సద్గురుతో సంభాషణం..జీవితం ఆనందమయం..!
ఇపుడంతా యోగుల కాలం. ఆధ్యాత్మికవేత్తల అడుగు జాడలతో భారతదేశం పునీతమవుతోంది. ఓ వైపు యుద్ధపు మేఘాలు కమ్ముకుంటున్నా..మరో వైపు భక్తి ప్రపత్తులు యధాలాపంగా కొనసాగుతూనే వున్నాయి. పుణ్యక్షేత్రాలు వేద మంత్రాలతో పునీతమవుతున్నాయి. యోగా..ధ్యానం ..జీవితం..ఆనందమయం కావడానికి ఎన్నో ప్రయోగాలు..మరెన్నో అడుగులు నిరాటంకంగా కొనసాగుతూనే వున్నాయి. ఈ స్థలం ఎందరికో నీడనిచ్చింది. మరికొందరికి బతుకునిచ్చింది. ప్రపంచానికి మార్గదర్శనం చేస్తూనే..నిరంతరం ఇబ్బందులకు గురి చేసే కాలాన్ని ఎలా ఒడిసి పట్టుకోవాలో..జీవితాన్ని ఎలా సంతోషమయంగా మార్చుకోవాలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా వినుతికెక్కిన జగ్గీ వాసుదేవన్ ఆచరణాత్మకంగా చూపిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ రోగాల బారిన పడతాం. లేవాలన్నా..నడవాలన్నా ఎన్నో ఇబ్బందులు..మానసికంగా..శారీరకంగా కష్టాలు..వీటన్నింటిని కాదని ఆయన పిల్లాడిలా గెంతుతారు..ఆడతారు..పాడతారు..క్లిష్టమైన సమస్యలను ఎలా అధిగమించాలో చెబుతారు.
జగ్గీతో మాట్లాడుతూ వుంటే ప్రపంచాన్ని మరిచి పోతాం. మనం మన నుండి దూరమై పోతాం..కల్మషం లేని లోకపు దారుల్లో విహరిస్తాం. కొన్నేళ్లుగా ధ్యానం..యోగను సమ్మిళితం చేసి స్వానుభవంలోకి ఎలా తెచ్చుకోవాలో క్రియాత్మకంగా నిరూపిస్తున్నారు సద్దురు. పలు భాషల్లో ప్రావీణ్యుడైన ఈ యోగితో సంభాషణ మనల్ని చైతన్యవంతులుగా మార్చేస్తుంది. యోగిగా, మార్మికులుగా ..ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా సుప్రసిద్దులు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడిచే ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా, శ్రీలంక తదితర దేశాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఐక్య రాజ్య సమితి ఆర్థిక, సామాజిక సంస్థకు ప్రత్యేక సలహాదారుగా నియమించింది. శ్రీ జగ్గీ వాసుదేవన్ చేస్తున్న ఇతోధిక సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మ విభూషన్ పురస్కారాన్ని అందజేసింది.
కర్ణాటకలోని మైసూరు నగరంలో 3 సెప్టెంబర్ 1957లో తెలుగు కుటుంబంలో జన్మించారు జగ్గీ. తండ్రి కంటి వైద్య నిపుణులు. వృత్తి రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ వచ్చారు. చిన్నతనం నుండే వాసుదేవన్‌కు ప్రకృతి అంటే ఎనలేని ప్రాణం. అడవి అంటే అంతులేని అభిమానం. రోజుల తరబడి అక్కడే ఉండడం చేసేవారు. జగ్గీకి 11 ఏళ్లప్పుడు మల్లాడి హళ్లి శ్రీ రాఘవేంద్ర స్వామి యోగాసనాలు నేర్పించారు. అప్పటి నుండి ఆయన జీవితం ఆధ్యాత్మిక రంగం వైపు మల్లేలా చేసింది. గురువుతో నేర్చుకున్న ఆసనాలను వాసుదేవన్ ప్రతి రోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేశారు. ఆ సాధనే జగ్గీని సద్గురుగా మార్చేసింది. బడి చదువు పూర్తయ్యాక..మైసూర్ విశ్వ విద్యాలయంలో ఇంగ్లీష్ మాధ్యమంలో డిగ్రీ పొందారు. మోటార్ సైకిల్‌ను నడిపించడం అంటే మక్కువ. తరుచూ స్నేహితులతో కలిసి మైసూర్ పట్టణ సమీపంలో ఉన్న చాముండీ కొండలపై షికారుకు వెళ్లారు. పలు ప్రాంతాలు పర్యటించడం..అక్కడి ప్రకృతి సోయగాలను ఆస్వాదించడం చేస్తూ వచ్చారు.
ఇలా ఒకసారి వెళుతుండగా భారత్ - నేపాల్ సరిహద్దులో పాస్‌పోర్టు లేక పోవడంతో ఆపేశారు. ఆ అనుభవం కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా..పర్యటించాలంటే కాసులు కావాల్సిందేనన్న వాస్తవాన్ని గుర్తించారు. పౌల్ట్రీ ఫాం, ఇటుకల తయారీ, భవన నిర్మాణం వంటి అనేక లాభదాయకమైన వ్యాపారాలు ప్రారంభించారు జగ్గీ. 25 ఏళ్ల వయసులో ఆయనకు జ్ఞానోదయం అయింది. ఆయన మాటల్లోనే.. ఆ క్షణం వరకు ఇది నేను..అది మరొకరు అనుకునే వాడిని. కానీ ఆ క్షణంలో మొదటిసారిగా ..నేను ఏదో..నేను కానిదేదో నాకు తెలియలేదు. అంతా నేనే అనిపించింది. నేను పీలుస్తున్న గాలి, నేను కూర్చున్న బండ ..నా చుట్టూ ఉన్న వాతావరణం..ప్రతిదీ నేనుగా అయి పోయింది. నాకు మామూలు స్పృహ వచ్చే సరికి..పదిహేను నిమిషాలు పట్టినట్టు అనిపించింది..కానీ నాలుగున్నర గంటలు గడిచింది..కళ్లు తెరుచుకునే ఉన్నాయి..పూర్తి తెలివిగానే ఉన్నా..కానీ సమయం మాత్రం అలానే గడిచి పోయింది..అంటూ చెప్పుకొచ్చారు సద్దురు.
ఆరు వారాల తర్వాత..జగ్గీ వాసుదేవన్ తన వ్యాపారాలన్నీ స్నేహితులకు వదిలేశారు. తనకు కలిగిన అనుభవ అంతరార్థాన్ని తెలుసుకునేందుకు విస్తృతంగా పర్యటించారు. సంవత్సర కాలం తిరిగాక వచ్చిన అనుభవంతో..యోగా బోధించాలని నిర్ణయించుకున్నారు . 1983లో మైసూరులో ఏడుగురితో మొదటిసారిగా యోగా తరగతులు ప్రారంభించారు. ఇటు కర్ణాటకలోను..అటు హైదరాబాద్‌లోను ఏకకాలంలో స్టార్ట్ చేశారు. తన పౌల్ట్రీ ఫారంపై వచ్చే అద్దెతో జీవితం గడుపుతూ..క్లాసులకు ఎలాంటి పారితోషకం తీసుకోకుండా బోధించారు. ఎవరైనా ఇస్తే ఆ డబ్బులను స్వచ్చంధ సంస్థలకు ఇచ్చేవారు. యోగా క్లాసులకు ఈశా అని నామకరణం చేశారు జగ్గీ. 1989లో కోయంబత్తూరులో మొదటి క్లాసు నిర్వహించారు. దీని సమీపంలోనే ఈశా యోగా సెంటర్ ఏర్పాటైంది. తరగతుల్లో ఆసనాలు, ప్రాణామయ క్రియలు, ధ్యానం బోధించారు.
1993లో ఆధ్యాత్మిక సాధకుల రాక పెరగడంతో వారి కోసం ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా, తదితర ప్రాంతాలన్నీ తిరిగారు. వాటిలో ఏదీ నచ్చలేదు. చివరకు కోయంబత్తూరు నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెళ్లంగిరి పర్వత పాదాల చెంద 13 ఎకరాల స్థలంలో ఈశాకు ప్రాణం పోశారు. 1994లో సెంటర్ లో ధ్యాన లింగంను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అదో యోగాలయంగా, ధ్యానం స్థలంగా..తన గురువు తనకు నిర్దేశించిన తన జీవిత లక్ష్యంగా దానిని పేర్కొన్నారు జగ్గీ వాసుదేవన్. 1996లో ప్రారంభమై ధ్యాన లింగం 1999 జూన్ 23న పూర్తయింది. కాంక్రీటు, స్టీలు ఉపయోగించకుండా ఇటుక రాళ్లు, సున్నంతో 76 అడుగుల గోపురం, గర్భ గుడిని ఏర్పాటు చేశారు. ధ్యాన లింగం 13 అడుగుల 9 అంగుళాల ఎత్తైన సాంధ్రత కలిగిన నల్ల గ్రానైట్‌తో చేశారు.
ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సర్వ ధర్మ..స్తంభం..హిందూ..ఇస్లాం,..క్రైస్తవ..జైన్..టావో..జొరాస్టియన్..జుడాయిజం..షింటో..బౌద్ద మతాల గుర్తులతో..అన్ని మతాల ఏకత్వాన్ని చాటుతూ అందరికీ స్వాగతం పలుకుతోంది. లాభాపేక్ష లేకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈశా ఫౌండేషన్‌ను 1992లో స్థాపించారు. మానవుల్లో దాగి వున్న అంతర్గత చైతన్యాన్ని పెంచే విధంగా చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్‌తో కలిసి పనిచేస్తోంది.
పర్యావరణాన్ని కాపాడేందుకు సద్గురు ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ అనే పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2010లో జగ్గీ చేసిన సేవలను గుర్తించిన కేంద్ర సర్కార్ ఇందిరా గాంధీ పర్యావరణ్ పురస్కార్‌ను ప్రకటించింది. తమిళనాడులో 10 శాతం పచ్చదనం పెంచాలనేది దీని లక్ష్యం. ఇప్పటి దాకా 20 లక్షల కార్యకర్తల సాయంతో 82 లక్షలకు పైగా మొక్కలు నాటారు. 2003 నుండి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పేద ప్రజల ఆరోగ్య, జీవన ప్రమాణాలను పెంచేలా చేస్తున్నారు. వైద్య శిబిరాలు, యోగా , పర్యావరణ, సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. సామూహిక క్రీడలు నిర్వహించారు. 54 వేల గ్రామాల్లోని 7 కోట్ల మంది గ్రామీణులకు ప్రయోజనం కలిగింది. 4200 గ్రామాలలో 70 లక్షల మందికి సాయం అందింది. ఏడు పాఠశాలలను ఈశా దత్తత తీసుకుంది.
సామాజిక అభివృద్ధి కోసం సునిశిత దృష్టితో సద్గురు రూపొందించిన ఈశా విద్యా కార్యక్రమం గ్రామీణ పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందించే ప్రయత్నం చేస్తోంది. మెట్రిక్యులేషన్ సిలబస్‌తో కంప్యూటర్స్, సంగీతం, కళలు, యోగా, వృత్తి విద్యలు కూడా నేర్పిస్తోంది. ఏడు విద్యాలయాల్లో 3 వేల మంది చదువుకుంటున్నారు. ఆశ్రమంలో యోగా క్లాసులు తీసుకుంటూనే ఆధ్యాత్మిక జలధారను పరిచయం చేస్తూ వచ్చారు సద్గురు. 1996లో భారత హాకీ జట్టుకు యోగా బోధించారు. 1997 నుండి అమెరికాలో..1998 నుంచి తమిళనాడు జైళ్లలో జీవిత ఖైదీలకు యోగా తరగతులు నిర్వహించారు. ఈశా అంటే దివ్యమైన నిరాకార స్వరూపం అని అర్థం. దీని ముఖ్య ఉద్దేశం..ఇన్నర్ ఇంజనీరింగ్.. దీని ద్వారా వ్యక్తులకు ధ్యానం, ప్రాణామయం, శాంభవి మహా ముద్రను నేర్పిస్తారు. వీటి ద్వారానే ఇంక్లూసివ్ ఎకనామిక్స్ పరిచయం చేస్తున్నారు.
ఆర్థిక రంగంలో కరుణను..అంతా మన వారే అన్న భావనను ఇందులోకి చేర్చారు జగ్గీ. తమిళనాడు, కర్ణాటకలలో మహా సత్సంగాలు చేపడతారు. వీటిలో ప్రవచనాలు, ధ్యానాలు, శ్రోతలు, భక్తులతో సంభాషణలు, ప్రశ్నోత్తరాలు ఉంటాయి. చెట్టు నాటడాన్ని ప్రోత్సహించేలా ఉంటాయి. ప్రతి ఏటా సాధకులను కైలాస మానస సరోవర, హిమాలయాల యాత్రలకు తీసుకు వెళతారు. 2010లో 514 మందితో కైలాస యాత్ర చేపట్టారు. 2005లో అమెరికాలో ఈశా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్ నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక చైతన్యం తీసుకు వచ్చేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 2008లో 39000 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన మహిమ ధ్యాన మందిరాన్ని ఇక్కడే నెలకొల్పారు. లింగ భైరవిని స్థాపించారు. 2001లో ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి సమావేశాలలో..2006, 2007, 2008, 2009 సంవత్సరాలలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులలో జగ్గీ వాసుదేవన్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ప్రపంచానికి శాంతి కావాలంటూ కోరారు.
పర్యావరణ, రక్షణ రంగంలో ఎనలేని కృషి చేసినందుకు గాను సద్గురును 2012లో భారతదేశపు 100 మంది అత్యంత ప్రముఖ వ్యక్తులను ప్రకటించారు. అందులో జగ్గీ కూడా ఒకరుగా ఉన్నారు. ఒన్ ద మూవీ డాక్యుమెంటరీ ఆయనపై చిత్రీకరించారు. వరల్డ్ మోస్ట్ స్పిరిచ్యువల్ గురుగా సద్గురు విశ్వ వ్యాపితం అయ్యారు. ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన సంభాషణలు కోట్లాది మందికి స్ఫూర్తి కలిగిస్తున్నాయి. ఏపీ సీఎం తక్కువ ధరకే సద్గురుకు చెందిన ఈశాకు స్థలం కట్టబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. మొత్తం మీద ధ్యానం..యోగా..ఆధ్యాత్మికం మార్గాలతో లైఫ్‌ను మరింత బ్యూటిఫుల్‌గా మార్చేందుకు జగ్గీ కృషి చేస్తున్నారు. ఈ డివోషనల్ జర్నీ మరింత విస్తృతం కావాలని..సద్గురు ఇలాగే చైతన్యవంతంతో జనాన్ని జాగృతం చేయాలని ఆశిద్దాం..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి