ప్రపంచ చైతన్యపు గొంతుక..ప్రజా యుద్ధ నౌక - బాబ్ మార్లే ..!
యుద్ధాన్ని నిరసించినవాడు..ప్రజలను ప్రేమించిన వాడు. గుండెల్లో చైతన్య దీప్తులను వెలిగించిన మహోన్నత మానవుడు. బతికింది కొన్నేళ్లయినా కొన్ని తరాల పాటు వెంటాడేలా తన గాత్రాన్ని జనం కోసం అంకితం చేసిన ధీరోదాత్తుడు బాబ్ మార్లే. మోస్ట్ ఫేవరబుల్ సింగర్‌గా ..సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో కోట్లాది ప్రజలు వెతుకుతున్న సాంస్కృతిక యోధుడిగా ఆయన గుర్తుండి పోతాడు. అతడి కళ్లల్లో వేగం..అతడి చూపుల్లో ఆర్ద్రత..అతడి గొంతులో మార్మికత ..అతడి నడతలోని మానవత కలిస్తే అతడే బాబ్ . ప్రపంచాన్ని తన పాటలతో ఊపేసిన మొనగాడు. శాంతి కోసం పాటలు కట్టాడు. ప్రజల వైపు నిలబడ్డాడు. హింసకు వ్యతిరేకంగా ఎన్నో గీతాలు రాసి ఆలాపించాడు. ఏకంగా తానే ఓ పాటల సైన్యాన్ని తయారు చేశాడు. పుట్టుకతో జమైకన్ అయిన బాబ్..ఇపుడు పాటల పాలపుంత. చనిపోయి ..భౌతికంగా మన మధ్య లేక పోవచ్చు గాక..కానీ ఆయన సృజియించిన గాత్రపు మాధుర్యం ఇంకా..ఇంకా మోగుతూనే ఉన్నది. రాజ్య హింసకు పాల్పడే పాలకుల నుండి మార్కెట్ , కార్పొరేట్ శక్తుల కుయుక్తులు, మోసాలకు పాల్పడే వారి వెన్నులో తూటాలై పేలుతూనే ఉన్నాయి. చరిత్రను చెరిపి వేయవచ్చు..కానీ జనం గుండెల్లో నిక్షిప్తమై పోయిన ఆ జ్ఞాపకాలను ఎట్లా చెరిపి వేస్తారు..అందుకే నేటికీ ధీరోదాత్తమైన ..ఉద్విగ్నమైన ఆనవాళ్లలో బాబ్ మెరుపు తీవెలా కనిపిస్తున్నారు. మనతో పాటు ఆడుతున్నాడు..పాడుతున్నాడు..మన కోసం పాటలు అల్లాడు. తన కోసం కాకుండా ప్రపంచానికి శాంతి కావాలని కోరాడు. ఆలాపించాడు. ఆక్రోశించాడు బాబ్.
ఎక్కడైనా ఊరుకున్నాడా ..లేదు..ప్రతి క్షణం తన గాత్రానికి మెరుగులు దిద్దాడు. జన సంక్షేమం కోసం ఆలోచించాడు. సమస్యలను నిలదీసి ప్రశ్నించాడు. 1945 ఫిబ్రవరి 6న ట్రెంచ్ టౌన్‌లో జన్మించాడు బాబ్. కేవలం 36 ఏళ్లలోనే ఈ లోకాన్ని వీడాడు ఈ పాటల కెరటం. స్కిన్ క్యాన్సర్ సోకి చనిపోయాడు. గాయకుడిగా, గేయ రచయితగా, సంగీతకారుడిగా బాబ్ మార్లే పేరు తెచ్చుకున్నారు. ఆయన వారసత్వాన్ని జెగ్గీ మార్లే కొనసాగిస్తున్నారు. ఆయన అసలు పేరు రాబర్ట్ నెస్టా మార్లే, ఓం..ఇంటర్నేషనల్ మ్యూజికల్ అండ్ కల్చరల్ ఐకాన్‌గా మార్లే గుర్తింపు పొందారు. రెగ్గే, స్కా, రాక్ స్టీడీ పేరుతో ప్రదర్శనలు ఇచ్చారు. 1963లో మ్యూజిక్ టీంను ఏర్పాటు చేశారు. వోకల్ స్టయిల్‌లో పాటలు అల్లాడు. వెయిలర్స్ స్క్రాచ్ పెర్రీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ ఆల్బంను రిలీజ్ చేశారు. ఒక్కసారిగా ఈ లోకం నివ్వెర పోయింది..ఆ గొంతును విని. కోట్లాది ప్రజల సమూహం బాబ్ ..బాబ్ అంటూ ఊగి పోయింది. ఆయన గొంతులో లీనమైంది. 1977లో రిలీజైన ఆల్బంను 75 మిలియన్ల ప్రజలు విన్నారు. బ్రిటిష్ చార్ట్స్‌లో 56 వారాల పాటు మార్లే పాటలు టాప్ వన్‌లో నిలిచాయి. ఎక్సోడస్, వెయిటింగ్ ఇన్ వెయిన్, జామింగ్, ఒన్ లవ్ పాటలు ఉర్రూతలూగించాయి.
1978లో మరో ఆల్బం కాయా పేరుతో విడుదల చేశాడు మార్లే. ఈజ్ దిస్ లవ్ , సాటిస్ ఫై మై సోల్ పాటలు రికార్డులు తిరగ రాశాయి. రెగ్గె ఆల్బం ఆల్ టైం రికార్డుగా ఇప్పటికీ నమోదు కావడం ఆయన గొంతుకున్న మహత్యం అనే చెప్పక తప్పదు. రాస్తాఫారీ పేరుతో ఎన్నో సాంగ్స్ రాశాడు. గ్లోబల్ సింగర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు బాబ్. మార్లే తో పాటు నెవిల్లే లివింగ్‌స్టన్ లు ఇద్దరు చిన్నతనంలో స్నేహితులు. జూనియర్ హైస్కూల్‌లో ఉన్నప్పుడే వీరిద్దరు కలిసి మ్యూజిక్ గ్రూప్‌గా ఏర్పడ్డారు. నెవిల్లే తన పేరును వెయిలర్స్‌గా మార్చుకున్నారు. 1962 నుండి 1972 దాకా మ్యూజిక్ ప్రపంచంలో మార్లేదే రాజ్యం. ఫిబ్రవరి లో మార్లే నాలుగు పాటలను రికార్డు చేశాడు. జడ్జ్ నాట్, ఒన్ కప్ ఆఫ్ కాఫీ, డు యూ స్టిల్ లవ్ మి. టెర్రర్ పేరుతో ఫెడరల్ స్టూడియోలో తయారు చేశాడు. మ్యూజిక్ ప్రొడ్యూసర్ లెస్‌లై కాంగ్ వీటికి సంగీతం సమకూర్చారు. ఒన్ కప్ ఆఫ్ కాపీ పేరుతో మ్యూజిక్ ఆల్బంను రిలీజ్ చేశారు. 1963లో బాబ్ మార్లే, బన్నీ వెయిలర్, పీటర్ జోష్, జూనియర్ బ్రెయిత్ వెయిట్, బేవర్లీ కెల్సో, చెర్రీ స్మిత్‌లు టీం సభ్యులు. వెయిలింగ్ రూడ్ బాయ్స్ గా తమ పేరును మార్చుకున్నారు. సిమ్మర్ డౌన్ పేరుతో విడుదల చేసిన ఆల్బం 70 వేల కాపీలు అమ్ముడు పోయింది. జమైకన్ సింగర్స్ తట్టుకోలేక పోయారు.
1966లో మార్లే రీటా ఆండర్సన్‌ను వివాహం చేసుకున్నారు. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1969లో డూ ద రెగ్గె పేరుతో రిలీజ్ చేశాడు. సోల్ షేక్ డౌన్ పార్టీ, స్టాప్ ద ట్రైన్, కాషన్, గో టెల్ ఇట్ ఆన్ ద మౌంటేన్, సూన్ కమ్, కాంట్ యు సీ, సోల్ క్యాప్టివ్స్, చీర్ అప్, బ్యాక్ అవుట్ , డూ ఇట్ ట్వైస్ సాంగ్స్ వరల్డ్ మ్యూజిక్ మార్కెట్‌ను షేక్ చేశాయి. టైం ఈజ్ ఆన్ మై సైడ్ సాంగ్ ఊపేసింది. యుస్ చార్ట్స్లో రికార్డుల మోత మోగించింది. ద న్యూ యార్క్ టైమ్స్‌లో సెన్సేషనల్ సింగర్ గా పేర్కొంటూ బాబ్‌ను ఆకాశానికెత్తేశారు. స్టే విత్ మి, స్పిల్ష్ ఫర్ మై స్ప్లాష్ సాంగ్స్ కు జనం ఫిదా అయ్యారు. 1972లో లండన్‌లోని సీబీఎస్ రికార్డ్స్‌లో పాడేందుకు సంతకం చేశాడు. రాక్ స్టార్‌గా, పాప్ పాటలతో, రెగ్గె ప్లాట్ ఫాంలో ఉర్రూతలూగించాడు. రెబల్ సింగర్‌గా పేరు తెచ్చుకున్నాడు మార్లే. జమైకాలోని మట్టితనాన్ని తన గొంతులోకి చేర్చుకుని పాటలు అల్లాడు బాబ్. ఎంటైర్ ఫ్యామిలీ మ్యాన్‌గా వినుతికెక్కాడు. 1976లో రికవరీ అండ్ రైటింగ్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. అక్కడ స్టూడియోలలో పాటలు కట్టాడు.
1978లో తిరిగి జమైకాకు పయనమయ్యాడు. పీపుల్స్ నేషనల్ పార్టీ లీడర్ మైఖేల్ మాన్లీతో పాటు జమైకా లేబర్ పార్టీ లీడర్ ఎడ్వర్డ్ సాగాకు మద్ధతు తెలిపాడు. పలు ప్రదర్శనలు ఇచ్చాడు. బాబ్ , వెయిలర్స్ కలిసి 11 మ్యూజిక్ ఆల్బంలు రూపొందించి రిలీజ్ చేశారు. బేబిలాన్ బై బస్ ..ఆల్ టైం రికార్డుగా నమోదైంది. 1979లో జింబాబ్వే, ఆఫ్రికా యునైట్, వేక్ అప్ అండ్ లైవ్, సర్వైవల్ పేరుతో ఆఫ్రికన్లకు అండగా పాటలు కట్టాడు. దక్షిణాఫ్రికా పాలకుల దమనకాండను ప్రశ్నించాడు. పాటలతో నిలదీశాడు బాబ్. వార్ వద్దంటూ పాడిన సాంగ్ జనాన్ని ఆకట్టుకుంది. జింబాబ్వే ఇండిపెండెన్స్ డే కు ప్రత్యేక ఆహ్వానితుడిగా అప్పటి సర్కార్ బాబ్‌ను ఆహ్వానించింది. 1980లో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ లో జరిగిన ప్రదర్శనలో బాబ్ మార్లే ఆడుతూ ..పాడుతూ జనాన్ని ఉర్రూతలూగించారు. ఆయనకు ఎన్నో అవార్డులు , పురస్కారాలు లభించాయి. పలు చోట్ల విగ్రహాలను ఏర్పాటు చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
1976లో రోలింగ్ స్టోన్ బ్యాండ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించారు. 1978లో యునైటెడ్ నేషన్స్ పీస్ మెడల్ ను ప్రకటించింది. జమైకన్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ మెరిట్‌తో సత్కరించింది. 1994లో రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ద ఫేమ్ ను అందజేసింది. టైమ్ మేగజైన్ 1999లో ఆల్బం ఆఫ్ ద సెంచరీగా ప్రచురించింది. 2001లో ఏ స్టార్ ఆన్ ద హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ , ఇదే ఏడాదిలో గ్రామీ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుకు ఎంపిక చేసింది. 2004లో ప్రపంచ వ్యాప్తంగా 100 మంది ప్రభావిత సింగర్స్‌ను ఎంపిక చేయగా అందులో ప్రధానమైన సింగర్ గా బాబ్ మార్లేను పేర్కొంది. బీబీసీ ఒన్ లవ్ సాంగ్ ఆఫ్ ద మిలీనియంగా ప్రకటించింది. యుకెలో ఆయన జ్ఞాపకార్థం భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. గ్రామీ హాల్ ఆఫ్ ఫేమ్ గా 2010లో రెగ్గె ఆల్బంను ప్రకటించింది. కింగ్‌స్టన్‌లో 2006లో ఆయన స్మృతికి చిహ్నంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సెర్బియాలో 2008లో మరో విగ్రహాన్ని ఉంచారు. పలు డాక్యుమెంటరీలు తీశారు. రాస్తాఫారీ మూవ్ మెంట్‌లో కొన్నేళ్లుగా ఉన్నారు.
ఆ తర్వాత అనారోగ్యం ఆయనను వెంటాడింది. యూరప్‌లో బాబ్ బ్యాండ్ టీం పర్యటించి పలు ప్రదర్శనలు ఇచ్చింది. మిలాన్ లో నిర్వహించిన ప్రోగ్రాంలో లక్ష మందికి పైగా పాల్గొన్నారు. అక్కడి నుండి యుఎస్ , న్యూయార్క్ సిటీలో పాల్గొన్నారు. పెన్సీస్లెవేనియాలోని పీటర్స్ బర్గ్‌లో ఆఖరి ప్రదర్శన ఇచ్చారు బాబ్. పాటల ప్రదర్శన కోసం మియామి వెళ్లిన ఈ గ్లోబల్ పీపుల్స్ సింగర్ 1981 మే 11న ఇక సెలవంటూ వెళ్లిపోయాడు. జమైకా ప్రభుత్వం ..దేశం యావత్తు ఈ పాటల యుద్ధ నౌకకు వినమ్రంగా కన్నీటితో వీడ్కోలు పలికింది. లక్షలాది జనం వెంట రాగా బాబ్ లోకాన్ని వీడాడు మనల్ని ఒంటరిగా వదిలేసి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి