ఐటీ కంపెనీల్లో నీటికి కష్టకాలం - సిబ్బందికి తక్కువ తాగండని ఆదేశం
దేశ వ్యాప్తంగా వానల కాలం ఇంకా ప్రారంభం కాక పోవడంతో తాగేందుకు నీళ్లందని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చెన్నైని ఈ నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. లక్షలాది మంది ఈ నగరంలో జీవనం కొనసాగిస్తున్నారు. ఐటీ రంగానికి వస్తే వందలాది ఐటీ కంపెనీలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలలో కొలువు తీరాయి. తాజాగా చెన్నై విషయానికి వస్తే, వేలాది మంది ఆయా ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నారు. వీరందరికి ఉచితంగా కంపెనీలు సేవలందిస్తున్నాయి. నీళ్లతో పాటు ఫుడ్, టిఫిన్స్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ అందిస్తున్నాయి. తాజాగా వర్షాలు కురియక పోవడంతో భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లిపోయాయి. దీంతో నీటి కొరతను అధిగమించేందుకు ఏలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక యాజమాన్యాలు ఆలోచనలో పడ్డాయి.
మిగతా నగరాల్లో కొంత నీరు లభిస్తున్నప్పటికీ చెన్నైలో మాత్రం రోజు రోజుకు నీటి కొరత మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని చాలా హోటళ్లలో నీళ్లు లేవంటూ బోర్డులు తగిలించారు. ఎంతైనా తినండి కానీ నీళ్లు మాత్రం అడగొద్దంటూ వేడుకుంటున్నారు. ఇంతటి నీటి తీవ్ర కొరత ఎప్పుడూ రాలేదని మహానగర పాలక సంస్థ అంటోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, టీకొట్లు, బార్లు, తదితరవన్నీ నో వాటర్ అంటూ పేర్కొంటున్నాయి. తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్, విప్రోతో పాటు మరికొన్ని ఐటీ దిగ్గజ కంపెనీలు ఏకంగా ఆదేశాలు జారీ చేశాయి. తమ వద్ద పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులకు . నీటిని చూసి వాడుకోవాలని , అవసరమైనంత మేరకే ఉపయోగించు కోవాలని సూచనలు చేశాయి.
ఇప్పటికే ఆయా కంపెనీల క్యాంటీన్లలో సిబ్బంది అయినా సరే కొంత మొత్తమే ఇవ్వాలని ఆదేశించాయి. కాస్ట్ కటింగ్ అనడం కంటే ముందు చూపుతో తీసుకున్న నిర్ణయమని, దీనిని మానవతా దృక్ఫథంతో అర్థం చేసుకొని తమతో సహకరించాలని కోరాయి. గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో నీరు దొరకని పరిస్థితి దాపురించింది. చెన్నైకి నిరంతరం సరఫరా చేసే నాలుగు రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోయాయని, సాధ్యమైనంత మేరకు తాము నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నామని నగర పాలక సంస్థ డైరెక్టర్ వెల్లడించారు.
చెన్నైతో పాటు 21 పట్టణాలు విస్తరించి వున్నాయి. చాలా చోట్ల నగర పాలక సంస్థ నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇదిలా వుండగా 2017లో 450 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తే..ఈ ఏడాది ఆ వినియోగం పెరగడంతో ప్రతి రోజు 535 మిలియన్ల నీటిని అందజేస్తున్నామంటున్నారు నిర్వాహకులు. వాన దేవుడు కరుణిస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరికేలా లేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి