హృదయ సమీరం - పాటల తరంగం.. !
సినీ జగత్తులో అతడో పాటల కెరటం. ఉత్తుంగ తరంగమై అల్లుకు పోయాడు. గుండె నుంచి గుండెల్లోకి ప్రవహిస్తూనే వున్నాడు..అతడే తన పాటలతో జగత్తును వెలిగించిన చెలికాడు..పాటల విద్వత్తు సమీర్. చెప్పుకుంటూ పోతే ఈ కాలం సరిపోదు. జీవితాన్ని వెలిగించేది కవిత్వమే. రోజూ చదవకుండా ..రాయకుండా వుండలేక పోవడంలోనే వుంది అసలైన మజా. సాహిత్యంలో కవికే ప్రయారిటీ ఎక్కువ. ఎలాగైనా ఆవిష్కరించే అవకాశం ఇందులోనే తప్పా మరెక్కడా లభించదు. ప్రతి వాళ్లు కవులు కావాలని..పేరు తెచ్చు కోవాలని..తమకు గుర్తింపు రావాలని ఆరాట పడతారు. కానీ అది దేవుడు మనిషికి ఇచ్చిన అద్భుత వరం. కొందరికి ఆ ప్రతిభ పుట్టుకతో వస్తే..మరికొందరికి కష్టపడితే రాయగలిగే స్థితికి చేరుకుంటారు. సాహిత్యం..కవిత్వం..పాటల సంచారం ఈ మూడు ఒకదానికొకటి పెనవేసుకుని వుంటాయి. కొంచెం ప్రయత్నం చేస్తే కవులై పోతారేమో కానీ..గేయ రచయితలు కావాలాంటే చాలా సాధన చేయాలి. అహోరాత్రులు శ్రమించాలి. నిద్రహారాలు మానుకోవాలి.
ఒక్కోసారి పిచ్చెక్కినట్టు అనిపిస్తుంటుంది. సినిమా రంగం అంటేనే అదో అంతుచిక్కని రహస్యం. ఒకే రోజులో స్టార్ డమ్ వచ్చే రంగం ఇది. అందుకే ప్రతి ఒక్కరు ఒక్కసారి ఎంటర్ అయితే చాలు..ఇక బయటకు రారు. ఒకవేళ రావాలని అనుకున్నా ఆ రంగంలో ఉన్న గుర్తింపు..పలకరింపు..ఛాన్సెస్ రాకుండా చేస్తాయి. దర్శకుడి ఆలోచన..నిర్మాత టేస్ట్‌కు అనుగుణంగా పాటలు రాయాల్సి ఉంటుంది. ఇదో మహా యజ్ఞం. చిన్న చిన్న పదాలు..అప్పటికప్పుడే కలాన్ని ఝులిపించాలి. ఏ మాత్రం ప్రూవ్ చేసుకోలేక పోతే ..ఇంకొకరు వచ్చేస్తారు. ఈ ప్లాట్ ఫారంపై ఎందరో వేచి చూస్తుంటారు. కొన్నేళ్లుగా క్యూ పెరుగుతూనే ఉంటుంది. ఎక్కడా తగ్గరు. రోజుకు వందల సినిమాలు విడుదలవుతూ వుంటాయి. కానీ కొందరికి మాత్రమే అవకాశాలు లభిస్తాయి. తెర ముందు కనిపించేది కొందరే..కానీ తెర వెనుక మాత్రం వందలాది మంది తమ శ్రమను ధారపోస్తారు. ప్రతి సినిమాకు సినిమాలు, సంగీతం కీలక భూమిక పోషిస్తాయి.
పాటలు రాయడం అంటే మరో జన్మ ఎత్తినంత కష్టం. ఒక్కసారి హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు రైటర్స్ కు చెప్పలేనంత గౌరవం లభిస్తుంది. సినిమా ఫీల్డ్‌లో టాలెంట్, కంటెంట్ వున్న వాళ్ల కోసం చూస్తోంది. ఎంత ఖర్చయినా పర్వాలేదు..నాణ్యత విషయంలో..స్టోరీ లైన్ జనాన్ని థియేటర్లకు రప్పించేలా ఉండాలన్నది ప్రొడ్యూసర్స్ నియమంగా పెట్టుకున్నారు. ఇదంతా అతి పెద్ద జూదం. ఇందులో కొందరు వీధి పాలవుతారు.మరికొందరు ఐకాన్స్‌గా నిలబడతారు. లెక్కలేనంత ప్రచారం. హీరో, హీరోయిన్ల హవా నడుస్తోంది. వారిని దృష్టిలో పెట్టుకుని ఇపుడు పాటలు రాయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి చోటా పోటీ నెలకొన్న సందర్భంలో హిందీ సినీ ప్రపంచాన్ని తన పాటలతో ఉర్రూత లూగించాడు సమీర్ అంజాన్. 24 ఫిబ్రవరి 1958లో జన్మించాడు. ఏక కాలంలో ఒకే ఏడాదిలో ఎక్కువ పాటలు రాసిన గీత రచయితగా ప్రపంచంలోనే రికార్డు సృష్టించాడు. 17 ఫిబ్రవరి 2016లో అవార్డు పొందారు. సమీర్ తండ్రి లాల్జీ పాండే అలియాస్ అంజాన్ కూడా సుప్రసిద్ధమైన సాంగ్స్ రైటర్. సమీర్ అసలు పేరు శీతల పాండే. నిక్ నేమ్ రాజన్. యుపీలోని బనారస్ స్వంత స్థలం. బెనారస్ హిందూ యూనివర్శిటీలో ఎంకాం చేశాడు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్‌గా జాయిన్ అయ్యాడు. అక్కడ వుండలేక పోయాడు..సమీర్. ఇది నా ప్రపంచం కానే కాదు. నేను ఏదో చేయాల్సి వుంది. ఈ రంగం నాకు కరెక్ట్ కాదంటూ పాటల రచయితగా స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. పాటలు రాసేందుకని 1980లో ముంబయిలో కాలు పెట్టాడు సమీర్. అష్టకష్టాలు పడ్డాడు..తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని కోరాడు. మూడేళ్లు ఆగాక 1983లో బేఖబర్ సినిమాకు పాటలు రాశాడు. 1984లో బోజ్‌పూరి సినిమా బైరి సావన్ కు రాశాడు. ఈ పాటల్ని సురేష్ వాడ్కర్ పాడారు. 1990లో సమీర్ కలం రికార్డులను తిరగ రాసేలా చేసింది. అద్భుతమైన పాటలకు జీవం పోశాడు. ఒక్కో సాంగ్ భారీ హిట్ గా నిలిచేలా చేసింది. సింగిల్ సాంగ్ రాసే స్థాయి నుంచి ఏకంగా సినిమాలన్నింటికి మొత్తం పాటలు రాసే స్థాయికి చేరుకున్నాడు సమీర్. ఇదే ఏడాది మొత్తం సమీర్ పాటలతో నిండి పోయింది. ప్రతి సినిమా విజయంలో సమీర్ పాటలే కీలకంగా మారాయి.
దిల్, ఆషిఖి సినిమాలు అందనంత ఎత్తులో ఉంచాయి. ఈ పాటలకు గాను సమీర్ ఉత్తమ గేయ రచయితగా ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకున్నారు. నజర్ కే సామ్‌నే ..జిగెర్ కే పా..ఇలాంటి పాటలు ఎన్నో ఆయన కలం నుండి జాలు వారాయి. జనాన్ని మంత్రముగ్ధులను చేశాయి. 500 సినిమాలకు గాను.. ఏకంగా 4000 వేల పాటలకు పైగా రాశాడు. మజ్రూ సుల్తాన్ పురి, ఆనంద్ భక్షి లతో పాటు తన తండ్రి అంజాన్ తనకు స్ఫూర్తినిచ్చాయని ఓ సందర్భంలో సమీర్ వెల్లడించారు. 1993, 1994 సంవత్సరంలో వరుసగా బెస్ట్ లిరిసిస్ట్‌గా పురస్కారాలు అందుకున్నారు. తేరి ఉమ్మీద్..తేరా ఇంతెజార్ సాంగ్ టాప్ టెన్‌లో ఒకటిగా నిలిచింది. దీవానా సినిమాలోనిది ఈ పాట. హమ్ రహీ ప్యార్ కే మూవీలోని గుంఘట్ కి ఆద్ సాంగ్ కూడా పాపులర్ అయ్యింది. 1998లో జీ సినీ అవార్డు లభించింది. కుచ్ కుచ్ హో తా హై సినిమాకు టైటిల్ సాంగ్ తో పాటు బేటా, సాజన్, రాజాబాబు, కూలీ నెంబర్ 1, రాజా హిందూస్థానీ, అంజాన్, ఫిజా, ధడ్కన్, కభీ ఖుషి కభీ గమ్, దేవ్‌దాస్, రాజ్, దిల్ హై తుమ్హారా, ఇష్క్ విష్క్, తేరే నామ్, అసంభవ్, ఫిదా, నో ఎంట్రీ, అక్సర్, ధూమ్ 2 , సావరియా, రేస్, దమాదమ్, హౌస్ ఫుల్ 2, రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్, దబంగ్ 2 ..ఇలా ఎన్నో సినిమాలకు పాటలు అందించాడు.
ఈ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగించాయి. ఇందులో సమీర్ దే కీలక భూమిక. ఎంతో మంది సంగీత దర్శకులు ఉన్నప్పటికీ సమీర్ ఎక్కువగా నదీం శ్రవణ్‌లకు రాశాడు. 950కు పైగా పాటలు అందించారు. వీరితో పాటే ఆనంద్ మిలింద్, రాజేష్ రోషన్, ఉత్తమ్ సింగ్, ఇళయరాజా, జతిన్ లలిత్, దిలీప్ సేన్ సమీర్ సేన్, నిఖిల్ వినయ్, అను మాలిక్, ఆదేశ్ శ్రీవాస్తవ, ఆనంద్ రాజ్ ఆనంద్, విజూ షా, ఏ ఆర్ రెహమాన్, విద్యాసాగర్, హిమేష్ రేషమ్మియా, ఇస్మాయిల్ దర్బార్, మణిశర్మ, శంకర్ - ఈశాన్ - లాయ్, సాజిద్ వాజిద్, సంజీవ్ దర్శన్, సచిన్ జిగర్ , అద్నాన్ సమిలకు కూడా పాటలు రాసిన ఘనత సమీర్ కే దక్కింది. 2007లో పాటల కెరటం సమీర్ రాసిన పుస్తకాన్ని బిగ్ బి అమితాబ్ రిలీజ్ చేశాడు. లెక్కలేనన్ని అవార్డులు సమీర్ పొందారు. 2008లో బెస్ట్ రచయితగా సావరియా సినిమాకు గాను ఆయన రాసిన జబ్ సే తేరే నైనా సాంగ్ నామినేట్ అయ్యింది. 2006లో ఆషిక్ బనాయా ఆప్నే సాంగ్, 2004లో తేరే నామ్ నామినేట్ అయింది.
అదే ఏడాది కిసీసే తుమ్ ప్యార్ కరో సాంగ్, 2003లో రాజ్ సినిమాకు గాను ఆప్ కే ప్యార్ మే, 2001లో తుమ్ దిల్ కీ ధడ్కన్ మే, 1999లో కుచ్ కుచ్ హో తా హై మూవీకి గాను తుమ్ పాస్ ఆయే, లడ్కీ బడీ అంజానీ హై, 1997లో పర్ దేశి పర్ దేశి జానా నహీ సాంగ్, 1995లో యే దిల్లగీ సినిమాకు గాను ఓలే ఓలే సాంగ్, 1993లో తేరి ఉమ్మీద్ తేరా ఇంతేజార్ , ఐసీ దీవాంగి, 1992లో మేరా దిల్ భి సాంగ్ హిట్ పెయిర్‌గా నిలిచాయి. నా జానే కహా దిల్ ఖో గయా సాంగ్ , పహిలీ నజర్ మే, జబ్ సే తేరే నైనా, ఆషిఖ్ బనాయా ఆప్ నే, క్యోం కిసీ కో, మై యహా తూ వహా, దిల్ నే యే కహా హై, తుమ్ దిల్ కీ ధడ్కన్ మే పాటలు దుమ్ము రేపాయి. ఇలా లెక్కలేనన్ని పాటలు ఇప్పటికీ టీవీలలో..రేడియోలలో వినిపిస్తూనే వుంటాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చెరిగిపోని ముద్రను వేశాడు సమీర్. ఒకటా రెండా వేలాది పాటలు అలా అలవోకగా వచ్చాయి. కొంత కాలం పాటు రాసి తెరమరుగయ్యే పరిస్థితుల్లో ఇప్పటికీ తన కలం తాజాగానే ఉందని నిరూపిస్తున్నారు సమీర్ అంజాన్. మన కాలంలో ఇలాంటి చేయి తిరిగిన గేయ రచయిత ఉన్నందుకు మనమంతా అదృష్టవంతులమనే అనుకోవాలి...!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి