆమె జ్ఞాపకం అజరామరం - మదిలో మధుబాల..!
భారతీయ సినీ జగత్తులో చెరిగిపోని జ్ఞాపకం ఆమె.. అందం..అభినయం..వినయం..కలగలిస్తే మధుబాల. ఇవాళ ప్రేమికుల రోజు..అలాగే వెండితెర వెన్నెల..మధుబాల పుట్టిన రోజు. ఎన్నేళ్లయింది చూసి..మొఘెల్ ఏ ఆజం సినిమా ఎప్పటికీ క్లాసిక్కే. ఆ చూపు..ఆ కళ్లు..ఆ రూపం..ఇంకెవ్వరికీ రాదు..దేవుడు సృష్టించిన అద్భుతాల్లో మధుబాల ఒకరు. ఆమె అసలు పేరు ముంతాజ్ జెహాన్ బేగం దెహల్వి. 14 ఫిబ్రవరి 1933లో ఢిల్లీలో జన్మించిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. తన అందంతో మెస్మరైజ్ చేశారు. నటిగా దిగంతాలను వెలిగించారు. ఈ ప్రయాణంలో మలుపులు ఎన్నో..జ్ఞాపకాలు మరెన్నో. తలుచుకుంటే చాలు ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎనలేని కీర్తిని మూటగట్టుకున్నారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1950 నుండి 1960 మధ్య కాలంలో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తన సమకాలికులైన నటీమణులు నర్గీస్, మీనాకుమారిలతో ..సమానంగా గౌరవం పొందారు. సాంప్రదాయ ముస్లిం దంపతుల 11 మంది సంతానంలో మధుబాల ఐదవ వ్యక్తి. తండ్రి అతావుల్లా ఖాన్ పెషావర్‌లోని ఇంపీరియల్ టొబాకో కంపెనీలో తన ఉద్యోగాన్ని కోల్పోవడంతో ..తన కుటుంబాన్ని ముంబయికి మార్చారు. మధుబాల తొమ్మిది ఏళ్లప్పుడు చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. 1942లో బసంత్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైంది. దీంతో మధుబాల పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. బాల నటిగా అనేక చిత్రాలలో నటించి మెప్పించారు. ఆమె నటనకు దేవికారాణి ముగ్ధురాలైంది. ముంతాజ్ పేరు తీసేసి మధుబాలగా మార్చుకోమని సలహా ఇచ్చారామె. ఆ పేరు చిరస్థాయిగా నిలిచి పోయింది. నీల్ కమల్‌లో పూర్తి స్థాయి నటిగా 14 ఏళ్ల వయసులో నటించింది. ఈ చిత్రం సరిగా ఆడ లేదు..అయినా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత రెండేళ్లలో అద్భుతమైన సౌందర్య రాశిగా..అద్భుతమైన నటిగా వినుతి కెక్కారు. బాంబే టాకీస్ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. సహ నటుడు అశోక్ కుమార్‌ను అమితంగా ఆకట్టుంది ఆమె నటన. 1950లో తీవ్రమైన జబ్బుకు గురయ్యారు. హాలివుడ్ దృష్టిని కూడా ఆకర్షించారు. అమెరికాలోని పత్రికల్లో మధుబాల పేరుతో పతాక శీర్షికల్లో వార్తలు ప్రచురితం అయ్యాయి. ది బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద వరల్డ్ పేరుతో రాసిన కథనం సంచలనం సృష్టించింది. ఆమెకున్న పాపులారిటిని తెలియ చెప్పింది. కాల్పానిక సౌందర్యం ఆమె స్వంతం. యుఎస్ నిర్మాత ఫ్రాంక్ కాప్రా ఆమెతో నటింప చేయాలని ప్రయత్నించి విఫలం చెందారు. మధుబాల తండ్రి ఒప్పుకోలేదు. నటిగా తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకున్నారామె. పరిశ్రమలో ఉన్నత స్థానాన్ని అధిరోహించారు. అశోక్ కుమార్, రాజ్ కపూర్, రెహ్మాన్, ప్రదీప్ కుమార్, షమ్మీ కపూర్, దిలీప్ కుమార్, సునీల్ దత్, దేవానంద్ లాంటి ఉద్ధండులు ఆమె సహ నటులే. వారితో కలిసి నటించారు మధుబాల. మెహబూబ్ ఖాన్, గురుదత్, కమల్ అమ్రోహి, కె. ఆసిఫ్ దర్శకుల వద్ద ఎక్కువగా నటించారు. నాతా అనే చిత్రాన్ని స్వంతంగా నిర్మించారు. వైవిధ్యమైన నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. బాదల్ చిత్రంలో మూస ధోరణిలో ఉత్తమ స్త్రీ పాత్ర ధరించారు. తరానాలో ఎదురులేని అందమైన పల్లెటూరి పడుచుగా మెప్పించారు. ఆదర్శ భారత మహిళగా సంగ్ దిల్ మూవీలో ఒదిగి పోయారు. మార్గం తప్పిన వారసురాలిగా గురుదత్ సినిమాలో నటించారు. కల్ హమారా హై లో ద్వంద్వ పాత్రలో కనిపించారు. హౌరా బ్రిడ్జ్ సినిమాలో నటించి మెప్పించింది. 1960లో వచ్చిన ముఘల్ - ఏ - ఆజం సినిమాతో అజరామరమైన కీర్తిని పొందింది. అసమాన్యమైన నటనను ప్రదర్శించింది. మధుబాల..సహ నటుడు దిలీప్ కుమార్‌తో దీర్ఘకాలిక సంబంధం కలిగి ఉన్నారు. తెర మీద ప్రేమ జంటగా నటించి ఆకట్టుకున్నారు. వీరిద్దరు కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. 1951 నుండి 1956 దాకా వీరి ప్రేమ ప్రయాణం సాగింది.
మధుబాల తనను తాను తక్కువగా వ్యక్తపరచుకోవడానికి ప్రసిద్ధిచెందారు, ఎప్పుడూ బహిరంగంగా కనిపించేవారు కాదు (1954లో బహుత్ దిన్ హుయే చిత్రం యొక్క మొదటి ప్రదర్శన దీనికి ఒక మినహాయింపు) చాలా అరుదుగా ముఖాముఖిలను ఇచ్చేవారు. బి ఆర్ చోప్రా ఆమెపై కేసు వేశారు. ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా ధైర్యం కోల్పోలేదు. తిరిగి తనను తాను ప్రూవ్ చేసుకుంది. చల్తీ కా నామ్ గాడీ, ఝుమ్రూ సినిమాల చిత్రీకరణ సమయంలో నేపథ్య గాయకుడు, నటుడు కిషోర్ కుమార్‌తో కలిసి నటించింది. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆయనకు అప్పటికే రుమా గుహాతో పెళ్లయింది. వీరిద్దరు విడాకులు తీసుకున్నాక ..1960లో వివాహం చేసుకున్నారు. కిషోర్ కుమార్ కుటుంబంలో కలతల కారణంగా నెల రోజుల్లోనే తన స్వంత ఇల్లు బాంద్రా భవంతికి చేరుకుంది మధుబాల. ఆమె శేష జీవితమంతా తీవ్ర ఒత్తిడితోనే ముగిసింది.
కె. ఆసిఫ్ దర్శకత్వంలో వేశ్య పాత్ర అనార్కలిగా ఆమె నటించారు. సినిమా చిత్రీకరణలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు అనారోగ్యం కారణంగా. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 1975 షోలే రిలీజ్ అయ్యేంత వరకు అలాగే ఉండి పోయింది. పృథ్విరాజ్ కపూర్, దుర్గా ఖోటే, దిలీప్ లాంటి నటులున్నా.. మధుబాల నటనకు ఎక్కువ మార్కులు పడ్డాయి. ఫిలిం ఫేర్ పురస్కారానికి ఆమెను ప్రతిపాదించారు. బర్సాత్ కీ రాత్ సినిమాలో నటన ఎందరినో ఆకట్టుకుంది. అనారోగ్యం ఇబ్బంది పెట్టడంతో ఎక్కువ సినిమాలు చేయలేక పోయారు. పరిస్థితి దిగజారడంలో చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడ ఏడాదికంటే బతకవని డాక్టర్లు సెలవిచ్చారు. కానీ ఆమె తొమ్మిదేళ్లు బతికింది. బతికింది కొద్ది కాలమే అయినా 70 సినిమాలలో నటించిన ఆ సౌందర్య రాశి..1969 ఫిబ్రవరి 23న ఈ లోకం నుండి నిష్క్రమించింది. కోట్లాది అభిమానులను గాయం చేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి