వ్య‌వ‌సాయానికి కేంద్రం సాయం

రెండు నెల‌లు గ‌డిచినా వ‌రుణ దేవుడు క‌రుణించ‌డం లేదు. ఒక్క ముంబ‌యిని మాత్ర‌మే క‌రుణించ‌గా మిగ‌తా ప్రాంతాల్లో ఒక్క నీటి చుక్క ప‌డ‌లేదు. భూముల‌ను న‌మ్ముకుని వాన‌ల కోసం ఎదురు చూస్తున్న కోట్లాది రైతుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. క‌నీసం తాగేందుకు సైతం నీరు దొర‌క‌ని ప‌రిస్థితి దాపురించింది. ఓ వైపు ఎక్కువ శాతం నీళ్లు స‌ముద్రం పాల‌వుతున్నా వాటిని ఒడిసి ప‌ట్టుకునే సాంకేతిక నైపుణ్యాన్ని ఇన్నేళ్ల‌యినా ఏ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన పాపాన పోలేదు. చెరువులు, కుంట‌లు బోసిపోయిన‌వి. వాన‌మ్మ జాడ లేదు. గ‌త ఏడాది కొంత మేర‌కు రుతు ప‌వ‌నాలు ముందుగానే వీచినా కాస్తో కూస్తో తాగు, సాగు నీటికి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఈసారి పూర్తిగా ప‌రిస్థితి అందుకు భిన్నంగా వుంది. క‌నీసం ఒక్క టీఎంసీ నీళ్లు కూడా ఆయా ప్రాజెక్టుల్లోకి రాలేదు.

ఇక సాగు మాట దేవుడెరుగు..తాగేందుకు ఎట్లా అన్న‌ది జ‌నాన్ని తొలుస్తున్న‌ది. రోజు రోజుకు జ‌నాభా పెరుగుతూ పోతుండ‌గా దానిని కంట్రోల్ చేయ‌లేక ప్రభుత్వం నానా తంటాలు ప‌డుతున్న‌ది. అక్క‌డ‌క్క‌డ చెదురు మ‌దురుగా కురిసిన తొల‌క‌రి వ‌ర్షాల‌కు రైతులు గ‌త్యంత‌రం లేక పొలాల‌ను దుక్కి దున్ని చ‌దును చేసి పెట్టారు. తీరా విత్త‌నాలు చ‌ల్లాక వాన‌మ్మ జాడ లేకుండా పోవ‌డంతో ల‌బోదిబోమంటున్నారు. ప్రాజెక్టులు ఎండిపోయిన‌వి. రైతులు పండించిన పంట‌ల‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాల‌ని గ‌త కొంత కాలంగా రైతులు ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. అయినా స‌ర్కార్ స్పందించ‌లేదు. తాజా ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ వ్య‌వ‌సాయానికి మ‌రింత ఊతం ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకుంది. అన్న‌దాత‌ల‌కు మ‌ద్ధ‌తు గా ఉండేలా పంట‌లకు మినిమం ప్రైజ్‌ను నిర్ణ‌యించింది.

ఈ మేర‌కు కేంద్ర కేబినెట్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. వ‌డ్లు క్వింటాల్ కు 1815 రూపాయ‌లు, ఏ గ్రేడ్ ర‌కానికి 1835 రూపాయ‌లుగా నిర్ణ‌యించింది. గ‌త ఏడాది కంటే ఈసారి 65 రూపాయ‌లు ఎక్కువ‌. ఆయిల్ సీడ్స్ లో సోయాబీన్‌కు 311 రూపాయ‌లు, స‌న్ ఫ్ల‌వ‌ర్ కు 262 రూపాయ‌లు, నువ్వుల‌కు 236 రూపాయ‌లు, వేరుశ‌న‌గ ప‌ల్లీల‌కు 200 రూపాయ‌ల ఎంఎస్‌పీని ప్ర‌క‌టించింది. ప‌ప్పు ధాన్యాలైన కందుల‌కు 125 రూపాయ‌లు, మినుముల‌కు 100 , పెస‌ర్ల‌కు 75, జొన్న‌ల‌కు 120, స‌జ్జ‌ల‌కు 50, మ‌క్క‌ల‌కు 60, రాగుల‌కు 253, ప‌త్తి మీడియం ర‌కానికి 105, లాంగ్ స్టాపుల్‌కు 100 రూపాయ‌లు పెంచింది. 2022 సంవ‌త్స‌రం నాటికి రైతులు మ‌రింత బాగు ప‌డేలా ఉండేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని కేంద్ర మంత్రి తెలిపారు. వ్య‌వ‌సాయ ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల‌కు ఊత‌మిచ్చేలా బ‌డ్జెట్ ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కీల‌క రంగాల‌లో వ్య‌వ‌సాయానికే అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌న్నారు. వ‌ర్షాలు లేని స‌మ‌యంలో మినిమం ప్రైజెస్ కేటాయించం వ‌ల్ల రైతుల‌కు ఎలాంటి మేలు జ‌ర‌గ‌ద‌ని విప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. 

కామెంట్‌లు