ఎబికె..మూడక్షరాలు ..దట్టించిన తూటాలు ..నిలువెత్తు రూపం .. స్ఫూర్తి శిఖరం ..!
తెలుగు వాకిట మూడక్షరాలు ..తలచుకుంటేనే మనసు జలదరిస్తుంది . గుండె మండుతుంది . హృదయం సముద్రమవుతుంది ..ఆయన పేరుకు యెనలేని చరిత్ర ఉన్నది . ఆయన నీడలో వుంటే చాలు అనుకునే వాళ్ళు ఎందరో. తెలుగు పత్రికా రంగంలో ఎబికె అన్న పదం విస్మరించలేని ప్రపంచం . ఆయన ఏది రాసినా అదో ప్రవాహమై మనల్ని చుట్టేస్తోంది . వెల్లువలా అల్లుకుపోతుంది . అంతలా తనను తాను అందనంత ఎత్తుకు ఎదిగారు. ప్రపంచం ఎలా ఉంటుందో ఇంకెక్కడో వెతకాల్సిన పనిలేదు . గూగుల్ కు ఉన్నంత సామర్త్యం ఆయనకు ఉంది . అందుకే ఎబికె అంటేనే ఉద్వేగం ..ఉత్సాహం ..పోరాటం ..అద్భుతం కలిస్తే గురువు గారు అవుతారు. ఈ పత్రిక అయినా ఆయన పేరు పెట్టాల్సిందే .
ఆర్థికం ..సామాజికం ..సాహిత్యం ..ప్రపంచం ..జీవితం ..ఉద్విగ్నత ..అన్నీ కలగలిస్తే ఆయనే. ఎంతలా అంటే ..గురువు గారు పేరు చెబితే చాలు వాళ్లకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి . వాళ్ళు ముందు మనుషులు ..సభ్య సమాజం పట్ల ప్రత్యేక భాద్యత కలిగిన వారుగా ఉంటారు . ఆయన సారధ్యంలో పని చేయడం అంటే కొత్త జన్మ ఎత్తినట్లు అన్నమాట. ఎబికె ఎలా ఉంటారు . ఒక్కసారి కలిసే అవకాశం వస్తే చాలు అనుకునే వేలాది జర్నలిస్టులలో నేనూ ఒకడిని . అందరితో నేనూ ఆయనను స్మరిస్తూ ..కలలు కంటూ పెరిగాను . ఎబికె రాసిన ప్రతి అక్షరాలను .. పదాలను చదువుతూ ..నన్ను నేను మనిషిగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను . అందుకే జీవితం ఒక్కసారే ..కానీ ఆయన తో కలిసి మాట్లాడాలన్న కోరిక అధికమైంది . ఆ రోజుల్లో పాత్రికేయలు అంటే గొప్ప గౌరవం సొసైటీలో . ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇచ్చే వారు . అదో స్టేటస్ సింబల్ . అదో గొప్పతనపు భావన . ఇప్పటిలాగా కాదు . మనల్ని మనం పరిచయం చేసుకునే దౌర్భాగ్యం లేదిప్పుడు .
ఏబీకే ..ప్రతి అంశం గురించి పూస గుచ్చినట్టు ..ఆకలైనప్పుడు అమ్మ గోరు ముద్దలు తినిపించినట్లు . మట్టితో అనుబంధం పెంచుకున్నట్టు అనిపించింది మొదటిసారిగా చూసినప్పుడు . నేనో సామాన్యుడిని ..అన్ని పత్రికలూ చదివే అలవాటు ఉండటం తో గురువు గారు రాసినవన్నీ చదివే భాగ్యం దక్కింది. ఈ అలవాటు అలాగే ..ఇప్పటి దాకా అంటే 40 ఏళ్ళ కు పైగా వస్తూ ఉన్నది . గద్దర్ మీద రాసినా ..పాల్ రోబ్సన్ మీద రాసినా ..కృష్ణ శాస్త్రి మీద రాసినా ..రాచకొండ మీద రాసినా ..ఆఫ్రికన్ ..తెలుగు ..హిందీ ..ఇంగ్లిష్ సాహిత్యం గూర్చి రాసినా ..ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గురించి రాసినా ఆయనకు ఆయనే సాటి . ఈనాడు ..ఉదయం ...సుప్రభాతం ..వార్త ..ఇలా ఏబీకే మేధస్సుకు మచ్చుతునక మాత్రమే . గురువు గారు రాసిన సంపాదకీయాలు ఇంకెవ్వరు ఇంత వరకు రాయనే లేక పోయారు .
ఎవరికి తోచిన రీతిలో రాసుకుంటూ పోయారు తప్పా ..ఏబీకే మాత్రం ..సమస్యలను ..సవాళ్ళను ..లెక్కించలేనంతటి వివరాలతో ..ఇతరులు జడుసుకునేలా రాస్తూ పోయారు .. ఆ శైలి విన్యాసం ..అలవోకగా ..నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ..అలా ఆ ప్రవాహంలో మైమరిచి పోతాం . అంతటి గొప్పనైన సంపాదకులలో ఏబీకే అగ్రగణ్యుడు . అందరూ ఆయన అడుగు జాడల్లో నడిచిన వారే . ఆయన కనుసన్నలలో ఎదిగిన వారే . హెడ్డింగులు ...వార్తలు ..విశేషాలు ..ప్రత్యేకతలు ..ఏబీకే ఏది మాట్లాడినా అది వార్తే ..ఏది రాసినా అది సంచలనమే . ఆయన కలం కాలాన్ని ఒడిసి పట్టుకుంది .. జీవితాన్ని ఆవిష్కరించింది ..సమాజపు పోకడను ఎండగట్టింది ..ప్రజల గొంతుకకు ఊపిరి పోసింది . గుండెల్లో ఆర్ద్రతను అక్షరాల్లోకి వొలికించి ..మంటలు రేపి ..పోరాటపు ఉద్విగ్నతను నేర్పిన ధీరోదాత్తుడు ..పాత్రికేయ సమున్నత శిఖరం ఆయన.
నిత్యం తెల్లటి వస్త్రాలు ధరించే ఆయన అడుగులన్నీ పాత్రికేయ రంగం వైపు నే ఉన్నది . ఆ అడుగు జాడల్లో ...గురువు గారి నీడలో కి అనుకోకుండా చేరడం నా అదృష్టంగా భావిస్తున్నా. వార్త ..జనం చేతిలో ఆయుధమై విస్తరించింది ..ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రమై నినదించింది. మెరికల్లాంటి పాత్రికేయులను తీర్చిదిద్దింది ఏబీకే నే . మొదటి సారిగా వార్త మెట్లు ఎక్కినప్పుడు దిగ్గజాలను చూసే భాగ్యం కలిగింది . ఆఫీస్ నుండి రాత్రి పిలుపు వచ్చింది . అక్కడ ఇద్దరే ఉన్నారు .. ఒకరు ఏబీకే మరొకరు సతీష్ చందర్ . కవిత్వం రాస్తావా ..బాగుంది నీ రాత ..పనికొస్తాడు గా .. పోనీలే ..అన్నారు ..గురువు గారు ..అలా అమాయకంగా నవ్వారు సతీష్ చందర్ గారు . ఆయనే నన్ను ఎంకరేజ్ చేశారు . హిమజ్వాల శిస్యుడివా ..అయితే ఒకే ..ఏమి కాదు ..ఇది యుద్ధం ..ఇక్కడ నిన్ను నీవు ప్రూవ్ చేసుకునే వీలుంటుంది . అని చెప్పారు . ఆ తర్వాత ఏబీకే ..యాధాటి కాశీపతి ..పాఠాలు స్టార్ట్ అయ్యాయి . తొలి అక్షరంతో అంతరిక్ష ప్రయోగం పేరుతో ప్రారంభమైన వార్త ఓ సంచలనం . ప్రభుత్వంలో ప్రతిపక్ష పాత్ర పోషించింది ..వార్త పత్రికనే.. నేను ఏరి కోరి పాలమూరు జిల్లా ఎంచుకున్నా . గురువు గారు ఒకే అన్నారు . గద్వాల లో ఈనాడు ను దాటి వార్త ఎదిగింది ..ప్రతి ఊరులో వార్త ఉండేలా చేసాం .
ఈ ప్రయాణం లో నేను క్రికెట్ కామెంటరీ లో ఎక్స్ పర్ట్..వీడ్కోలు సమయంలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో ..ఎవరికి తోచిన రీతిలో పాటలు ..మిమిక్రి చేశారు . నేను కామెంటరీ చెప్పా . గురువు గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు ..మనోడు కవే కాదు జర్నలిస్ట్ కూడా .. ఒరే అబ్బాయి ..బాగా రాయి ..చదవడం మాత్రం ఆపకు ..నేనున్నాగా అన్నారు ..సార్ ..మొదటి సారి కదా ..భయంగా ఉందన్నా ..చిన్న పిల్లాడిలా నవ్వారు ..ఆ ఒక్క చిరునవ్వు నన్ను వేలాది స్టోరీలు రాసేందుకు స్ఫూర్తి కలిగించింది . అవును ..నేను ఆ మహోన్నత పాత్రికేయ శిఖరం నీడన కొన్ని పాఠాలు నేర్చుకున్నందుకు సంతోషంగా ఉంది . ఇంతకంటే భాగ్యం ఏముంటుంది కనుక..ఏబీకే పది కాలాలపాటు బతకాలి .. ఆ సమున్నత రూపం ..అదే మాటల మంత్రజాలం చల్లుతూ ..రాస్తూనే ఉండాలి . 80 ఏళ్ళు జీవించిన మీరు మరో వందేళ్లు బతకాలని కోరుకుంటూ ..నిష్క్రమిస్తున్నా..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి