సినీ కార్మికుల కోసం భారీ సాయం

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు తెలుగు సినిమా రంగం తీవ్ర ఒడిదుడుల‌కు లోనైంది. ఎక్కువ మంది కార్మికులు ఈ ప‌రిశ్ర‌మ‌నే న‌మ్మ‌కున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని కార్మికులు వేలాది మంది ఉన్నారు. తెర‌పై కొంద‌రు మాత్ర‌మే హీరోలుగా చెలామ‌ణి అవుతుండ‌గా మిగ‌తా కార్మికులంతా తెర వెన‌కే ఉండి పోతున్నారు. వీరి సంక్షేమం కోసం గ‌తంలో దివంగ‌త న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ రెడ్డి ఎంత‌గానో కృషి చేశారు. ప్ర‌స్తుతం మా మూవీస్ అసోసియేష‌న్ ప‌ని చేస్తోంది. దీనికి ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి గౌర‌వ అధ్య‌క్షుడిగా ఉన్నారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా న‌టుడు న‌రేష్ కొన‌సాగుతున్నారు. తాజాగా క‌రోనా ఎఫెక్ట్ భారీగా ఉండ‌డంతో ఉన్న ప‌ళంగా సినిమా షూటింగ్స్ ల‌ను బంద్ చేశారు. దీంతో కార్మికులు రోడ్డున ప‌డ్డారు. ఏడాది పొడ‌వునా ఏదో ఒక సినిమా న‌డుస్తూ ఉండ‌డంతో దీనినే న‌మ్ముకుని బ‌తుకులీడుస్తున్న వారంతా దిక్కు తోచ‌ని స్థితిలోకి నెట్ట‌బ‌డ్డారు.
క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి నుంచి దేశాన్ని కాపాడాలంటూ భార‌త‌దేశ ప్ర‌ధాన‌మంత్రి మోదీజీ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ ఆప‌త్కాల స‌మ‌యంలో కోట్లాది మందికి వైద్య ప‌రీక్ష‌లు చేయ‌డం, మందులు స‌ర‌ఫ‌రా, ప్రాథ‌మిక వ‌స‌తి సౌక‌ర్యాల క‌ల్ప‌న అన్న‌ది కోట్లాది రూపాయ‌ల ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. ఇందు కోసం ప్ర‌త్యేకంగా పీఎం రిలీఫ్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. ప‌లువురు వ్యాపార వేత్త‌లు, కంపెనీలు, సినీ న‌టులు, ఐటీ దిగ్గ‌జాలు, వివిధ వ్యాపార‌, వాణిజ్య వ‌ర్గాల‌కు చెందిన వారంతా త‌మ‌కు చేత‌నైనంత విరాళాల రూపేణా సాయం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. భారీ ఎత్తున విరాళాలు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. టాటా సంస్థ‌ల ఛైర్మ‌న్ త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. ఏకంగా 500 కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. న‌టులు అమీర్ ఖాన్ 125 కోట్లు, అక్ష‌య్ కుమార్ 25 కోట్లు ప్ర‌క‌టించ‌గా క్రీడాకారులు ధోనీ, గంగూలీ, విరాట్ కోహ్లి, యువ‌రాజ్ సింగ్, పీవీ సింధు, త‌దిత‌రులు త‌మ సాయాన్ని వెల్ల‌డించారు.
ఇక తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలలో క‌రోనా వైర‌స్ వ్యాధి నివార‌ణ కోసం ఆయా ముఖ్య‌మంత్రుల రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. చిరంజీవి, నాగార్జున‌, రామ్ చ‌ర‌ణ్, ప్ర‌భాస్, వెంక‌టేశ్, రాణా, మ‌హేష్ బాబు, న‌రేష్, నితిన్, త‌దిత‌రులు విరాళాలు ప్ర‌క‌టించారు. ఇంకో వైపు సినీ ద‌ర్శ‌కులు త్రివిక్రం శ్రీ‌నివాస్, ఎన్‌.శంక‌ర్, కొర‌టాల శివ‌, బోయ‌పాటి శ్రీ‌ను, స‌తీష్ వేగ్నెష‌, నిర్మాత దిల్ రాజులు విరాళంగా ఇస్తున్న‌ట్లు తెలిపారు. సినీ రంగానికి చెందిన కార్మికుల కోసం ప్ర‌త్యేకంగా వారిని ఆదుకునేందుకు ఓ క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు న‌టుడు చిరంజీవి వెల్ల‌డించారు. దీనికి తాను అధ్యక్షుడిగా ఉంటాన‌ని ద‌ర్శ‌కులు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, ఎన్. శంక‌ర్ , త‌దిత‌రులు స‌భ్యులుగా ఉంటార‌ని చెప్పారు. వీరు కార్మికుల సంక్షేమం కోసం ప్ర‌క‌టించే విరాళాల‌ను ఖ‌ర్చు చేస్తార‌ని తెలిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!