ఆస్ట్రేలియానే అసలైన విజేత
అందరూ అనుకున్నట్టుగానే మన మహిళా క్రికెట్ జట్టు చేతులెత్తేసింది. ఫైనల్ పోరులో చతికిలపడింది. ప్రత్యర్థి జట్టు పక్కా ప్లాన్ తో ఆడితే..మన వాళ్లు అలా వచ్చి ఇలా పెవిలియన్ దారి పట్టారు. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని వదులుకున్నారు. దీంతో మరోసారి ఆస్ట్రేలియా మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. వరుసగా అయిదోసారి టీ20 ప్రపంచ కప్ ను ముద్దాడింది. ఇండియా జట్టును చిత్తుగా ఓడించింది. చాంపియన్ ఆట తీరుతో ఆస్ట్రేలియా మరోసారి మెరిసింది.. ప్రపంచకప్-2020 విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్ బెత్ మూనీ హాఫ్ సెంచరీతో రాణించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. ప్రధాన బ్యాటర్లు షషాలీ, మంధాన, రోడ్రిగ్స్ , హర్మన్ లు ఎలాంటి పర్ ఫార్మెన్స్ కనబర్చలేక పోయారు. ఒక దశలో 50 పరుగులు కూడా చేస్తారో లేదోనన్న అనుమానం అభిమానుల్లో తలెత్తింది. చివర్లో దీప్తి శర్మ ఒక్కరే 33 పరుగులు చేసి ఇండియా పరువు పోకుండా కాపాడింది. ఆమె రాణించడంతో టీమిండియా కనీసం గౌరవ ప్రదమైన స్కోర్‌నైనా సాధించింది. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షూట్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. జోనాసన్ మూడు వికెట్లు పడగొట్టింది.
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా ఏ కోశాన పోరాటం సాగించలేక పోయింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో హర్మన్ సేన ఒత్తిడిని కొన్ని తెచ్చుకున్నట్టయింది. దీంతో కనీస ప్రదర్శనను కూడా బ్యాటర్లు ఇవ్వలేక పోయారు. షఫాలీ వర్మ నుంచి ఆరంభమైన వికెట్ల పతనం ఓటమి వరకు సాగుతూ వెళ్లింది. ఆసీస్ బ్యాటర్స్ రెచ్చిపోయిన చోట.. మనోళ్లు తేలి పోయారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా కడవరకు క్రీజులో నిలువలేకపోయారు. అనుభవమున్న హర్మన్, మంధాన, వేద కృష్ణమూర్తిలు సైతం ప్రత్యర్థికి దాసోహమయ్యారు. వీరిలో ఏ ఒక్కరు క్రీజులో ఉన్నా యువ ప్లేయర్స్ ధైర్యంగా ఆడేవారు. మొత్తం మీద ఆస్ట్రేలియా నిజంగా ఛాంపియన్ లా ఆడింది. అసలైన విజేతలమని నిరూపించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి