ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతం - బీజేపీ బ‌డ్జెట్ ల‌క్ష్యం

జాతి యావ‌త్తు ఎంతో ఉత్కంఠ‌త‌తో ఎదురు చూసిన క్ష‌ణాలు రానే వ‌చ్చాయి. లోక్‌స‌భ‌లో  భార‌త విత్త మంత్రిత్వ శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు. విద్య‌, ఉమెన్ ఎంప‌వ‌ర్ మెంట్, ప‌రిశ్రామిక ప్ర‌గ‌తి, విమాన‌యాన‌, వ్యాపార అభివృద్ధి, బ్యాంకుల‌కు ఊతం ఇచ్చేలా జాగ్ర‌త్త ప‌డ్డారు. స్టార్ట‌ప్‌ల‌ను ప్రోత్స‌హించ‌డం, ఆంట్ర‌ప్రెన్యూర్ల‌ను క్రియేట్ చేయ‌డం త‌మ ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. మ‌హాత్మా గాంధీ, బ‌స‌వేశ్వ‌రుడిని ఆద‌ర్శంగా తీసుకుని విలువ‌ల‌కు పెద్ద‌పీట వేశామ‌న్నారు. కార్మికులకు పూర్తి భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని, ఇందు కోసం నాలుగు కార్మిక న్యాయ స్థానాల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఖేల్ ఇండియాలో భాగంగా క్రీడ‌ల‌కు భారీగా ప్రోత్స‌హాకాలు అంద‌జేస్తామ‌న్నారు. ప్ర‌పంచంలో టాప్ -200 విద్యా సంస్థ‌ల్లో 3 భార‌తీయ విద్యా సంస్థ‌లు ఉన్నాయ‌ని, అంత‌ర్జాతీయ స్థాయిలో పోటీ ప‌డేందుకు విద్యా సంస్థ‌ల‌కు మ‌రిన్ని నిధులు కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు.

నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హిస్తామ‌ని, జాతీయ ప‌రిశోధ‌న మండ‌లి కింద ఎన్నికైన రీసెర్చ్‌ల‌కు ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌న్నారు. జాతీయ విద్యా విధానంలో, పాఠ‌శాల విద్య‌, ఉన్న‌త విద్యా రంగాల్లో సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌స్తామ‌న్నారు. మ‌త్స్య కారుల కోసం ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప‌ప్పు ధాన్యాల ఉత్ప‌త్తిలో స్వ‌యం స‌మృద్ధి సాధించినందుకు రైతుల‌కు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేస్తున్నామ‌ని ఆర్థిక మంత్రి సీతారామ‌న్ తెలిపారు. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద దేశ వ్యాప్తంగా 81 లక్ష‌ల ఇళ్ల‌ను నిర్మించామ‌న్నారు. డిజిట‌ల్ అంత‌రాల‌ను తొల‌గించే డిజిట‌ల్ లట‌రీసీ కార్య‌క్ర‌మంతో పాటు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాల‌ను టెక్నాల‌జీతో అనుసంధానం చేస్తామ‌న్నారు. స్వ‌చ్ఛ భార‌త్ అభిమాన్ ప‌థ‌కం విజ‌య‌వంత‌మైంద‌ని, 9.6 కోట్ల కొత్త మ‌రుగుదొడ్లు నిర్మించామ‌న్నారు. జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ‌ను ఏర్పాటు చేస్తామ‌ని, అన్ని నీటి వ‌న‌రుల నిర్వ‌హ‌ణ‌, హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ ప‌థ‌కంలో భాగంగా నివాసాల‌కు నీటి స‌ర‌ఫ‌రా అందిస్తామ‌న్నారు.

జీరో బ‌డ్జెట్ వ్య‌వ‌సాయాన్ని ప్ర‌వేశ పెడుతున్నామ‌ని, ఇందుకోసం ఇప్ప‌టికే అనేక మంది రైతుల‌కు శిక్ష‌ణ ఇచ్చామ‌న్నారు. 1.25 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల మేర ర‌హ‌దారులను ఆధునికీక‌ర‌ణ చేస్తామ‌ని, 2022 నాటికి అన్ని నివాసాల‌కు విద్యుత్ , గ్యాస్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. గ్రామీణ భార‌తావ‌నికి ఆధునిక సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌న్నారు. 1.9 కోట్ల నివాసాల నిర్మాణం జ‌రుగుతోంద‌న్నారు. ప్ర‌పంచంలోనే భార‌త్ స‌రికొత్త అంత‌రిక్ష శ‌క్తిగా అవ‌త‌రించింద‌ని, అంత‌రిక్ష ప్ర‌యోగాల ఉత్ప‌త్తులు, మార్కెటింగ్‌కు ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. స్టాక్ మార్కెట్‌లో ఎన్ఆర్ ఐల పెట్టుబ‌డుల‌కు వెసులుబాటు క‌ల్పిస్తున్నామ‌న్నారు. ఈ ఏడాది గాంధీ 150వ జ‌యంతుత్స‌వాలు జ‌రుగ‌బోతున్నందున అంత్యోద‌య ప‌థ‌కాన్ని మ‌రింత విస్త‌రిస్తామ‌న్నారు. ఎఫ్‌డిఐల ఆక‌ర్ష‌ణ‌కు భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా తీర్చిదిద్దుతామ‌ని తెలిపారు. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల స‌బ్సిడీ కోసం ప్ర‌త్యేక లాబీయింగ్ తో పాటు చిల్ల‌ర వ్యాపారుల‌కు నూత‌న పింఛ‌న్ ప‌థ‌కాన్ని వ‌ర్తింప చేస్తామ‌న్నారు.

బ‌స్ ఛార్జీలు, పార్కింగ్ రుసుములు చెల్లించే విధంగా ఒకే కార్డుకు రూప‌క‌ల్ప‌న చేస్తున్నామ‌ని, ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌ర్మిష‌న్స్ విష‌యంలో మ‌రింత స‌ర‌ళత‌రం చేస్తామ‌న్నారు. ఎంఎస్ఎంఇల‌కు కోటి వ‌ర‌కు రుణం అంద‌జేస్తామ‌న్నారు. భార‌త మాల‌, సాగ‌ర్ మాల‌, ఉడాన్ ప‌థ‌కాల‌తో ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల మ‌ధ్య అంత‌రాలు త‌గ్గి పోతున్నాయ‌ని తెలిపారు. ఇళ్ల ధ‌ర‌ల‌ను సామాన్యుల‌కు అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌ని, ఆద‌ర్శ అద్దె విధానం త్వ‌ర‌లోనే అమ‌లు చేస్తామ‌న్నారు. ఒకే దేశం ..ఒకే గ్రిడ్ విధానంలో భాగంగా అన్ని ప్రాంతాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని, ఎల‌క్ట్రినిక్ వాహ‌నాల త‌యారీ ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్రోత్సాహ‌కాలు క‌ల్పిస్తామ‌న్నారు. రైల్వేల్లో 50 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డి అవ‌స‌రం ఉంద‌ని, దీని కోస‌మే పీపీపీ అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. ఎన్డీయే అధికారంలోకి వ‌చ్చే నాటికి భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ 1.85 ల‌క్ష‌ల డాల‌ర్లుగా ఉంద‌ని, ప్ర‌స్తుతం భార‌త్ 2.5 ల‌క్ష‌ల డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గ‌ల దేశంగా మారింద‌న్నారు.

కామెంట్‌లు