మేధ‌స్సుకు ప‌రీక్ష‌..ఉపాధికి శ్రీ‌రామ‌ర‌క్ష


కాస్తంత తెలివి తేట‌లు ఉంటే చాలు..ఎక్క‌డి నుండైనా ..ఎన్ని కోర్సులైనా నేర్చుకోవ‌చ్చు. ఇంటి నుండే పాఠాలు..టీచ‌ర్లు..శిక్ష‌కులు అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. మిమ్మ‌ల్ని అన్ని రంగాల్లో నైపుణ్యం క‌లిగిన స్టూడెంట్స్‌గా తీర్చిదిద్దుతారు. ఇదంతా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌యారు చేసిన స్వ‌యం ..ప‌థ‌కం భ‌రోసా క‌ల్పిస్తోంది. ఏ కోర్సు అయినా చేయాలంటే స‌వాల‌క్ష ఇబ్బందులు. కానీ అవేవీ వీటికి అడ్డు కాదు. ఓపెన్ స్కూల్ నుంచి క్లౌడ్ టెక్నాల‌జీ వ‌ర‌కు అన్ని ఆన్‌లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ధృవీక‌ర‌ణ ప‌త్రాలు, క్రెడిట్ స్కోర్ పొందేందుకు వీలు ప‌డుతుంది. ఐఐటీ, ఐఐఎం, ఫారిన్ యూనివ‌ర్శిటీల నుంచి బోధ‌న కూడా ఇందులోనే ల‌భిస్తోంది. కాలం మారింది. టెక్నాల‌జీలో స‌మూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

మెరుగైన ఫ్యూచ‌ర్ కు ..పునాది వేసుకునేందుకు ఈ కోర్సులు దోహ‌ద ప‌డ‌తాయి. మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టుగా కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ కోర్సులు రూపొందించింది. కోచింగ్ సెంట‌ర్ల‌కు వెళ్ల‌లేని వారి కోస‌మే వీటిని త‌యారు చేశారు. ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన ప‌నిలేదు. ప్ర‌ఖ్యాత సంస్థ‌లు ఆధునిక కోర్సుల‌కు ప్ర‌ణాళిక‌లు, సిల‌బ‌స్ రూపొందించాయి. క్రెడిట్స్, ధృవ‌ప‌త్రాల‌ను సైతం మంజూరు చేస్తోంది. స్వ‌యం వెబ్ పోర్ట‌ల్ ద్వారా ఇప్ప‌టికే వేలాది మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. స‌ర్టిఫికెట్లు అందుకుంటున్నారు. అద్భుత‌మైన ఆలోచ‌నకు ప్ర‌తిరూప‌మే స్వ‌యం. బ‌డి మానేసిన వారికి, డిగ్రీ ఇత‌ర ఉన్న‌త కోర్సులు చ‌దువుకుంటున్న వారు న‌చ్చిన కోర్సులు చ‌దివేందుకు వీలుగా ఆన్ లైన్‌లో రిజిష్ట‌ర్ చేసుకోవాలి.

ఏ కోర్సు చ‌ద‌వాల‌ని అనుకుంటున్నారో..దానికి సంబంధించి సిల‌బ‌స్ , పాఠాలు ఉంటాయి. తొమ్మిదో త‌ర‌గ‌తి నుండి ఇంజ‌నీరింగ్ దాకా అన్ని కోర్సులు ఉచితంగా నేర్చుకోవ‌చ్చు. ఆల్ రెడీ కోర్సులు చేసిన వారికి ఇవి అద‌నంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కోర్సులు పూర్త‌య్యాక‌..ప్ర‌తిభ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఒక‌టా రెండా ఏకంగా రెండు వేల కోర్సుల‌కు పైగా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇందుకు గాను 80 వేల గంట‌లకు స‌రిప‌డా మెటీరియ‌ల్ అందుబాటులో ఉంది. పాఠ‌శాల విద్య పూర్తి చేయ‌లేని వారి కోసం ఓపెన్ స్కూల్ విద్య అందుబాటులో ఉంది. ఇంజ‌నీరింగ్, మేనేజ్ మెంట్, న్యాయ విద్య‌, ఉపాధ్యాయ విద్య లాంటి ప్రొఫెష‌న‌ల్ కోర్సులు ఉన్నాయి.

ఇక సాంకేతిక ప‌రంగా చూస్తే...బ్లాక్ చైన్, క్లౌడ్ టెక్నాల‌జీ త‌దిత‌ర స‌ర్టిఫికెట్ కోర్సుల‌ను ఐఐటీలు అంద‌జేస్తున్నాయి. అయితే మిగ‌తా వాటికి ప్ర‌త్యేక అర్హ‌త‌లు ఉండాల్సిన అవ‌స‌రం లేదు.కానీ టెక్నాల‌జీ కోర్సుల‌కు సంబంధించి కంప‌ల్స‌రీగా అర్హ‌త‌లు ఉండాల్సిందే. మొబైల్ యాప్ ద్వారా లేదా వెబ్ పోర్ట‌ల్‌లో న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత ఆస‌క్తి క‌లిగిన రంగాల‌ను ఎంపిక చేసుకోవాలి. పాఠ‌శాల విద్య‌కు సంబంధించి 147 కోర్సులు అందుబాటులో ఉండ‌గా, స‌ర్టిఫికెట్ కోర్సులు 134 కోర్సులు, పీజీ కోర్సులు 108, డిప్లొమా కోర్సులు 41, డిగ్రీ కోర్సులు 1075, ప్రాథ‌మిక విద్యలో డిప్లొమాలో ఒక కోర్సు తో క‌లిపి మొత్తం 548 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నేర్చుకోవాల‌న్న కోరిక ..విజ్ఞానం పెంపొందిచు కోవాల‌న్న త‌ప‌న ఉన్న వారికి ఈ కోర్సులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

కామెంట్‌లు