ఏ దేవి వరము నీవు..!
ఎన్నిసార్లు విన్నా ఇంకా ఏదో మిగిలే ఉంటోందన్న భావన నిలవనీయడం లేదు. సంగీతానికి ..పాటకు ఎనలేని శక్తి ఉంది. జనాన్ని సమ్మోహితులను చేసి..జాగృతం చేసి..నిద్రలోకి జారుకునేలా చేసే మహత్తు ఒక్క పాటకే ఉందనేది కాదనలేని సత్యం. తెలుగు సినిమా సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన గేయ రచయితలలో వేటూరి సుందర రామ్మూర్తి తర్వాతే ఎవరైనా. ఆ కలంలోంచి వచ్చిన ప్రతి పాటా ఓ ఆణిముత్యమే. లలితమైన పదాలతో ..అద్భుతమైన అర్థాన్ని ఇమిడేలా చేయగల సత్తా ఆయనకు మాత్రమే ఉన్నది. భౌతికంగా మనమధ్య లేక పోయినా ఆ మహానుభావుడు సృష్టించిన పాటలు అన్నీ ఇన్నీ కావు. కాశీనాథుని విశ్వనాథ్ ఓ సీత కథ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆయన కలం వెనుతిరిగి చూడలేదు. వేల పాటలు రాశారు. తొలినాళ్లల్లో పాత్రికేయుడిగా పనిచేసిన వేటూరి 8 నందులతో పాటు ఒక జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన ఘనత వేటూరిదే. సంగీత జ్ఞానాన్ని వంట బట్టించుకున్న ఆయన సినిమా పాటకు వోణీ వేయించారు. అడవి రాముడు, శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సాగర సంగమం, సప్తపది, సీతాకోక చిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం ఇలా ఎన్నో సినిమాలు ..అద్భుతమైన ..మధురమైన పాటలు మనకు అందించారు. సంప్రదాయ కవిత్వం దగ్గరి నుండి జానపద గీతాల దాకా ఆయన చేయని ప్రయోగాలు లేవు. పాండిత్యాన్ని పక్కన పెట్టి..స్పాంటేనియస్‌గా పాటలను రాయడంలో వేటూరి దిట్ట. మాతృదేవోభవ సినిమాకు ఆయన రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్న పాటకు జాతీయ పురస్కారం లభించింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వనందుకు నిరసనగా తనకు వచ్చిన అవార్డును తిరస్కరించిన భాషాభిమాని ఆయన. విశ్వనాథ్, ఇళయరాజా కాంబినేషన్‌లో వచ్చిన పాటలంటే ఆయనకు ఎంతో ఇష్టం.
సాగరసంగమం విడుదలై కొన్నేళ్లయినా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచి పోయింది. కమల్ హాసన్ విశ్వరూపం ప్రదర్శిస్తే..జయప్రద అమాకత్వపు నటన ..సంగీతపు రారాజు ఇళయరాజా అందించిన బాణీలు..పాటలు..సంగీతం..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తెలుగు సినిమా రేంజ్‌ను ఓ స్థాయికి తీసుకు వెళ్లింది. వేటూరి రాసిన పాటలు నేటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి. కొమ్మ కొమ్మకో సన్నాయి..కోటి రాగాలు ఉన్నాయి..ఏమిటి మౌనం..ఎందుకీ గానం..అంటూ రాసిన పుస్తకం పలుమార్లు ముద్రణకు నోచుకుంది. పంతులమ్మ సినిమాకు మానస వీణా మధుగీతం..మన సంసారం సంగీతం..శంకరా నాద శరీరాపరా..ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకే లాంటి పాటలు ఆయన ప్రతిభకు మచ్చుతునకలు. శేఖర్ కమ్ముల తీసిన సినిమాకు ఆయన రాసిన ఉప్పొంగెలే గోదావరి పాట ఎందరినో ఆకట్టుకుంది.
గోరింటాకు సినిమాకు ఆయన రాసిన పాట అభిమానులను కళ్లు చెమర్చేలా చేస్తాయి. అమృత సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు. మణిరత్నం వేటూరితో పాట రాయించారు. ఆ పాటను లక్షలాది మంది విన్నారు..అందులో లీనమై పోయారు. ఎంతో హృద్యంగా సాగే ఈ పాట ఇప్పటికీ ఇండియన్ చార్ట్స్‌లో టాప్ సాంగ్స్‌లలో ఒకటిగా నిలిచే ఉంది. ఈ పాట చిత్రీకరణను చాలా ఉన్నతంగా తీయడం ఒక ఎత్తయితే..దానిని మనసు పెట్టి పాడారు బాలసుబ్రమణ్యం, చిన్మయి శ్రీపాద. అదే ఏదేవి వరమో నీవు..అన్న సాంగ్. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా రెహమాన్ తీర్చిదిద్దితే..వేటూరి హాయిగా..అలవోకగా..ఆనందమయంగా ..లలితమైన పదాలతో అల్లుకు పోయేలా రాసి..మెప్పించారు. అదీ ఆయన కలానికి వున్న బలం అలాంటిది.
లైఫ్‌ను కాన్వాస్‌లో బంధించాలనుకునే వాళ్లకు..జీవితంలోని అద్భుత క్షణాలతో మమేకమై పోయే మనసుల మధ్య జరిగే సంభాషణలను పాటలోకి ఒలికించడం చాలా కష్టమైన పని. కానీ వేటూరి దానిని ఛేదించారు. మన చేతుల్లో పెట్టారు. భారతీయ సినీ జగత్తులో ఎన్నో పాటలు వచ్చి వుండవచ్చు గాక..కానీ అల్లా రఖా రెహమాన్ స్వర పరిచిన ఈ పాట మాత్రం మరిచిపోలేని జ్ఞాపకంగా తీర్చిదిద్దాడు. డైరెక్టర్ మణిరత్నం అభిరుచికి..రెహమాన్ క్రియేటివిటికి..వేటూరి కలం బలం తోడై..ఎస్పీబీ, చిన్మయిల గొంతుల్లోంచి జాలు వారిన ఈ పాట గుండెల్లో భద్రంగా చేరిపోయింది. భౌతికంగా వేటూరి మన మధ్య లేక పోవచ్చు..కానీ ఆయన రాసిన పాటలన్నీ ఒక దాని వెంట మరొకటి చుట్టుముడుతూనే ఉన్నాయి. పిల్లగాలి తెమ్మెరలా..మనసు దోచే వెన్నెలలా..వీలైతే మీరూ వినండి..గుండె పదిలమవుతుంది..మనసు తేలికవుతుంది..లైఫ్ కొత్తగా అనిపిస్తుంది. జర్నీ ఇంత ఈజీనా అనేలా చేస్తుంది. కాదనగలరా ఎవరైనా..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి