ఆప్‌కే పట్టం.. సామాన్యుడిదే రాజ్యం
నరేంద్ర మోదీ మంత్రం ఫలించలేదు. ట్రబుల్ షూటర్ పాచికలు పారలేదు. కేవలం అభివృద్ధి మంత్రం మాత్రమే జపించిన ఒకే ఒక్కడు ..ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ పీఠంపై కూర్చోనున్నారు. ముచ్చటగా ఇది మూడోసారి. అనుకోని రీతిలో రాజకీయాల్లోకి ఎంటరైన ఈ పరిపాలకుడు మరోసారి తానేమిటో నిరూపించుకున్నాడు. ఇది నిజంగా విస్మరించలేని చరిత్ర అనే చెప్పుకోవాలి. కేంద్రంలో కొలువుతీరిన బీజేపీ ప్రభుత్వం ఎలాగైనా సరే ఆప్ ను తుడిచి పెట్టాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేసింది. అయినా ఆప్ దెబ్బకు బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక ఒంటిచేత్తో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొని కనీవినీ ఎరుగని రీతిలో మరోసారి బంపర్ విక్టరీ సాధించిన అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బంపర్ మెజార్టీ రావడం, నేటితో అసెంబ్లీ కాలపరిమితి ముగియడంతో ఢిల్లీ శాసనసభను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రద్దు చేశారు.
త్వరలోనే కేజ్రీవాల్ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. బీజేపీకి మరోసారి నిరాశే ఎదురైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పట్నుంచి 20కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించిన బీజేపీ మెల్లిమెల్లిగా పట్టు వదిలింది. ఇక ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌కు రిక్త హస్తమే మిగిలింది. కనీసం ఒక్క స్థానంలో కూడా ఆధిక్యాన్ని ప్రదర్శించ లేదు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్‌పర్ గంజ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రవి నేగిపై దాదాపు 3,571 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. శీలంపూర్‌లో ఆప్ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ విజయం సాధించారు.
సంగంవిహార్, దేవ్‌లీలో ఆప్ అభ్యర్థులు మెహనియా, ప్రకాష్‌లు విజయం సాధించారు. ఢిల్లీ ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్వీటర్ వేదికగా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి సీఎం కాబోతున్న కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు.‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. కాగా,ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. పార్టీ విజయోత్సవాల్లో భాగంగా టపాసులు కాల్చవద్దని కార్యకర్తలకు ఆదేశించారు.
పటాకుల స్థానంలో స్వీట్లు పంపిణీ చేయండి అని ఢిల్లీ సీఎం చెప్పారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి బిల్లు ఉండదని కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అసెంబ్లీ ఎన్నికల్లో పేదల ఓటింగ్‌పై ప్రభావం చూపిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేష్ బిధురి అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ దూకుడు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పార్టీ శ్రేణులు ప్రజలకు చేరువ చేయడంలో విఫలమైనట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఓటమికి బాధ్యత వహిస్తానని బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ అన్నారు. ఆప్ దూకుడుతో కాషాయ పార్టీ కొద్దిస్ధానాలకే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. అపూర్వ విజయాన్ని స్వంతం చేసుకున్న కేజ్రీవాల్‌ను పలువురు నాయకులు అభినందనలతో ముంచెత్తారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి