బంగారం భద్రం - దేనికైనా సిద్ధం - ఈఓ సింఘాల్
తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కోట్లాది భక్తులు కొలిచే దైవంగా తిరుమలకు మంచి పేరుంది. టీటీడీ బోర్డు సభ్యుల తీర్మానం ..పర్మిషన్ లేకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ భారీ ఎత్తున బంగారాన్ని వేరే బ్యాంకులో డిపాజిట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఓ రకంగా చెప్పాలంటే చిన్న గ్రాము బంగారం కూడా పక్కకు వెళ్లే పరిస్థితి లేదు. కోట్లాది రూపాయలు, లెక్కించలేనంత బంగారం, వెండి, వజ్రాభరణాలు శ్రీ వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లకు భక్తులు సమర్పించుకుంటుంటారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయంగా తిరుమల ఆలయానికి పేరుంది. కష్టపడే నిబద్ధత కలిగిన ఉన్నతాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్‌కు మంచి పేరుంది. ఆయన ఈఓగా బాధ్యతలు చేపట్టాక..అక్రమార్కులు, మధ్య దళారీలు, ఇతరుల పెత్తనానికి చెక్ పెట్టారు. దీనిని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు ఆయనపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఆయన మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.
ఆలయానికి సంబంధించిన బంగారం గురించి పూర్తి వివరాలను ఈఓ సింఘాల్ తిరుమలలో వెల్లడించారు. పూర్తి వివరాలను తెలియ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ప్రస్తుతం 9 వేల 259 కిలోల బంగారం నిల్వలు ఉన్నాయని చెప్పారు. మొత్తం 1381 కిలోలు ఖజానాకు చేరిందన్నారు. తనపై ఎలాంటి విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతులు తనపై చేసిన విమర్శలను స్వాగతిస్తున్నానని అన్నారు. వచ్చిన బంగారం ఆలయ ఖజానాకు భద్రంగా చేరిందని, దానిని స్వీకరించేసమయంలో డాక్యుమెంట్ల ప్రకారం పక్కాగా ఉన్నాయని..వెల్లడించారు. 2016 ఏప్రిల్ 18న 1311 కిలోల బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మూడేళ్ల కాల వ్యవధిలో బంగారం ద్రవ్య నిధి కింద 1.75 శాతం వడ్డీ రేటుపై డిపాజిట్ చేసినట్లు తెలిపారు. 2019 ఏప్రిల్ 18 నాటికి కాల పరిమితి ముగియడంతో డిపాజిట్ చేసిన బంగారం తిరిగి ఇవ్వాలని కోరుతూ గత నెల 27న బ్యాంకుకు లేఖ రాశామన్నారు.
వడ్డీతో సహా 1381 కిలోల బంగారం టీటీడీకి రావాల్సి ఉందని..ఒప్పందం మేరకు బ్యాంకే దానిని తీసుకు వచ్చి అప్పగించాల్సి ఉందన్నారు. టీటీడీ వరకు చేరేంత దాకా ..దానితో తమకు సంబంధం లేదన్నారు. ప్రస్తుతం దేవస్థానం వద్ద 9259 కిలోల బంగారం నిల్వలు ఉన్నాయని ..దానికి ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు అనిల్ కుమార్ సింఘాల్. అంతేకాకుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో 5 వేల 387 కిలోల బంగారం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 1938 కిలోలు, పీఎన్‌బిలో 1381 కిలోలు డిపాజిట్ చేశామన్నారు. టీటీడీ ఖజానాలో తాజాగా 553 కిలోలు ఉందన్నారు. పీఎన్‌బిలో జమ చేసిన బంగారం భద్రంగా ఆలయానికి చేరుకుందని..ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు. ఎవరైనా వచ్చి చూసుకోవచ్చన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్నికల తనిఖీల్లో తమిళనాడులో పట్టుబడిన బంగారం అంశంపై ఆదాయ పన్ను శాఖ తమను సమాచారం కోరిందన్నారు.
బంగారం తిరిగి అప్పగించాలంటూ రాసిన లేఖను వారికి అప్పగించామన్నారు. టీటీడీ ఆదాయం పెంచుకునే దిశగా జాతీయ బ్యాంకుల్లో బంగారం డిపాజిట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఫైనాన్స్ సబ్ కమిటీ మార్చి 20 న రాత పూర్వకంగా ఇచ్చిన రెజల్యూషన్ ఆధారంగానే బంగారాన్ని తిరిగి అదే రూపంలో ఇవ్వాలని సూచించడంతో పీఎన్‌బిని అలాగే ఇవ్వమని కోరామన్నారు. బ్యాంక్ నుంచి బంగారం విత్ డ్రా చేస్తున్న అంశం పాలక మండలి సభ్యులకు తెలియదంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు సింఘాల్ వెల్లడించారు. టీటీడీ గురించి మాట్లాడే అధికారం, పశ్నించే హక్కు హిందువులకు, మఠాధిపతులు, పీఠాధిపతులకు ఉందని, వారు ఏ విమర్శలు చేసినా గౌరవిస్తామన్నారు. బంగారం అప్పగించడంలో సమస్య సృష్టించిన పీఎన్‌బీని బ్లాక్‌లి్‌స్టలో పెట్టేంత పెద్దతప్పు తనకేమీ కనిపించలేదన్నారు. మరో వైపు బంగారం పట్టుబడిన అంశంపై విచారణ నిమిత్తం సీఎస్ ఆదేశాల మేరకు దేవదాయశాఖ కార్యదర్శి మన్మోహన్‌సింగ్ టీటీడీ ఈవో, ఆర్థిక అధికారి తదితరులను విచారించినట్టు సమాచారం. పీఎన్‌బిలో జమ చేసిన బంగారాన్ని తిరిగి రెన్యూవల్ చేసి వుంటే బావుండేదని టీటీటీ బోర్డు మెంబర్ బాబు అభిప్రాయ పడటం కొసమెరుపు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి