ఎడిటర్స్ ఛాయిస్ - అవినీతికి అంతం ఎప్పుడు ..?
ఐటీ రంగంలో దేశంలోనే టాప్ రేంజ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇపుడు ఆనకొండలా పేరుకు పోయిన అవినీతిని నిర్మూలించలేక పోతోంది. ఏ శాఖకు వెళ్లినా ఉద్యోగులు లంచాలు ఇవ్వనిదే ..చేతులు తడపనిదే పనులు చేయడం లేదు. ఓ వైపు ఉద్యోగులకు భారీ ఎత్తున వేతనాలు అందజేస్తున్నా ..లంచావతారాలు మాత్రం మారడం లేదు. పూర్తి స్థాయిలో అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తున్నా , నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినా ఆయా శాఖల సిబ్బందిలో ఎలాంటి బెదురు కనిపించడం లేదు. ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ..కట్ చేసి మళ్లీ బాజాప్తాగా డబ్బులు ఇవ్వాల్సందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక ఎవరైనా తమ సమస్యలకు పరిష్కారం లభించక పోతే నేరుగా ఫోన్ చేయొచ్చంటూ ఓ నెంబర్ ఇచ్చారు. ఆయా ప్రాంతాల నుండి లెక్కకు మించి ఫోన్లు వెళ్లాయి. ఎక్కువగా రెవిన్యూ, మున్సిపల్ , ఎక్సైజ్ , తదితర శాఖలపైనే బాధితులు ఫిర్యాదు చేశారు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా అవినీతికి కేరాఫ్ గా మారి పోయిన రెవిన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తే కానీ దారికి రారన్న సంగతిని గుర్తించారు. కింది స్థాయి నుండి పై స్థాయి దాకా వసూళ్ల దందా యధేశ్చగా కొనసాగుతోంది. దీని మీద పూర్తిగా నియంత్రణ అంటూ లేకుండా పోయింది. లంచం రాచపుండులా తయారైంది. ఆయా గ్రామాలలో పొలాలు కలిగిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి అమాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకున్న గ్రామ రెవిన్యూ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి, మండల రెవిన్యూ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలు నానా రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ బాధితులు వాపోయారు. తనకు జరిగిన అన్యాయం గురించి ఓ రైతు నేరుగా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. తన గోడును చెప్పుకోవడంతో స్పందించిన సీఎం తక్షణమే బాధ్యులను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు.
అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు కింద సాయం చేస్తుండడంతో పాసు పుస్తకాలకు ఎక్కడలేని డిమాండ్ పెరిగింది. ఉత్తగా డబ్బులు మీకు వస్తున్నాయని..దాంట్లోంచి డబ్బులు మాకిస్తే మీకేం పోయేందంటూ రెవిన్యూ సిబ్బంది ..నిస్సిగ్గుగా ఒక్కో దానికి ఒక్కో రేటు కూడా నిర్ణయించారు. రేషన్ కార్డుకు ఓ ధర, పాసు బుక్కుకు మరో ధర. షాదీ పథకానికి లంచం..చావు, పుట్టుక ధృవీకరణకు లంచం..భూమి సంబంధిత వ్యవహారాలు చక్క దిద్దాలంటే ..వేలు ఇచ్చు కోవాల్సిందే. లేక పోతే పని కాదు. పైసలు రావు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు అప్పులు చేసి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పని అవుతుందన్న నమ్మకం లేదు. భూములు సర్వేలు చేయాలంటే సర్వేయర్ కు, ఆర్ ఐకి 3 వేల నుండి 10 వేల రూపాయల దాకా ఖర్చవుతుంది.
జనన, మరణ పత్రాలు పొందాలంటే తెలంగాణలో 100 నుండి 500 రూపాయలు సమర్పించు కోవాల్సిందే. ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తు చేయాలంటే 100 రూపాయలు ఇచ్చు కోవాలి. కళ్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధి పొందాలంటే 5 వేల రూపాయలు సమర్పించు కోవాల్సిందేనని బాధితులు సీఎంతో మొర పెట్టుకున్నారు. ఇక పాసుపుస్తకాల విషయానికి వస్తే ఇదో పెద్ద తంతు..ఇక్కడే కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఎకరాకు 5 వేల నుంచి 10 వేల రూపాయలు ఇవ్వాలి. రేషన్ కార్డుల పంపిణీ విషయంలో విచారణ చేసేందుకు 100 నుంచి 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తోందంటూ వాపోయారు. ఈ తతంగం కొన్ని యేళ్ల నుండి కొనసాగుతూ వస్తోంది.
48 శాఖలకు పైగా వున్నప్పటికీ కేవలం రెవిన్యూ, పురపాలక శాఖలను మాత్రమే టార్గెట్ చేయడంపై ఆయా శాఖల ఉద్యోగాల సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆందోళన చేపట్టారు. నిరసన తెలిపారు. సీఎం వ్యాఖ్యలు సరైనవి కావంటూ పేర్కొన్నారు. మూకుమ్మడిగా పెన్ డౌన్ చేస్తామంటూ ఆల్టిమేటం ఇచ్చారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న సీఎం కేసీఆర్ ఏకంగా రెవిన్యూ శాఖను వ్యవసాయ శాఖకు బదిలీ చేస్తామని ప్రకటించారు. బిల్ కలెక్టర్ అదే పని చేస్తున్నడు..జిల్లా కలెక్టర్ కూడా అదే చేస్తున్నడు ఇక వీరిద్దరికి తేడా ఎందుకని ప్రశ్నించడం ఉద్యోగుల్లో భయాన్ని కలుగ చేసింది. రెవిన్యూ చట్టాల్లో సమూల మార్పులు చేస్తామంటూ ..కేవలం రెండు నెలలు ఆగితే అన్నీ సర్దుకుంటాయని ఆయన ఎన్నికల సభలో హామీ ఇచ్చారు. ఎవ్వరు అభ్యంతరం పెట్టినా డోంట్ కేర్ అంటున్నారు. ప్రతి దానికి లంచం అవసరంగా మార్చేశారని..దీనిని ప్రక్షాళన చేయక పోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని సీఎం భావించారు. ఫీల్ ఫ్రీ పాలసీతో ప్రభుత్వం నడుస్తోందంటూ చెప్పుకొచ్చారు.
ఎంప్లాయిస్ యూనియన్స్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈజీగా తీసుకున్నారు. ఫలితాల కోసం ఆయన వేచి చూస్తున్నారు. ఆ తర్వాత ఏయే శాఖలు దేని పరిధిలోకి వెళ్లిపోతాయో తెలియక ఉద్యోగులు టెన్షన్ కు లోనవుతున్నారు. తాను ఒకసారి డిసైడ్ అయ్యాడంటే సీఎం ఎవ్వరి మాటా వినడు. ఇక అధికారులే ఇలా వుంటే..పట్టణాల్లో పురపాలికల పరిధుల్లో పనులు కావాలంటే కార్పొరేటర్లు, మేయర్లు, కొందరు ప్రజాప్రతినిధులకు అమ్యామ్యాలు ఇచ్చు కుంటున్నారంటూ ఓ సంస్థ సర్వే లో తేలడంతో పెద్దాయన అవాక్కయ్యారు. ఇంత భారీ ఎత్తున జీతాలు ఇస్తున్నా వీరెందుకు మారడం లేదన్న ఆందోళనకు గురయ్యారు. అందుకే శాఖల ప్రక్షాళనే దీనికి అసలైన మందు అని గుర్తించారు. కార్యాచరణకు దిగారు. త్వరలో అన్నీ ఆన్ లైన్లోనే లభించబోతున్నాయి. ఏ శాఖ ..ఏ అధికారికి ఏమేం అధికారాలు, బాధ్యతలు ఉంటాయో త్వరలో మార్గదర్శకాలు రానున్నాయి. ఏది ఏమైనా బంగారు తెలంగాణ చేయాలని కలలు కంటున్న సీఎంకు ..అవినీతిని అంతమొందించడం
పెను సవాల్‌గా మారింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి