అలవోకగా పంజాబ్ ..నిరాశలో రాజస్థాన్
ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను చేజేతులారా పోగొట్టుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు అజింక్యా రెహానే మొదటగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్‌లోని మొహాలీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ అటు అభిమానులకు ఇటు క్రికెటర్లకు మంచి జోష్ ఇచ్చింది. టోర్నమెంట్‌లో బెంగళూరు తర్వాత వరుస ఓటములతో రికార్డు సృష్టిస్తోంది రాజస్థాన్. ఇరు జట్లు ఓటముల్లో సేమ్ టు సేమ్ అన్నమాట. మరో వైపు పంజాబ్ జట్టు మెల్లగా పుంజుకుంది. అయిదో విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. అటు బ్యాటింగ్ లోను..ఇటు బౌలింగ్‌లోను సత్తా చాటడంతో విజయం పంజాబ్ వశమైంది. అశ్విన్ కెప్టెన్‌గా ..బౌలర్‌గా చక్కగా రాణించాడు. ప్లే ఆఫ్ దశలో వెనుకబడుతున్న ఈ దశలో కీలక విజయం సాధించింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో గెలిచింది. 183 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాయల్స్ జట్టు ..నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అవకాశాలు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేక పోయారు జట్టు సభ్యులు. రాహుల్ త్రిపాఠి 45 బంతులు ఆడి 50 పరుగులు చేసినా ఫలితం లేక పోయింది. కెప్టెన్ రెహానే ఏ కోశాన ధీటుగా ఆడలేక పోయాడు. సింగిల్స్ తీసుకుంటూ పోయారే తప్పా ..ఫోర్లు , సిక్సర్లు కొట్టేందుకు ట్రై చేయలేదు. బిన్నీ మెరిసినా అతను కూడా చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. రవిచంద్రన్ 24 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీస్తే మురుగున్ 24 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శించడంతో రాజస్థాన్ క్రికెటర్లు పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక చతికిలపడ్డారు. అంతకు ముందు మైదానంలోకి వచ్చిన పంజాబ్ జట్టు పక్కాగా ..గెలవాలనే కసితో ఆడింది. ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కే ఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు. ఎక్కడా తడబాటు పడలేదు.
47 బంతులు ఆడి మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో 52 పరుగులు చేయగా..డేవిడ్ మిల్లర్ 27 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేశాడు. వీరిద్దరి భాగస్వామ్యం పరుగుల వరద పారించింది. రాజస్తాన్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ 4 బంతుల్లో 17 పరుగులు చేయడంతో భారీ స్కోర్ సాధించింది పంజాబ్. బౌలింగ్ లో మార్పులు, ఫీల్డింగ్ ఏర్పాట్లలో తెలివిగా వ్యవహరించి జట్టు విజయానికి బాటలు వేసిన కెప్టన్ అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఛేదనలో రాయల్స్ జట్టు గట్టి పోటీ ఇచ్చినా ఎందుకనో ఆఖరులో పోరాట పటిమను ఆటగాళ్లు ప్రదర్శించలేక పోయారు. 15.5 ఓవర్ల సమయంలో ఫాంలో ఉన్న త్రిపాఠి పెవిలియన్ కు చేరుకున్నాడు. టర్నర్, ఆర్చర్ నిరాశ పరిచారు. చివర్లో బిన్నీ ధాటిగా ఆడినా జట్టును గెలిపించలేక పోయాడు. ఈ మ్యాచ్‌లో చెప్పుకోవాల్సింది ఒక్కరే..అతడే అశ్విన్ ..టోర్నీలో ఏ ఆటగాడు ఇలా సిక్సర్లను అవలీలగా కొట్టలేదు. ఇదే ఈ మ్యాచ్‌కు హైలెట్. రాయల్స్ జట్టు ప్లే ఆఫ్ మీద ఆశలు వదులుకున్నట్టే అనిపిస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి