సమున్నత భారతావనికి సలాం
ప్రపంచం కరోనా వైరస్ దెబ్బకు విలవిలలాడుతోంది. అందుకు ఇండియా మినహాయింపు ఏమీ కాదు. కాబోదు కూడా. ఎందుకంటే అదే లోకంలో మనం కూడా భాగస్తులమే. కాదనలేం. ప్రస్తుత సందర్భం ఏమిటంటే నిన్నటి దాకా ఈ దేశంలో ఉండి..ఇక్కడి గాలి పీల్చి..ఇక్కడి వనరులను వాడుకుని..ఉద్యోగం పేరుతో..సంపాదించే నెపంతో ఇతర దేశాలకు వెళ్లిన వాళ్లు ఇపుడు తలదించు కోవాల్సిన దుస్థితి. కాలం మారదు..అది కొన్ని తరాలుగా, దశాబ్ధాలుగా తన దారిన వెళుతూనే ఉన్నది. అందులో భాగమే ఈ సంచారం..ప్రకృతి ప్రకోపం. జీవన విధ్వంసం జరుగుతూనే ఉన్నది. కోట్లాది మంది ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. టెక్నాలజీ పేరుతో సరిహద్దులు దాటి అదే ప్రపంచం అనుకుని విర్రవీగుతూ..తమ కంటే గొప్ప వాళ్లు ఎవరూ లేరని భ్రమల్లో బతుకుతున్న ప్రవాస భారతీయులు ఇపుడు పునరాలోచనలో పడ్డారు.
ఈ ప్రపంచాన్ని తన కనుసన్నలలో ఉంచుకుని శాసిస్తూ వచ్చిన అగ్రరాజ్యం అమెరికా ఇపుడు కరోనా వైరస్ అనే కంటికి కనిపించని దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తల్లడిల్లుతోంది. ఒక రకంగా తాను చెప్పిందే వేదం..తాను గీసిందే శాసనం అంటూ బీరాలు పలికిన ఈ దేశం సాయం కోసం, నష్ట నివారణ కోసం బేల చూపులు చూస్తోంది. వ్యాపారం, వాణిజ్యం, ఆదాయం ఇవే జపిస్తూ మానవ విలువలను మంట గలుపుతూ, సంస్కృతి సాంప్రదాయాలను వెనక్కి నెట్టి వేస్తూ బతుకుల్ని ఫక్తు అమ్మకపు సరుకుగా మార్చేసిన ఈ కేపిటలిస్ట్ కంట్రీ దిక్కు తోచని స్థితిలోకి పడిపోయింది. లక్షలాది మంది ఇండియన్స్ వృత్తి పరమైన వ్యవస్థలలో నిమగ్నమై పున్నారు. ఎన్నో పేరొందిన కంపెనీలకు పెద్ద దిక్కుగా ఉన్నారు. అయినా వీరి వల్ల భారత దేశానికి ఒరిగింది ఏమీ లేదు. ఎంత సేపూ ఉదయం నుంచి రాత్రి పడుకునేంత దాకా అమెరికా జపమే. గతంలో సుప్రభాతం వినిపించేది..ఇపుడు డాలర్ల మామాజాలం కనిపిస్తోంది..వినిపిస్తోంది. ఇదే సమయంలో మనం గుర్తుంచు కోవాల్సింది ఒక్కటి ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం చోటు చేసుకున్నప్పుడల్లా అమెరికాతో పాటు అన్ని దేశాలు అల్లాడి పోయాయి. లక్షలాది కంపెనీలు లాకౌట్లు ప్రకటించాయి. వేలాది మందికి పింక్ స్లిప్పులు ఇచ్చాయి. అయినా సమున్నత భారత దేశం మాత్రం చెక్కు చెదరలేదు. ఎందుకంటే ఇక్కడి ఆర్థిక వ్యవస్థ మానవీయతను మరిచి పోలేదు కనుక అలాగే ఉన్నది. ప్రజలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కష్టపడి పోస్టాఫీసుల్లో, ప్రభుత్వ రంగ బ్యాంకులు, కంపెనీల్లో దాచుకున్న డబ్బులే ఈ దేశం విఛ్చిన్నం కాకుండా కాపాడాయి. కరోనా లాంటి ఎన్ని వ్యాధులు వచ్చినా సరే ఈ దేశ ప్రజల్లో సడలని నమ్మకమే జాతిని, దేశాన్ని నడిపిస్తోంది. చిన్న పాటి సమస్యకే అల్లాడి పోయే అమెరికా కంటే ఇండియా బెటర్ అని తెలుసుకుని జనం తమ దారేదో తాము వెతుక్కుంటున్నారు. వారి మానాన వారు బతుకుతున్నారు. డాలర్ల మాయలో పడి ఇండియాను మరిచి పోయిన ప్రవాస భారతీయులకు కరోనా వైరస్ ఓ చెంప పెట్టు లాంటిది. ఇకనైనా మారాలి. తాము సంపాదించిన దాంట్లోంచి కనీసం 60 శాతమైనా ఈ దేశ అభివృద్ధికి తమ తోడ్పాటు అందించాలి. లేక పోతే చరిత్ర హీనులుగా మిగిలి పోతారు. ఇంత జరిగినా చెక్కు చెదరకుండా ఉన్న సమున్నత భారతావనికి సలాం చేయక తప్పదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి