!..రాచాల నుంచి రాజధాని దాకా ..!..శీనన్న ప్రస్థానం ..!
పాలమూరు జిల్లాలోని రాచాల పల్లె ఇవాళ గర్వ పడుతున్నది. ఇదే పల్లెకు చెందిన వి.శ్రీనివాస్ గౌడ్ ..గ్రూప్ -1 అధికారిగా..ఉద్యమ సంఘాల అధినేతగా, గౌరవ అధ్యక్షుడిగా..తెలంగాణ ఉద్యమ నేతగా ..ఎమ్మెల్యేగా ప్రారంభమైన ప్రస్థానం అమాత్యునిగా ఎదిగేలా చేసింది. ఇదంతా ఒక్కరోజులో సాధ్యమైనది కాదు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ..ఉన్నత స్థానాన్ని అధిరోహించారు. విద్యావంతుడిగా, మేధావిగా, ఉన్నతాధికారిగా , రాజకీయ నేతగా పరిణతి సాధించిన గౌడ్ అంచెలంచెలుగా తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ను స్వంతం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన అలుపెరుగని పోరాటంలో, ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఉద్యోగులను కూడగట్టడంలో ఆయన కీలక భూమిక పోషించారు. 14 ఏళ్లుగా జరిగిన అలుపెరుగని పోరాటంలో గులాబీ బాస్ కేసీఆర్ వెన్నంటే వున్నారు. మొదటిసారి ఏర్పడిన కొత్త రాష్ట్రంలో గౌడ్ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రెండోసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు.
తనకంటూ నమ్మకమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భారీ అంచనాల మధ్య గెలుపు స్వంతం చేసుకున్నారు. ఏకంగా కేసీఆర్ ప్రకటించిన కేబినెట్‌లో నూతన మంత్రివర్యులుగా కొలువుతీరారు. పల్లెటూరుకు చెందిన గౌడ్ ..ఇపుడు రాజధానిలో విస్మరించని నేతగా ఎదిగారు. వ్యక్తి నుంచి వ్యవస్థగా మారారు. ప్రజలను ఎక్కువగా ప్రేమించే ఆయన పట్టుపడితే అది అయ్యేంత దాకా నిద్రపోని మనస్తత్వం శ్రీనివాస్ గౌడ్ స్వంతం. తాను నమ్మితే..తాను ప్రేమిస్తే పేదోడైనా..ఏ కులానికి చెందిన వారైనా..ఏ మతం వారైనా సరే అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుంటారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వృత్తి పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా ఎక్కడా బెదరలేదు..అదరలేదు. ఒక్కసారి నమ్మారంటే ఇక వెనక్కి తగ్గని మనస్తత్వం ఆయన స్వంతం.
అడ్డాకుల మండల పరిధిలోని రాచాల గ్రామంలో 16 మార్చి 1969లో జన్మించారు. అన్ని రంగాలలో ఆయనకు మంచి పట్టుంది. విద్యాధికుడిగా, మేధావిగా, ఉద్యోగ సంఘాల నేతగా, ఉద్యమకారుడిగా పనిచేసిన అనుభవం రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకునేందుకు దోహద పడింది. బిఎస్‌సీ, పిజిడిసిజె, పిజిడిడబ్ల్యుఎంఎంతో పాటు ఇటీవల అమెరికాకు చెందిన యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 48 ఉద్యోగ సంఘాలకు పైగా ఆయన గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఛైర్మన్‌గా పలుమార్లు ఎన్నికయ్యారు. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న గౌడ్ ను జిల్లా వాసులు శీనన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మాటలో కరుకుదనం ఉన్నప్పటికీ పని చేయడంలో..ఎవరైనా ఆపదలో వుంటే ఆదుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. హైదరాబాద్‌లో ఆయనకు ఎనలేని ఫాలోయింగ్ ఉంది. కూకట్‌పల్లి, రాజేందర్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేయడంతో చాలా మందితో గౌడ్‌కు అనుబంధం ఉన్నది. మధ్యతరగతి కుటుంబం కావడం..గ్రామాల సమస్యలు తెలియడంతో ఎక్కువగా అభివృద్ధి గురించే ఆలోచిస్తారు. ఆ దిశగా పనులు చేపట్టాలన్నది ఆయన కల. దానిని నిజం చేసేందుకు అలుపెరుగక కృషి చేస్తున్నారు.
వలసలకు పెట్టింది పేరైన పాలమూరు జిల్లాలో ఏ ఒక్కరు ఇతర ప్రాంతాలకు వెళ్లరాదనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా తెలంగాణలో ఏ ఎమ్మెల్యే చేయని రీతిలో అభివృద్ధి పనులను తీసుకు వచ్చిన ఘనత ఆయనదే. వి.నారాయణ గౌడ్, శాంతమ్మలు గౌడ్ తల్లిదండ్రులు. గ్రూప్ -1 అధికారిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల వేధింపులను తట్టుకుని నిలబడ్డారు. అక్రమ కేసులు బనాయించినా ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఎమ్మెల్యేగా గెలిచారు. ఇతరుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు. అయినా విజయం ఆయననే వరించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి ఎర్రశేఖర్ పై భారీ మెజారిటీతో గెలుపొంది తన హవాకు అడ్డు లేదని నిరూపించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడిగా, తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ కో ఛైర్మన్ గా, 2004 నుండి 2010 దాకా జరిగిన రాష్ట సాధన పోరాటాల్లో, ఉద్యమాల్లో, ఆందోళనల్లో ఆయన ముందు వరుసలో నిలిచారు. గులాబీ బాస్ కు వెన్నంటి వున్నారు.
దీంతో తననే నమ్ముకున్న గౌడ్‌కు మహబూబ్‌నగర్ అసెంబ్లీ సీటును కేటాయించారు. తిరిగి ఆయనకే పట్టం కట్టారు. తనపై పెట్టుకున్న బాస్ నమ్మకాన్ని గౌడ్ నిలబెట్టుకున్నారు. ఏకంగా కేసీఆర్ ఊహించని రీతిలో కేబినెట్ లో చోటు కల్పించారు. ప్రాధాన్యత కలిగిన శాఖలను ఆయనకు కేటాయించారు. దీంతో శ్రీనివాస్‌గౌడ్ పరపతి మరింత పెరిగింది. ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కడంతో గత 60 ఏళ్లుగా వెనక్కి నెట్టి వేయబడిన, అన్ని రంగాలలో అన్యాయానికి గురైన పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుందని ఇక్కడి ఉమ్మడి జిల్లా వాసులు నమ్మకంతో ఉన్నారు.
అభివృద్ధి పనుల్లో ఆయనే ముందంజ - కేసులు వేసినా..మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో ఆయన అందరి ఎమ్మెల్యేల కంటే ముందంజలో ఉన్నారు. ఆయన ఎన్నికైన తర్వాత తక్షణమే అప్పన్నపల్లి వంతెనను ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు దీంతో మోక్షం లభించినట్లయింది. బైపాస్ రోడ్డును మంజూరు చేయించారు. కొత్తగా కలెక్టరేట్ భవనం ప్రారంభానికి నోచుకోనుంది. రియల్ ఎస్టేట్ పరంగా ఈ ప్రాంతం జోరందుకుంది.
రాజధానికి దగ్గరగా కావడంతో కేటీఆర్‌తో కలిసి జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న దివిటిపల్లిలో ఐటీ కారిడార్‌ను తీసుకు వచ్చారు. ఇక్కడే ఐటీ కంపెనీలు కొలువు తీరేలా కృషి చేస్తున్నారు. బిపిఓ, కేపీఓ, లాజిస్టిక్ తదితర రంగాలలో చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులకు, నిరుద్యోగులకు కొంత మేర ఉపాధి లభించనుంది. చెల్లా చెదురుగా ఉన్న మయూరి నర్సరీని ఆధునీకరించారు. ఇపుడు జిల్లాలో ఇదో పర్యాటక ప్రాంతంగా వినుతికెక్కింది. 200 ఎకరాల సర్కారు భూమిలో రోప్ వే, యోగా సెంటర్, అడ్వంచర్ గేమ్స్, తదితర సదుపాయాలను కల్పించారు. జిల్లాకే గర్వకారణంగా నిలిచేలా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కొట్లాడి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇక్కడికి తీసుకు వచ్చారు. దీంతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది. 75 ఎకరాల స్థలంలో 480 కోట్ల రూపాయలతో 150 సీట్లతో, 500 పడకల ప్రభుత్వ ఆస్ప్రత్రిగా మార్చడంలో గౌడ్ కీలకంగా వ్యవహరించారు. రోజుకు 800 ప్రసవాలు జరిగేలా కృషి చేశారు. దీంతో సూపర్ స్పెషాలిటీ వైద్య శాలలు, డెంటల్ కాలేజీని తీసుకు వచ్చేందుకు కంకణం కట్టుకున్నారు. 96.7 కోట్ల నిధులను బైపాస్ కు మంజూరు చేయించారు. అంతేకాక 166.5 కోట్ల తో అదనంగా నాలుగు లైన్ల రోడ్లను వేయాలని సీఎంను కోరారు. దివిటిపల్లి నుండి ధర్మాపూర్ వరకు మరో రోడ్డును కూడా ప్లాన్ చేశారు. 16 కోట్ల నిధులతో పెద్ద చెరువును సుందరీకరణ చేపట్టారు.
ఆధునిక హంగులతో 24 కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్‌ను నిర్మించనున్నారు. జిల్లా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా మోడ్రన్ బస్టాప్‌ను ఏర్పాటు చేయించారు. నూతన హంగులతో లెడ్ వీధి దీపాలతో రాజేందర్ నగర్ - రైల్వే స్టేషన్ రోడ్డును తీర్చిదిద్దారు. 210.78 కోట్లతో నిరుపేదలకు ఉండేందుకు గాను దివిటిపల్లి, క్రిష్టియన్ పల్లి, వీరన్నపేటలలో 3700 డబుల్ బెడ్ రూంలను ఏర్పాటు చేయించారు. మరో 10 వేల కు పైగా ఇండ్లను కట్టించి ఇచ్చేందుకు ప్లాన్ రూపొందించారు. ఐటీ పార్క్ కోసం ఇప్పటికే 60 కోట్ల నిధులు మంజూరు చేయించారు. 500 ఎకరాల విస్తీర్ణంలో కంపెనీలు కొలువు తీరనున్నాయి. 30 వేల మందికి పైగా ఇక్కడే ఉద్యోగాలు లభించేలా చూస్తున్నారు. నీటి వసతి కల్పించేందుకు మిషన్ భగీరథను చేపట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలోని 100కు పైగా చెరువుల్లో నాలుగు దశల్లో 39.78 కోట్ల ఖర్చుతో పూడిక తీయించారు. మత్స్యకారులకు చేపల పెంపకం ఉపాధిగా మారేలా చేశారు. రైతుల కోసం మార్కెట్ యార్డులో భోజన, మార్కెటింగ్ , రవాణా సదుపాయాలను కల్పించారు. 14 కోట్ల రూపాయలతో ఏకంగా రైతు బజార్ ను ఏర్పాటు చేయనున్నారు. 6 కోట్ల రూపాయలతో నూతన జంతు వధశాలతో పాటు 7 కోట్ల రూపాయలతో పాత మార్కెట్‌ను అభివృద్ధి పర్చడం, మోడ్రన్ రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నారు.
బాయ్స్ జూనియర్ కాలేజీలో యోగా షెడ్‌ను ఏర్పాటు చేయించారు. పైపులైన్ల ద్వారా ప్రతి రోజు మంచి నీళ్లు వచ్చేలా కృషి చేశారు. 40 కోట్లతో 22 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట పనిచేసేలా కృషి చేశారు. 61.50 కోట్ల నిధులతో పాలమూరు యూనివర్శిటీలో నూతన భవనాల నిర్మాణం, పాఠశాలలు, బాలుర, బాలికల కాలేజీల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. దేవాలయాల అభివృద్ధికి తన వంతు పాటుపడుతున్నారు. శిథిలావస్థలో ఉన్న 80 దర్గాలు, మసీదులను ఆధునీకరించడం చేశారు. 4 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్మశాన వాటిక కోసం కేటాయించారు. 60 లక్షలతో ప్రహరీగోడను నిర్మించారు. కోటి రూపాయలతో క్రిష్టియన్ భవనానికి నిధులు మంజూరు చేయించారు. సామాజిక వర్గాల ఆత్మీయ భవనాలకు నిధులు కేటాయించారు. కళాభారతికి 7 కోట్లు మంజూరు చేయించారు. 2, 30, 432 మందికి పెన్షన్లు అందజేశారు.
ఇప్పటికే 2 కోట్ల 47 లక్షలు మంజూరు చేశారు. కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా 396 మంది లబ్ధిదారులకు 8.04 కోట్లు పంపిణీ చేశారు. షాదీ ముబారక్ లో భాగంగా 723 మంది లబ్ధిదారులకు 4.78 కోట్లు అందజేశారు. రైతు బంధు పథకంలో భాగంగా 11 వేల 415 మంది రైతులకు 21 కోట్లు పంపిణీ చేశారు. 28 కోట్ల 10 లక్షలతో 53 వేల 175 గొర్రెలను ఇచ్చారు. సబ్సిడీపై ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రుణాలు వచ్చేలా పాటుపడ్డారు. 63.77 కోట్లతో 2100 మినీ ట్రాన్స్ ఫార్మర్లు, 11 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 78 శాతం సీసీ రోడ్లు వేయించారు. ప్రతి రోజు పట్టణంలో 4 కేంద్రాలలో కేవలం 5 రూపాయలకే భోజనం అందజేసేలా చర్యలు చేపట్టారు. ప్రతి తాండాను గ్రామ పంచాయతీగా మార్చనున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేగా 3 వేల 915 కోట్ల నిధులను తీసుకువచ్చి రికార్డు సృష్టించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు మరింత జరగనున్నాయని ఇక్కడి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి