కార్పొరేట్ ప్రపంచం..బతుకు పాఠం - మథురా మజాకా ..!
అంతు చిక్కని ఆలోచనలు..కళ్లు చెదిరే భవంతులు..వాటి వెనకాల ఎన్నో మెదళ్లు పోట్లాడుతుంటాయి. నిద్రహారాలు మాని నెంబర్ వన్ పొజిషన్ దక్కించు కోవాలో.ప్రత్యర్థి కంపెనీలకు చిక్కకుండా మార్కెట్‌లో ఎలా రాణించాలో..నాయకత్వానికి..విజయానికి మధ్య ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయి..ఎలాంటి ప్లాన్స్ అమలు చేస్తారు..ఇవ్వన్నీ తెలుసు కోవాలంటే కార్పొరేట్ సినిమా చూడాల్సిందే. డైనమిక్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఏ ముహూర్తంలో ముంబయిలో హిందీ సినీ ఫీల్డ్ లోకి ఎంటరయ్యాడో ఆ రోజు నుండి క్రియేటివిటీకి కొదవ లేకుండా పోయింది. ఆయన టీంలోని సభ్యుడే మథుర్ భండార్కర్. ఎక్కడెక్కడో ఉంటూ..అవకాశాలు రాక ..వేధింపులు భరించలేక ..అపరిమితమైన టాలెంట్ వుండీ ..వాడుకోలేక..తల్లడిల్లుతున్న సమయంలో వర్మ దిక్సూచిలా మారాడు. ఎందరికో నీడ నిచ్చాడు. క్రియేటివిటీ..కమిట్‌మెంట్..కరేజ్ ..కలిగిన వాళ్లకు చోటిచ్చాడు. వాళ్ల వెనుక ఉన్నాడు. ధైర్యాన్ని ఇవ్వడమే కాదు ..తెగువను ఎలా ప్రదర్శించాలో నేర్పించాడు.
ఇండియన్ సెల్యూలాయిడ్ మీద చెరగని ముద్ర వేసేలా ప్రతి టెక్నిషియన్‌ను తీర్చిదిద్దాడు ఆర్‌జీవి. చూడటానికి అన్నీ అందంగానే కనిపిస్తాయి. అందాల ఆరబోతలు..హొయలొలికించే అప్సరసలు..వారెవ్వా అనుకునేలా మోడల్స్..లెక్కలేనంత మంది..అందగత్తెలు..ప్రతి కార్పొరేట్ కంపెనీలో దర్శనం ఇవ్వడం మామాలే. కంపెనీలను స్థాపించడం వేరు..కార్పొరేట్ కంపెనీలుగా సక్సెస్‌ఫుల్‌గా నడిపించడం వేరు. కథంతా ఇక్కడే వుంది. కార్పొరేట్ వ్యవస్థ ఎలా వుంటుందో కళ్లకు కట్టినట్టు చూపించిన ఘనత మథుర్ భండార్కర్ దే. ఈ సినిమా ఏకంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పాఠ్యాంశాల్లోకి ఎక్కింది. అంటే ఈ సినిమా ఎంత పవర్ ఫుల్ గా తీసారో అర్థమై పోతుంది. కనిపించేదంతా అందం కాదు..కనిపించనిదంతా అక్కరకు రాదన్న అపప్రదను తొలగించేందుకు దర్శకుడు ప్రయత్నం చేశాడు. వేలాది మంది అఫీసియల్స్..అనఫిసీయల్స్‌తో పాటు అన్ని రంగాలలో ఆరితేరిన అనుభవజ్ఞులు కొలువుతీరి వుంటారు. ఎవరు ఏ స్థాయిలో వున్నప్పటికీ అన్ని కంపెనీల యాజమాన్యాలన్నీ ఒకే రీతిన వ్యవహరిస్తుంటాయి.
పక్కా వ్యాపారమే..ఒక్క రూపాయిని మార్కెట్‌లో పెట్టుబడి పెడితే వేయి రూపాయలు ఎలా సంపాదించాలో చేయడం వీరి పని. అందుకే కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తాయి..మరికొన్ని షేర్స్‌తో పాటు వేతనాలు ఇస్తాయి. ఇంకొన్ని పర్మినెంట్‌గా వుంచేసుకుంటాయి. ఇక్కడ నిర్ణయాత్మక శక్తి అంతా కీలక బాధ్యతలు నిర్వహించే చైర్మన్, ఎండీ, సిఇఓల మీదే ఆధారపడి ఉంటాయి. వీరు తీసుకునే నిర్ణయాలు అటు మార్కెట్ ను ఇటు సొసైటీని ప్రభావితం చేస్తుంటాయి. ఒక్కోసారి కోట్లు కుమ్మరిస్తే..మరో సారి ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. అందుకే పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఏ ఒక్క నిర్ణయం తప్పుగా ఉన్నా కోట్లు పోయేదేమో కానీ..కొన్నేళ్లుగా భద్రంగా కాపాడుకుంటూ వస్తున్న కంపెనీ ఇమేజ్ దెబ్బతింటుంది. ప్రతి సారి డిసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కంపెనీ బోర్డు మీటింగ్‌లో చర్చకు పెడతారు. ఇదంతా గోప్యంగా ఎంతో పద్ధతిగా జరుగుతూ వుంటుంది. దీని వెనుక అంతులేని శ్రమ నిక్షిప్తమై వుంటుంది.
కత్తులు లేకుండా..తూటాలు ఉపయోగించకుండా..రక్తపు చుక్క పడకుండా..అతిరథ మహారథులు తమ కలలకు రెక్కలు తొడుగుతారు. వాటిని ఆచరణలో తీసుకు వస్తారు. దీని వల్ల కోట్లు మిగిలి పోతాయి. అంతేనా వేలాది మందికి ప్రత్యక్షంగా..పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ప్రతి అడుగు విలువైనదే..ప్రతి నిమిషం ప్రమాదమైనదిగా భావిస్తారు. ఒకరకంగా తొంగి చూస్తే ప్రతి కంపెనీకి ప్రత్యేకమైన పాలసీ ఉంటుంది. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అనిపించేలా భవంతులలో అంతా అందంగా..సంతోషంగా ఉందని మనం భావిస్తాం. కానీ అక్కడ ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నా..లోలోపట అంతులేని యుద్ధం చేస్తూనే వుంటారు. ఇదంతా కార్పొరేట్ కంపెనీల మధ్య నిరంతరం జరిగే అంతర్యుద్ధం. పైకి కనిపించే సిస్టం వేరు..కానీ లోపల జరిగే తతంగం వేరు. దీనిని అర్థం చేసుకోవాలంటే కొన్నేళ్లు పడుతుంది. లాభాలు ఎలా గడిస్తారు...కోట్లు ఎలా ఖర్చు పెడతారు. పెట్టుబడులు ఎలా ఆకర్షిస్తారు..ప్రమోటర్స్‌ను ఎలా సంతృప్తి చెందేలా చేస్తారు..షేర్లు ఎలా కేటాయిస్తారు..ఏమేం విభాగాలను మేనేజ్ చేస్తారు. అంతిమంగా సక్సెస్ బాటలో ఎలా ప్రయాణం చేస్తారో తెలుసు కోవాలంటే కార్పొరేట్ సినిమా చూడాలి.
సినిమా అన్నది పవర్ ఫుల్ మాధ్యమం. దానిని వర్మ వాడుకున్నంతగా ఇంకే డైరెక్టర్ వాడుకోలేదు. ప్రతి ఫ్రేంకు ప్రాణం పోసే సిస్టంను అలవాటు చేశాడు..తనను ఫాలో అయ్యే వారందరికీ. అందుకే వాళ్లు విజేతలుగా నిలిచారు. చరిత్రను తిరగ రాశారు. తమలోని ప్రతిభకు మెరుగులద్దారు. మిగతా వారికి దిమ్మ తిరిగి పోయేలా కోలుకోలేని షాక్ ఇచ్చారు. అలాంటి వారి కోవలోకే భండార్కర్ వస్తాడు. ప్రతి సినిమా సొసైటీని ప్రభావితం చేసేదే. ప్రతి సబ్జెక్టు పవర్ ఫుల్. సినిమా రంగానికి కొత్త పాఠాన్ని నేర్పించారు ఈ మూవీ ద్వారా డైరెక్టర్. నిజాలను తెరపై ఆవిష్కరించడమే కాదు ..పాఠ్యాంశంగా మార్చేలా చేశాడు. రెండు కార్పొరేట్ కంపెనీల మధ్య యుద్ధమే కార్పొరేట్ సినిమా కథ. చూస్తే ఏమున్నదిలే అనుకుంటాం..కానీ సమస్తమంతా ఈ మూవీలోకి వచ్చేలా తీర్చిదిద్దాడు. 2006లో కార్పొరేట్ మూవీని దేశ వ్యాప్తంగా విడుదల చేశాడు. అభిరుచి గల ప్రేక్షకుల మనసులను కదిలించేలా తీశాడు. ఎంతో ఉన్నతంగా బడా కంపెనీల మధ్య జరిగే కహానీని అహ్మదాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో చర్చనీయాంశంగా మారేలా చేశాడు. ఈ సినిమా కథనే ఏకంగా ఈ సంస్థలో పాఠ్యాంశంగా చేర్చడం ..డైరెక్టర్‌కు ఉన్న టాలెంట్..సినిమాకున్న పవర్ ఏమిటో తెలుస్తుంది.
సినిమాలు చూస్తే చెడిపోతారన్న అపవాదును ఈ సినిమా చూశాక మార్చేసుకుంటాం. ప్రతి మూవీ వెనకాల అద్భుతమైన కథ వుంటుంది.. దాని వెనకాల అంతులేని కన్నీళ్లుంటాయి..అన్నది అర్థం చేసుకునే వాళ్లకు తెలుస్తుంది. అందులో వున్న మర్మం ఏమిటో..మథూర్ తీసిని ఈ సినిమా నిజంగా వాస్తవాలను తెలియ చెప్పటమే కాదు..నిత్యం పాఠంగా..ప్రాతః స్మరణీయంగా తలుచుకునేలా చేశాడు. భారతీయులకు రోగ నిరోధక శక్తి ఎక్కువ. ఈ నిజం తెలుసుకున్న విదేశీ కూల్ డ్రింక్ కంపెనీ..ఏ బ్యాక్టీరియ్ కలిసిని డ్రింక్ అయినా అమ్మవచ్చని కన్నేసింది..తన ప్లాన్‌ను చాప కింద నీరులా పకడ్బందీగా అమలు చేసింది. కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. దానినే మిగతా కార్పొరేట్ కంపెనీలు ఫాలో అవుతున్నాయి. డ్రింక్ ఒక్కటే ..కానీ వేర్వేరు రకాలు..వేర్వేరు టేస్ట్‌లు..ఈజీగా ఇండియన్స్ బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను పాటించకుండా పెస్టిసైడ్స్‌ను 30 శాతం కంటే ఎక్కువగా వినియోగించి భారత మార్కెట్‌లో అమ్మేసిందన్న వాస్తవం 2003లో బయట పడింది.
అప్పటిదాకా జరగాల్సిన నష్టం జరిగి పోయింది. లక్షలాది మంది ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా చేసిన ఈ పానియం ఇప్పటికీ దర్జాగా అమ్ముడవుతోంది. అవినీతిని, అన్యాయాన్ని, పాపాన్ని , లోపాలను, పాలకుల నిర్లక్ష్యాన్ని..నిరుద్యోగాన్ని ..ప్రాణాలకు విలువ లేకుండా తీసేయడాన్ని ఈజీగా భరిస్తూనే వున్నాం. కూల్ డ్రింక్‌లో మందులు కలిపారన్న వార్త కేసుగా మారినప్పుడు కొద్ది రోజులు చర్చించాం..ఆ తర్వాత మరిచి పోయాం. అంతటి ఘనమైన చరిత్ర ఇండియన్స్‌కుంది. సామాజిక బలహీనతలనే బలంగా మార్చుకుని వేల కోట్లకు పడగలెత్తిన ఇద్దరు బడా వ్యాపారవేత్తల కథనే కార్పొరేట్ సినిమా. వీరిమధ్య జరిగే ప్రచ్చన్న యుద్ధంలో వారి వెంట ఉన్న వాళ్లు..వారినే నమ్ముకున్న వాళ్లు నిజాయితీగా తమ జీవతాలను అర్పిస్తారు. తమ కంపెనీ బాగుంటే తాము బాగుంటామని నమ్ముతారు. ఎదుటి కంపెనీతో తమకు వైరం ఉన్నట్లు ప్రవర్తిస్తారు. ఆ వ్యాపార దిగ్గజాలు ఒక్కటై పోతే ...పనివాళ్లు బలై పోతారు. కార్పొరేట్ చదరంగంలో ప్రతిరోజు జరిగే కథే ఇది.
అజిత్ మోంగా, మనోజ్ త్యాగిలతో డైరెక్టర్ ఈ కథను రాయించాడు. మథూర్ ఓ విడియో షాపులో డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. కొన్నాళ్లకు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి..చిన్నా చితకా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అక్కడ ఇచ్చే వెయ్యి రూపాయలు సరిపోక ..మస్కట్‌లో ఉన్న వాళ్ల అక్క దగ్గరికి వెళ్లాడు. అక్కడా వర్కవుట్ అవ్వక తిరిగి ముంబైకి వచ్చేసి వర్మ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. రంగీలా సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసి మెల్లగా దర్శకుడిగా మారాడు మథూర్. ఎంత సేపు ఉమెన్ ఎంపవర్‌మెంట్ గురించి అందరూ మాట్లాడతారు. సమావేశాలు నిర్వహిస్తారు. సదస్సులు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఏటా మహిళా దినోత్సవం నిర్వహిస్తారు.. నిజంగా అన్ని రంగాలలో మహిళలు ఎలా ఉంటున్నారో ఎవరైనా స్టడీ చేశారా..దీనినే స్టోరీ లైన్‌గా ఎంచుకున్నాడు మథూర్. ఫ్యాషన్, పేజ్-3, చాందినీ బార్..కార్పొరేట్ సినిమాలు స్త్రీ కేంద్రంగా ఉండేలా తీర్చిదిద్దాడు. ఒక్కొక్కరికి టేకింగ్ లో ఒక్కో స్టయిల్ వుంటుంది..కానీ ఆర్‌జీవిది మాత్రం వెరీ వెరీ స్పషల్. ఆయన స్టయిల్‌ను వందలాది మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ నేటికీ అనుకరిస్తారు.
కృష్ణవంశీ, మథూర్, అనురాగ్ కశ్యప్ లు ..ఇలా కొద్ది మంది మాత్రం భావోద్వేగాలను ఎలా పండించాలో అవగతం చేసుకున్నారు. మంచి డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఇక సినిమా విషయానికొస్తే కార్పొరేట్ కథ ఆద్యంతమూ ఉత్కంఠను రేపుతుంది. ఎప్పుడైనా ఇద్దరి మధ్య, రెండు దిగ్గజాల మధ్య ..సంస్థల మధ్య పోరాటం అంటేనే యాంక్జయిటీ క్రియేట్ అవుతుంది. సంగీతానికి పెద్దగా స్కోప్ లేక పోయినా ..పాత్రల మధ్య బరువైన సన్నివేశాలు..ఆలోచింప చేసే డైలాగ్స్ తప్పకుండా వుంటాయి. ఎస్ ఇఇ కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ నిషి గంధా దాస్ గుప్తా పాత్రలో బిపాసా బసు నటన అమోఘం. కార్పొరేట్ రాజకీయాలకు బలై పోయే నిజాయితీ పరురాలైన ఉద్యోగినిగా మనకు గుర్తుండి పోతుంది. ఇతర పాత్రల్లో రాజ్ బబ్బర్, రజత్ కపూర్ , కేకే మీనన్‌ల నటన అమోఘం. కార్పొరేట్ లుక్‌తో పాటు స్తాయికి తగ్గట్టు పాత్రల ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్‌ను అద్భుతంగా చిత్రీకరించారు. మాటలు ఎక్కడా బోర్ కొట్టించవు. దిగ్గజ కంపెనీల మధ్య పోరాటం ప్రతి నిమిషం ఉత్కంఠ కలిగిస్తుంది. మొత్తం మీద కార్పొరేట్ వాతావరణాన్ని మరిచి పోలేని రీతిలో మలిచిన ఘనత మథూర్ దే.
అర్థం కాని కార్పొరేట్ కుట్రలను ..లైఫ్ స్టయిల్‌ను ఊహించని విధంగా తెరకెక్కించాడు. అత్యంత సామాన్యమైన పాత్రలు..గంభీరమైన వాతావరణం..పవర్ ఫుల్ డైలాగులు..ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ. అంతా తెలిసినట్టు అనిపించినా..ఏదీ ఒక పట్టాన చేతుల్లోకి తీసుకోకుండా చేశాడు. ప్రతి ప్రక్షేకుడు అందులో లీనమై పోయేలా ప్లాన్ చేశాడు. ప్యూన్ అండ్ బాస్ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ఉంటుందో ప్యూన్ పాత్ర ద్వారా చెప్పిస్తాడు డైరెక్టర్. కంపెనీ డబ్బు మీద ఇతర దేశాలు తిరగడం బాస్‌ల పని అంటూ మరో ప్యూన్ కామెంట్ చేస్తాడు. అయితే జీతాలు ఇచ్చే వాళ్ల మీద జోకులు వేస్తే ఎలా వుంటుందో ఒక్కోసారి కొందరికి అర్థమవయ్యేలా నిర్ణయాలు ఉంటాయి. ప్రతి ఆరు నెలలకోసారి ప్యూన్లను మార్చేస్తారు..ఈ బాస్‌లు..వీళ్ల సిస్టమే అంత. వాళ్లకేమో జీతాలు..మనకేమో కష్టాలు..అంటాడు మరో ప్యూన్. మంత్రి గారి గన్‌మెన్, ప్యూన్లు, అటెండర్ల సంగతి సరే సరి. గాసిప్స్ ఎక్కువగా వీరి మీదే ఉంటాయి. నటీ నటుల గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు..రోజుకో కథ వస్తూనే వుంటుంది. కేవలం సిట్టింగ్‌ల కోసమే ప్రత్యేక గదులుంటాయి..వాటి మధ్య అడ్డుగోడలు ఉండడం సహజం. ఇదే సినిమాను తారాస్థాయికి తీసుకు వచ్చేలా చేసింది.
పవర్ ఫుల్ డైలాగ్‌లు అడుగడుగునా మనకు తారసపడతాయి. ఉమెనైజింగ్, మూఢ భక్తి, స్వామీజీలను అనుసరించడం..సొసైటీని ఇంప్రెస్ చేసే ప్రతి అంశంపై ఎక్కు పెట్టాడు మథూర్ భండార్కర్. పొలిటికల్ లీడర్ల జోక్యం, లంచాలు, అవినీతి, సెటిల్‌మెంట్లు, దందాలు, షేర్స్, నీతికి అవినీతికి మధ్య సంఘర్షణ, వ్యక్తిగత జీవితాల్లో ఒంటరితనం, ప్రేమానురాగాలు, గెలుపు ఓటముల మధ్య ఊగిసలాట..అంతేనా డబ్బు..అధికారం మధ్య నిత్యం నడిచే సన్నివేశాలు బలంగా ఆకట్టుకుంటాయి. ఆలోచింప చేస్తాయి. కొత్తగా సినిమా రంగంలోకి ప్రవేశించిన వాళ్లకు..టాలెంట్ నే నమ్ముకుని బతుకుతున్న వాళ్లకు..క్రియేటివిటి ని పండించే వాళ్లకు ఈ సినిమా దారి చూపుతుంది..పాఠంగా ఉపయోగ పడుతుంది. కంపెనీ దిగ్గజాల మధ్య జరిగే లావాదేవీలు..వ్యాపారాలు..ఎత్తుకు పై ఎత్తులు..కుయుక్తులు..గెలుపు ఓటములు..ఇలా ప్రతిది ఏం జరుగుతుందో..తెలుసు కోవాలంటే కార్పొరేట్ చూడాల్సిందే. 40 కోట్లు పెట్టి తీస్తే 163 కోట్లు వసూలు చేసి రికార్డులను తిరగ రాసింది.
అద్భుతంగా నటించిన బిపాస బసు ఎన్నో అవార్డులు గెలుచుకుంది. జిఐఎఫ్ ఏ బెస్ట్ నటిగా, బాలీవుడ్ మూవీ అవార్డును స్వంతం చేసుకున్నారు. ఆనంద్ లోక్ పుష్కర్, ఆనంద్ బజార్ పత్రిక అవార్డులను పొందారు. స్టార్ స్క్రీన్ అవార్డుతో పాటు ఫిలిం ఫేర్, జీ సినీ అవార్డులు అందుకున్నారు. యుద్ధంలో గెలవాలంటే కత్తులు, తుపాకులు ఉండాల్సిన పనిలేదు..కావాల్సిందల్లా ప్రత్యర్థులెవరో..వాళ్ల బలహీనతలు ఏమిటో తెలిస్తే చాలు..సగం విజయం అందుకున్నట్టే. ఇది కంపెనీలకు, వ్యాపార వేత్తలు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకే కాదు మనకూ వర్తిస్తుంది. వీలైతే కార్పొరేట్ ను చూడండి..మిమ్మల్ని మీరు ఎలా అధిగమించాలో తెలుసుకుంటారు. సక్సెస్ సాధించడం చాలా సులభం..కానీ దానిని కడదాకా నిలబెట్టు కోవడమే కష్టం. ఇదే కార్పొరేట్ అంతిమ సూత్రం. పూరీ అన్నట్టు బుల్లెట్స్ నెవ్వర్ కాంప్రమైజ్ - కదూ..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి