ప్రపంచాన్ని షేక్ చేస్తున్న హాట్ స్టార్..!
ఐడియాలు అందరికీ వస్తాయి. కానీ కొందరే వాటిని నిజం చేస్తారు. ఇంకొందరు వాటిని అమలు పరుస్తారు. మెదళ్లకు సాన పెడితే ..కొత్త రకంగా ..కాస్తంత భిన్నంగా జనానికి దగ్గరగా..వారి అభిరుచులకు అనుగుణంగా ప్లాన్ చేస్తే చాలు..కోట్లు పోగేసుకోవచ్చు. డాలర్లను జమ చేసుకోవచ్చు. ఇదే నయా జమానా. ఏ ముహూర్తంలో స్టార్ గ్రూపులో ఎంటరయ్యాడో కానీ ..ఆ రోజు నుంచి స్టార్ స్టామినా వరల్డ్‌లో అమాంతం పెరిగింది. వినోదం..డిజిటల్ రంగాలలో స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీలదే హవా. కోటానుకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది ఈ సంస్థ. ఇండియాలో అతి పెద్ద వినోదరంగపు వాటాను దక్కించుకుని ఇతర సంస్థలకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది.
పెట్టుబడులు ఎవరైనా పెడతారు. కానీ వాటిని లాభాల బాటలో పెట్టాలంటే దమ్ముండాలి. ఒకటా రెండా ఏకంగా వందల కోట్లు కొందరి మీద నమ్మకంతో కుమ్మరిస్తే ఎలా వుంటుందో చూడాలని వుందా..అయితే స్టార్ గ్రూపు పేరుతో సెర్చ్ చేయండి చాలు. టన్నుల కొద్దీ సమాచారం మనముందు వాలిపోతుంది. అంతలా పాపులర్ కావడం వెనుక కమిట్‌మెంట్ కలిగిన వ్యక్తుల సమూహం ఉంది. అదే ఉదయ్ శంకర్..అజిత్ మోహన్‌ల కాంబినేషన్. ఒకరు వ్యవస్థాపక ముఖ్య కార్యనిర్వహణాధికారి అయితే మరొకరు మోస్ట్ వాంటెడ్ స్టార్ ఉదయ్. వీళ్లిద్దరు స్టార్ గ్రూపును పరుగులు పెట్టిస్తున్నారు. డాలర్ల పంట పండిస్తున్నారు. వినోద రంగానికి కొత్త సొబగులు అద్ది..టెక్నాలజీని వాడుకుని జనాన్ని వినోదంలో ముంచెత్తుతున్నారు.
ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు..కొన్నేళ్లుగా వందలాది మంది తమ కలలకు ప్రాణం పోశారు. వాటిని సక్సెస్ ఫుల్ ప్లాట్ ఫారం మీదకు తీసుకు వచ్చారు వీరిద్దరు. ఆర్థికంగా నిలదొక్కు కోవాలన్నా..వేలాది మందికి ఉపాధి చూపించాలన్నా..కంపెనీని విజయపు బాటలో నడిపించాలన్నా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మార్కెట్‌ను ఆకళింపు చేసుకోవడం..ట్రెండ్‌ను అర్థం చేసుకోవడం..లేదా కొత్త ఇమేజ్ ను పెంపొందించేలా చేయాల్సి వస్తుంది. ఇదంతా వ్యాపార రంగంలో ఉన్న వారికైతే అసలు మజా ఏమిటో అర్థమవుతుంది. ఇండియన్ మార్కెట్‌లో ఇపుడు స్టార్ గ్రూపు ఏది చేసినా ఓ సంచలనమే. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో..ఎక్కడ దెబ్బ కొట్టాలో..ఎవరికి పనులు అప్పగించాలో.. ఏ సమయంలోనైనా అటాక్ చేసేందుకు వీరిద్దరు రెడీగా వుంటారు.
ఎలాంటి వత్తిళ్లకు తలొగ్గరు. ఎవరికీ సలాం కొట్టరు. ఇంకెవ్వరినీ దేబరించరు. బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం జరిగితే చాలు మార్కెట్‌లో వాటా పెంచుకోవడం ఏమంత కష్టం కాదంటారు ఓ సందర్భంలో ఉదయ్ శంకర్. జీ గ్రూపులో కొంత కాలం పనిచేసిన ఇతను ఏది చేసినా అదో రికార్డు. వినోద రంగాన్ని కింది స్థాయి దాకా తీసుకెళ్ల గలిగితే చాలంటారు. అదే ఇంప్లిమెంట్ చేస్తోంది స్టార్ గ్రూపు. ఓ వైపు సోషల్ మీడియాలో టాప్ రేంజ్‌లో ఉన్న యూట్యూబ్ కు పోటీగా హాట్ స్టార్ ను నిలబెట్టారు. ఐపీఎల్ టోర్నీలతో పాటు క్రికెట్ ఇతర క్రీడలకు పెద్ద పీట వేస్తోంది. ఇండియన్ డిజిటల్ అండ్ మొబైల్ ప్లాట్ ఫారంలో హాట్ స్టార్ ను స్టార్ గ్రూపు 6 ఫిబ్రవరి 2015లో ప్రారంభించింది. టీవీ, మూవీస్, న్యూస్, ఎంటర్ టైన్ మెంట్ విభాగాలలో లెక్కలేనన్ని వీడియోలు..ప్రత్యక్ష ప్రసారాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ప్రారంభించిన కొద్ది కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.
కంటెంట్ విషయంలో రాజీ పడక పోవడం..నాణ్యత విషయంలో డిజిటల్ టెక్నాలజీ వాడటం..ఎక్కడ కూడా స్ట్రీమింగ్ విషయంలో ఇబ్బంది లేకుండా ఉండడంతో నెటిజన్స్, ఫ్యాన్స్..కోట్లాది మంది ఫిదా అయి పోయారు. ఇండియన్ మార్కెట్‌లో ఇదో సంచలనం. హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ, మరాఠి, బెంగాళి, గుజరాత్ భాషల్లో హాట్ స్టార్ లభిస్తోంది. మహారాష్ట్రలోని ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇండియాతో పాటు అమెరికా, కెనడా, యుకెలలో స్టార్ గ్రూపు తన ప్రసారాలను అందిస్తోంది. దీనికంతటికి స్టార్ ఇండియానే కేరాఫ్. ఆన్ డిమాండ్ వీడియో స్ట్రీమింగ్ పేరుతో హాట్ స్టార్ వినోదాన్ని పంచుతోంది. నోవి డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో రిజిష్టర్ చేశారు. 2015లో క్రికెట్ వరల్డ్ కప్ ను ప్రత్యక్షంగా మొబైల్ అప్లికేషన్స్ ద్వారా ప్రసారం చేసింది స్టార్ గ్రూప్. దీంతో హాట్ స్టార్ హాట్ టాపిక్ గా మారి పోయింది.
వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఫైర్ టీవి, ఆపిల్ టీవి ప్లాట్ ఫార్మ్స్‌లలో లభ్యమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కంటెంట్ తో పాటు వీడియోలను ఒక మిలియన్ కు పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. వరల్డ్ డిజిటల్ రంగంలో ఇదో రికార్డు. ఇదంతా కేవలం ఆరు రోజుల్లో జరిగింది. మరో పది రోజుల్లో అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. 17 భాషల్లో లక్ష గంటలు అప్ లోడ్‌తోనే సరిపోయింది. సెప్టెంబర్ 2017లో స్టార్ ఇండియా వరల్డ్ వైడ్ ఐపీఎల్ మీడియా రైట్స్‌ను టీవీ, డిజిటల్ బ్రాడ్‌కాస్ట్ ద్వారా ప్రసారం చేసేందుకు ఐదేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. 2018 నుండి 2022 దాకా స్టార్ గ్రూపే చూస్తుంది.14 కంపెనీలు బిడ్డింగ్ లో పాల్గొన్నాయి. ఎవరూ నమ్మశక్యం కాని రీతిలో..కేంద్ర సర్కార్..బీసీసీఐ మూర్ఛపోయేలా ఉదయ్ శంకర్ 16, 347.5 కోట్లకు ప్రసార హక్కులను చేజిక్కించుకునేలా చేశాడు.
158 శాతం మీడియా పరంగా పెరిగింది. 2017లో ప్రీమియం సర్వీస్ కింద యుఎస్ఏతో పాటు కెనడాలలో ఐఓఎస్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లలో లభించేలా స్టార్ట్ చేసింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ప్రసారాల కోసం 340 మిలియన్ వ్యూవర్స్ ఈ యాప్‌ను ఉపయోగించారు. 49 మ్యాచ్‌లను వీక్షించారు. 200 మిలియన్లకు చేరుకుంది. పేరొందిన వంద కంపెనీలు తమ ప్రకటనలు హాట్ స్టార్‌కు అప్పజెప్పారు. కంటెంట్ ను స్వంతంగా స్టార్ గ్రూపు క్రియేట్ చేస్తుంది. ప్రకటనల ద్వారానే కోట్లాది రూపాయల ఆదాయం స్టార్ గ్రూప్‌నకు దక్కుతోంది. ఐపీఎల్ 2019 మ్యాచ్‌లన్నీ హాట్ స్టార్‌లో లభ్యమవుతున్నాయి.
క్రికెట్ కాకుండా సినిమా, మూవీస్, న్యూస్ ను కూడా అందిస్తోంది. ఇప్పటికే డిజిటల్ మీడియాలో దుమ్ము రేపుతున్న నెట్ ఫ్లిక్స్, అమెజాన్ , యూట్యూబ్‌లకు ధీటుగా హాట్ స్టార్‌ను నిలబెట్టారు. టచ్ చేస్తే చాలు ఇలా ప్రత్యక్షమయ్యేలా జనాన్ని ఆకట్టుకుంటోంది. ఆలోచనలు రిచ్‌గా ఉంటే..విజయం అంత గొప్పగా ఉంటుందన్నది స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను చూస్తే తెలుస్తుంది. సో ..ఇంకెందుకు ఆలస్యం..మీరూ ఆలోచించండి ..కొత్తగా..ప్రపంచం విస్తు పోయేలా. పోయేదేముంది..ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందేమో ..ట్రై చేయండి...!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి