నేనెరిగిన చిన జీయర్ స్వామీజి
ఆయనకు పరిచయం అక్కర్లేదు. అంతకంటే ఆయన గురించిన చరిత్ర చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన జగమెరిగిన జగత్ గురు. కొందరు పుట్టుకతోనే పాపులర్ అవుతారు. ఇంకొందరు కష్టాలు గట్టెక్కకుండానే జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ స్వాములు, గురువులు, మార్గనిర్దేశకులు వీళ్లందరు ఎందరో ఈ మట్టిలో పుట్టారు. వారు తమ తమ మార్గాల్లో తమకు తోచిన రీతిలో కాలం గడుపుతూ జనాన్ని జాగృతం చేసే పనిలో పడ్డారు. ఎవరి పరిమితులు వారికున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో స్వభావం. ఒక్కో లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. దీనిని కాదనలేం. కానీ గత కొంత కాలం నుంచి దక్షిణాదిలో ఒకే ఒక్క పేరు నిరంతరం తచ్చట్లాడుతూనే ఉన్నది. ప్రజల్లో నానుతూ ఉన్నది . అదే చిన్న జీయర్ స్వామి. ఎందుకంటే అత్యంత బలమైన ప్రాంతాలుగా పేరొందిన ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అధిపతులు, పాలకులు ఒకరి వెంట మరొకరు స్వామి దర్శనం కోసం క్యూ కట్టారు.
వీరిలో ప్రస్తుత సీఎం కేసీఆర్ ఏకంగా సాష్టాంగ పడ్డారు కూడా. ఆయనతో పాటు జగన్, యడ్యూరప్ప ఆశ్రమాన్ని సందర్శించారు. స్వామి దర్శనం చేసుకున్నారు. తీర్థం సేవించారు. అక్కడే ఓ పూట ఉన్నారు. స్వామి వారి ఆతిథ్యంతో తరించి పోయానన్నారు. రాజకీయ పరంగా ఇదో సెన్షేషన్. దీనిని తేలిగ్గా తీసుకున్నారు చిన్న జీయర్ స్వామి వారు. తెలంగాణలో అత్యంత బలమైన సెక్టార్ ను ప్రభావితం చేస్తూ వ్యాపార, వాణిజ్య రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న మై హోం సంస్థ..ఇపుడు చిన్నజీయర్ కనుసన్నలలో నడుస్తోంది అంటే నమ్మగలమా. ఇది వాస్తవం కూడా. ఏది చేసినా..ఏం జరిగినా అది స్వామి వారికి తెలియకుండా ఉండదు. అంత నమ్మకం మై హోం బ్రదర్స్ రామేశ్వర్ రావు, జగపతి రావులకు.
ఇదే సమయంలో స్వామి వారి దర్శనం కోసం వేలాది మంది వేచి చూడటం, నిరీక్షించడం మామూలుగా జరుగుతూ వస్తున్నదే. ఇదంతా కొన్నేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. అన్ని వర్గాల వారున్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా ఆయనను కొలుస్తున్న వారున్నారు. సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. వారి నమ్మకం. దానిని కాదనే హక్కు ఎవరికీ లేదు. ఉండ కూడదు కూడా. ఎందుకంటే అది ఈ దేశంలో భారత రాజ్యంగం కల్పించింది కనుక. ఇదే సమయంలో వృత్తి పరంగా చిన్న జీయర్ గురించి పరిశోధించడం. ఆయన గురించి తెలుసు కోవడం, ఇందులో భాగంగా నేను ఆయన గురించి ప్రత్యేక కథనాన్ని రాయడం జరిగింది. ఇది ఒక మలుపు తిప్పిందనే చెప్పక తప్పదు. స్వామి వారి గురించి రాసిన ఈ కథనం ఎందరో భక్తుల మనసులను చూరగొన్నది. చివరకు స్వామి వారిని సైతం ఆలోచింప చేసేలా చేసింది. ఇది నాకు దక్కిన అదృష్టంగా నేను భావిస్తున్నాను.
ఆశ్రమంలో గురుతరమైన బాధ్యతను అప్పగించారు. తన ఆధ్వర్యంలో వస్తున్న భక్తి నివేదన పత్రికకు కొంత కాలం పాటు పనిచేసే భాగ్యం దక్కింది. అయితే సమాజ హితం కోసం పనిచేసే నిబద్ధత కలిగిన జర్నలిస్టులకు ఈ ఆశ్రమ కట్టుబాట్లు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. ఇది ఒక రకంగా సవాల్ లాంటిదే. చాలా క్లిష్టమైన తోవను నేను అందుకోవడంలో వైఫల్యం చెందాను. అందుకే అప్పుడప్పుడు..నాకు తోచినప్పుడు..నాలో నైరాశ్యం అలుముకున్నప్పుడు..నాలో దేదీప్యంగా యుద్ధం మొదలైనప్పుడు మాత్రమే..చిన్న జీయర్ స్వామి గురించిన ఆలోచన చేయడం జరుగుతోంది. వేలాది మంది భక్తులను కలిగిన ఉన్న ఆయనతో అనుబంధం కలిగి ఉండడం, ప్రశంసలు అందుకోవడం లైఫ్ లో సాధించిన అపురూపమైన విజయమే. అది కొందరికి ఎబ్బెట్టుగా అనిపించవచ్చు.
ఎన్నో సార్లు ఒంటరిగా కూర్చున్నప్పుడు సమాజం, ఆధ్యాత్మికం, ప్రపంచం గురించిన సంభాషణల్లో చోటు చేసుకుంది. అప్పుడే నాకు అవగతమైంది. చిన్న జీయర్ స్వామి వారిని ఎందుకు ఇంత మంది దేవుడిగా కొలుస్తున్నారో, ఆరాధిస్తున్నారో..నిరీక్షిస్తున్నారోనని. ఆయనలో విద్వత్ ఉన్నది. అంతకంటే ఎక్కువగా ఆధ్యాత్మిక జలధి తనలో నింపుకున్న యోగి. ఎన్నో భాషలు..మరెంతో పరిణతి సాధించిన స్వామీజీలలో చిన్నజీయర్ స్వామి వారు ప్రత్యేకమైన గురువుగా పేర్కొనక తప్పదు. ఆ చూపుల్లో, ఆ పలకరింపుల్లో, ఆ నడతల్లో ఏదో తెలియన శక్తి దాగి ఉన్నది. అదే జనాన్ని, భక్తులను సమ్మోహితులను చేస్తున్నది. మాయలు, మర్మాలు, కల్మషాలు, ఈర్స్యా విద్వేషాలు లేని ఆధ్యాత్మిక అలౌకికమైన ప్రపంచాన్ని శ్రీ స్వామి వారు నిర్మించారు..అంతకంటే తానే స్వయంగా ఏర్పాటు చేశారనడంలో సందేహం లేదు. కావాల్సిందల్లా సత్ సంకల్పం..స్వామి వారి పట్ల అనురక్తి కలిగి ఉండడం. అంతకంటే ఇంకేమీ అక్కర్లేదు..నిత్యం జ్వలించే ఆ స్వామి వారితో సాన్నిహిత్యం ఉండడం ఓ కల. అది నా పట్ల నిజమైంది. నా జన్మ ధన్యమైంది. ఈ జీవితానికి ఇక చాలదా.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి