దిశకు దేశం సలాం
దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఈ ఘటనపై హర్షం వ్యక్తం చేస్తోంది. పలు కళాశాలల్లో విద్యార్థినులు .. మా ఆడపిల్లకు న్యాయం జరిగిందంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి భారీగా జనాలు తరలి వచ్చారు. పూల వర్షం కురిపించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్ల క్రితం వరంగల్‌లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులపై యాసిడ్ దాడి చేసిన నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. అప్పుడు వరంగల్ ఎస్పీగా సజ్జనార్ ఉన్నారు. ప్రస్తుతం దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. ఇప్పుడు కూడా సైబరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పదేళ్ల తర్వాత అదే సంఘటన చటాన్‌పల్లిలోనూ పునరావృతం అయింది. ఎన్‌కౌంటర్ క్రెడిట్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్‌దే. కాగా సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా విచారణ జరుపుతున్నప్పుడు పోలీసులుపై దిశ సంఘటనలో నిందితులు దాడి చేశారని, తప్పించుకుని పారిపోతుండగా ఎన్‌కౌంటర్ చేసినట్లు తెలిపారు. కర్ణాటకకు చెందిన విశ్వనాథన్ చెన్నప్ప సజ్జనార్ 1996 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పోలీసు అధికారిగా పనిచేశారు. వరంగల్, మెదక్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో సైబరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. మెదక్‌లో ఎస్పీగా పని చేస్తున్నప్పుడు ఓ కానిస్టేబుల్‌ను హత్య చేసిన గంజాయి స్మగ్లర్‌ను ఎన్ కౌంటర్ చేశారు.
ఆక్టోపస్ ఐజీ గా ఉన్న సమయంలో ఐఎస్ఐ తీవ్రవాదులు వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర పోషించారు. ఇక నయీం ఎన్‌కౌంటర్‌లో కూడా సజ్జనార్ లీడ్ చేశారనే ప్రచారం పోలీస్ వర్గాల్లో ఉంది. ఇదిలా ఉండగా ఎన్‌కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్హం వ్యక్త మవుతోంది. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సైతం స్పందించారు. గ్రేట్ వర్క్ హైదరాబాద్ పోలీసు. కేంద్ర మాజీ మంత్రి, ఏథెన్స్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ కూడా ప్రశంసించారు. గుత్తా జ్వాలా తన ట్వీటర్ అకౌంట్‌లో స్పందిస్తూ అత్యాచార ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రతీ రేపిస్టుకు ఇదే తరహా శిక్ష అమలు చేయాలన్నారు. కాగా ఘటనపై కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ఈ ఎన్‌కౌంటర్‌ను తప్పు బడుతున్నారు.
ఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఎన్‌కౌంటర్‌పై వివరణ కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నటుడు మెహన్‌బాబు స్పందించారు. దిశకు నివాళిగా భావిస్తున్నానని అన్నారు. ఆడపిల్లల్ని ఆట వస్తువుగా పరిగణించి ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలన్నారు చిరంజీవి. దిశ ఆత్మకు ఇప్పుడు నిజమైన శాంతి చేకూరింది అన్నారు నటుడు బాలకృష్ణ. ఇదిలా ఉండగా ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో దిశ ఇంటి వద్ద భద్రతను పెంచారు. పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ఒక ఎస్సై, ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు, నలుగురు పురుష కానిస్టేబుళ్లతో భద్రత ఏర్పాటు చేశారు. ఎవరినీ అనుమతించ వద్దని స్పెషల్ టీంకు ఆదేశాలు జారీ అయ్యాయి. దిశ కేసులో నిందితులు పోలీసులపైకి కాల్పులు జరపడంతోనే ఎదురుదాడి చేయాల్సి వచ్చిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. తొలుత నిందితులు రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడికి యత్నించారని, ఆ తర్వాత రెండు తుపాకులు లాక్కున్నారని సజ్జనార్ చెప్పారు. దీంతో తాము ఫైరింగ్ ఓపెన్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని పేర్కొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి