దేశానికి కేంద్రం భ‌రోసా


అత్యంత క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న భార‌త దేశానికి కాయ‌క‌ల్ప చికిత్స చేసేందుకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ న‌డుం బిగించింది. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌డంతో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. వేలాది మంది ఇప్ప‌టికే దీని బారిన ప‌డ్డారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా దేశ‌మంత‌టా ష‌ట్ డౌన్ ప్ర‌క‌టించారు భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీజి. వైద్యులు, పోలీసులు, స్వ‌చ్చంధ నిర్వాహ‌కులు సైతం ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చారు. అటు సెల‌బ్రెటీలు, క్రీడాకారులు, వ్యాపారవేత్త‌లు, కంపెనీలు పెద్ద ఎత్తున విరాళాలు ప్ర‌క‌టించాయి. ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రం ఆయా రాష్ట్రాల అధినేత‌ల‌తో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేసింది. క‌రోనాను అదుపులోకి తీసుకు వ‌చ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందు కోసం ఏకంగా ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రంగంలోకి దిగారు.
   వివిధ రంగాల‌కు సానుకూలంగా ఉండేలా చూశారు. వేత‌న జీవుల‌కు కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించారు. ఉపాధి హామీ కింద ప‌నిచేస్తున్న కూలీల‌కు ధ‌ర‌లు పెంచారు. నిత్యావ‌స‌ర స‌రుకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేద‌ల‌కు అందేలా చూశారు. ప్ర‌జ‌ల‌కు నిత్యం అవ‌స‌ర‌మైన స‌రుకులు వారి ఇంటి వ‌ద్ద‌కు చేర‌వేసేలా ఆదేశాలు జారీ చేశారు. క‌రోనా ప్ర‌భావం పెర‌గ‌డం, ఆర్థిక రంగాన్ని అత‌లాకుత‌లం చేయ‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం దిగిరాక త‌ప్ప‌లేదు. అభివృద్ధిలో టాప్ రేంజ్ లో కొన‌సాగుతున్న అమెరికా లాంటి దిగ్గ‌జ దేశం ఇవాళ క‌రోనా దెబ్బ‌కు నేల చూపులు చూస్తోంది. ఇప్ప‌టికే అన్న రంగాలు న‌ష్టాల‌కు లోన‌వుతున్నాయి. ప‌రిస్థితి క‌నుక ఇలాగే కొన‌సాగుతూ పోతే ఇండియ‌న్ ఎకాన‌మీ సెక్టార్ పూర్తిగా పీక‌ల లోతుకు కూరుకు పోయే ప్ర‌మాదం పొంచి ఉన్న‌ది.
   విత్త మంత్రి ప్ర‌క‌ట‌న ఉన్న వాళ్ల‌కు ఊర‌ట క‌లిగించేదిగా ఉందే త‌ప్పా సామాన్యుల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌డం లేద‌న్న‌ది సామాజిక‌వేత్త‌ల ఆవేద‌న‌. ఎప్పుడైతే మోదీ నోట్ల ర‌ద్దును ప్ర‌క‌టించారో ఆ రోజు నుంచి నేటి దాకా భార‌త ఆర్థిక రంగం కుద‌ట ప‌డ‌డం లేదు. దీనిని ఎంత‌గా దారిలోకి తీసుకు వ‌ద్దామ‌ని శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ మోడీకి షాక్ ఇచ్చేలా సాగుతోంది. ఇదే స‌మ‌యంలో కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా నిర్మ‌లా సీతారామ‌న్ కొన్ని నిర్ణ‌యాలు ప్ర‌క‌టించారు. బ్యాంకుల‌లో రుణ గ్ర‌హీత‌ల‌కు తీపిక‌బురు అందించారు. మూడు నెల‌ల పాటు ఈఎంఐలు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌వ‌ర్న‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రెపో రేటు త‌గ్గిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. దీని వ‌ల్ల భార‌త దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదుట ప‌డుతుంద‌ని, ఒడిదుడుకుల‌కు లోను కాద‌ని ధీమా వ్య‌క్తం చేశారు ప్ర‌ధాని మోదీజి. 

కామెంట్‌లు