రియల్లీ కెప్టెన్సీ ఇన్నింగ్స్

హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారింది. క్రికెట్ ప్రెమికులు ఫుల్ గా క్రికెట్ ఆటలో మజాను ఎంజాయ్ చేశారు. ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా ఏమిటో రుచి చూపించాడు. ఛేదనలో మళ్లీ మొనగాడిగా నిలిచాడు. రాహుల్‌ మెరుపులకు తోడుగా నిలిచిన కోహ్లి ఆ తర్వాత అన్నీ తానై గెలిపించాడు. కడదాకా నిలిచాడు. కసిదీరా బంతుల్ని కొట్టాడు. దీంతో ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లే కాదు బంతి కూడా దెబ్బ మీద దెబ్బలతో విసిగి పోయింది. విరాట్‌ ఆఖరి దాకా నిలువడంతో కొండంత లక్ష్యం కూడా చిన్న బోయింది. తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ముందుగా బరిలోకి దిగిన వెస్టిండీస్‌ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. హెట్‌మైర్‌ 41 బంతుల్లో 56 పరుగులు చేయగా, లూయిస్‌ 17 బంతుల్లో 40 పరుగులతో చెలరేగారు.

భారత బౌలర్లలో చహల్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. రాహుల్‌ 40 బంతుల్లో 62 పరుగులు చేసి రాణించగా, సారధి కోహ్లీ దుమ్ము రేపాడు. కాగా టాస్‌ నెగ్గిన  కోహ్లి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన తొలి ఓవర్లోనే ఫోర్, సిక్సర్‌తో ఎదురు దాడికి దిగాడు. అయితే దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌కు దిగీదిగగానే విండీస్‌ ఓపెనర్‌ సిమన్స్‌ వికెట్‌ను పడేశాడు. క్రీజ్‌లోకి బ్రాండన్‌ కింగ్‌ రాగా విండీస్‌ జోరు అంతకంతకూ పెరిగింది. ధాటిగా ఆడుతున్న లూయిస్‌ను సుందర్‌ అవుట్‌ చేశాడు. తర్వాత క్రీజ్‌లోకి దిగిన ప్రతీ ఒక్కరూ బాదేయడంతో విండీస్‌ స్కోరు ఏ దశలోనూ 10 పరుగుల సగటుకు పడి పోలేదు.

పదో ఓవర్‌ పూర్తి కాక ముందే జట్టు స్కోరు వందకు చేరింది. దూకుడుగా ఆడుతున్న కింగ్‌ జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యాడు. తర్వాత హెట్‌మైర్‌కు కెపె్టన్‌ పొలార్డ్‌ జతయ్యాడు. ఇద్దరు మెరుపులు మెరిపించడంతో స్కోరు వేగం మరింత పుంజుకుంది. హెట్‌మైర్‌ 35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇద్దరిని ఒకే ఓవర్లో స్పిన్నర్‌ చహల్‌ ఔట్‌ చేశాడు. లక్ష్యం కష్ట సాధ్యమే అయినా..ఛేదనకు తగ్గట్లు గానే బ్యాట్‌కు పని చెప్పారు భారత బ్యాట్స్‌మెన్‌. రాహుల్‌ వేగంగా ఆడాడు. రెండో ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. రోహిత్‌ శర్మ విఫలమైనప్పటికీ  కోహ్లి  జత కావడంతో భారత్‌ లక్ష్యం వైపు పరుగు పెట్టింది. ఇండియా ఘనవిజయం సాధించింది. 

కామెంట్‌లు